చేనేతకు చేదోడు ఏది?

దేశంలో గడిచిన మూడేళ్లలో చేనేత పథకాల కింద లబ్ధి పొందిన కార్మికుల సంఖ్య  ఆశాజనకంగా ఉన్నా,  ఈ రంగం వైపు యువత పెద్దగా మొగ్గుచూపడం లేదు. జాతీయ చేనేత అభివృద్ధి పథకం కింద 8,97,854 మంది, సమగ్ర చేనేత క్లస్టర్ అభివృద్ధి పథకం కింద 23,909, నూలు సరఫరా పథకం కింద 6,57,999 చేనేత వీవర్స్ కాంప్రహెన్సివ్ వెల్ఫేర్ స్కీం క్రింద 3,10,200 కార్మికులు లబ్ధిపొందారు. ఆకలిచావులు బలవన్మరణాలు వలసలకు చిరునామాగా మారిన ఈ చేనేత రంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం  తగిన విధంగా పాటుపడుతున్నది.   నేత కార్మికులకు ముడిసరుకు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, దేశీయ/ విదేశీ మార్కెట్లలో చేనేత హస్తకళల ఉత్పత్తుల మార్కెటింగ్, మౌలిక వసతులు పరికల్పన   సాంకేతిక శిక్షణ, చేనేత కార్మికులకు తగిన ఉపాధి ముద్ర రుణాలు హస్తకళల రంగంలో నైపుణ్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. గడిచిన మూడేళ్లలో హ్యాండ్ మేడ్ కార్పెట్లతో సహా హస్తకళ ఎగుమతుల్లో సానుకూల వృద్ధి సాధించడం శుభ పరిణామం. అలాగే గ్రీన్ ఫీల్డ్/బ్రౌన్ ఫీల్డ్ ప్రాంతాల్లో  ఏడు ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ రీజియన్ మరియు అపేరల్(పీఎమ్ మిత్ర) పార్కులు ఏర్పాటు చేయుటకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటి కొరకు ఏడేళ్ల కాలానికి రు.4445 కోట్లు కేటాయించింది. అలాగే రాష్ట్ర ,  కేంద్ర సుంకాల రాయితీ పథకం మార్చి 31, 2024 వరకు కొనసాగించనుంది.  సాంకేతిక వస్త్ర రంగాన్ని ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికి నేషనల్ టెక్స్ టైల్ మిషన్ ఏర్పాటు ఆహ్వానించదగ్గ పరిణామం.  కొన్ని విషయాల్లో నెమ్మదితనం ఉన్నది. గిరాకీకి అనుగుణంగా మార్కెట్ సౌకర్యం కల్పించకపోవడం, పత్తి, నూలు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతంగా పెరిగిపోవడం, నిరంతర ఉపాధి ఉండకపోవడం, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి  ఆర్డర్లు తక్కువగా ఉండటం వల్ల కార్మికులకు ఉపాధి అందని ద్రాక్షగా మారింది.

చేనేత సహకార సంఘాలేవి?

తెలంగాణ రాష్ట్రంలో చేయూత పథకం, చేనేత మిత్ర లాంటి పథకాలు అమలు చేసినా.. నిధుల కొరతతో చేనేత రంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కార్మికుల కష్టాన్ని పెట్టుబడి వ్యయాన్ని తగ్గించే విధానాలు ఏవీ చేనేత రంగంలో రాకపోవడం, వారు నేసే వస్త్రాల విక్రయాలకు అనుగుణమైన మార్కెట్ లేకపోవడం వలన చేనేత రంగం నష్టాల బాటలో పయనిస్తోంది. చేనేత కార్మికులకు సరైన సహకారం లేక పెట్టుబడి వ్యయం అందక ఇతర రంగాలకు వలస పోతున్నారు. వరంగల్​లో మెగా జౌళి పార్క్ సిరిసిల్లలో మరమగ్గాల పార్క్ ప్రతిపాదనలకే పరిమితం అయ్యాయి. సిరిసిల్లలో,  టెక్స్​టైల్ పార్కులో ఆధునిక మరమగ్గాలపై వస్త్రోత్పత్తి నిలిచిపోవడం వల్ల 1500 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. అలాగే గత నాలుగేళ్లుగా చేనేత సహకార సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదు. నాలుగేళ్లుగా ప్రతి 6 నెలలకు ఒకసారి గడువు పొడిగిస్తూ పాలకవర్గాలను పర్సనల్ ఇన్​చార్జిలుగా కొనసాగిస్తున్నారు. ఎన్నికలు లేకపోవడం వల్ల వాటి పరిధిలో చేనేత కార్మికులకు చేయూత కరువైంది. పలు సంఘాలు నష్టాల్లో కూరుకుపోయి కార్యకలాపాలు నిలిచిపోయాయి. ప్రభుత్వ నుంచి తగిన ప్రోత్సాహం, సబ్సిడీ రుణాలు అందక పోవడం వల్ల చేనేత కార్మికుల జీవనం దుర్భరంగా మారింది. 

దిద్దుబాటు చర్యలు అవసరం

చేనేత వస్త్రాలు ఎగుమతులపై కేంద్రంతో పాటు,  రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించాలి. నవ్యత, నైపుణ్యం, నాణ్యత ఎగుమతులకు ప్రాణప్రదమైనవి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక డిజైన్లను అందుబాటులోకి తేవడం ద్వారా చేనేత జౌళిరంగం పుంజుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి.  బడ్జెట్లో చేనేత రంగానికి కేటాయింపులు పెంచాలి. నూలు, పత్తి , ఇతర ముడి వస్తువులకు రాయితీ కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల ఉద్యోగులకు చేనేత వస్త్రాలు కొనుగోలు చేయించడం ద్వారా కార్మికుల ఆదాయాన్ని  గణనీయంగా పెంచవచ్చు. ఆన్లైన్ వేదికల ద్వారా ప్రపంచ స్థాయి పోటీకి చేనేత వస్త్రాలను ఎదగనివ్వాలి. కేంద్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమ విస్తారంగా ఉన్న తెలంగాణలో  టెక్స్ టైల్ పార్కులను ఏర్పాటు చేయాలి. చేనేత కార్మికుల సృజనాత్మకత భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక. దీన్ని కాపాడడం అటు ప్రభుత్వం, ఇటు ప్రజల బాధ్యత కూడా.

- అంకం నరేష్ సోషల్​ ఎనలిస్ట్​