కాంగ్రెస్ ​భవిష్యత్తుకు యువతే కీలకం

కాంగ్రెస్ ​భవిష్యత్తుకు యువతే కీలకం

దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంటుందన్నారు మాజీ ప్రధాని స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ. యువ చైతన్యంతో ప్రపంచానికి మార్గదర్శిలా భారత్  నిలబడాలనేది ఆయన కోరిక.  నాకు వందమంది బలమైన యువకుల్ని ఇవ్వండి, నేను దేశానికి స్వాతంత్ర్యాన్ని తెస్తాను అన్నారు  నేతాజీ సుభాష్ చంద్రబోస్. కలలు కనండి, వాటి సాకారానికి కృషి చేయండి అని యువతకు సూచించారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్. యువత  సమాజ అభ్యున్నతిలో కీలక పాత్ర పోషిస్తోంది. నిజానికి మహాత్మా గాంధీ సారథ్యంలో నడిచిన అహింసాయుత దేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ నాటి కాంగ్రెస్​లోని యువనేతలే ముందుండి పోరాడి, ఎన్నో త్యాగాలకోర్చి స్వాతంత్ర్యాన్ని సాధించారు.

 కాంగ్రెస్ అనుబంధ యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్,  ట్రేడ్ యూనియన్​  కాంగ్రెస్ ఇలా అన్ని విభాగాల్లోనూ యువనేతలు తమ సామర్థ్యాలతో రాణించారు. ఒకనాడు యువచైతన్యంతో వెల్లివిరిసిన కాంగ్రెస్​లో  మళ్లీ ఇప్పుడు యువ నాయకత్వం ముందుకు వస్తూ పూర్వవైభవం దిశగా సాగుతున్న సంకేతాలు  కన్పిస్తున్నాయి.  రాహుల్ గాంధీ  యువ నాయకత్వంలో దశాబ్దం తర్వాత  మూడంకెల పార్లమెంట్ సీట్లు సాధించడంతోపాటు, కోల్పోయిన ప్రధాన ప్రతిపక్ష హోదాను సైతం తిరిగి దక్కించుకుంది. అదే ఒరవడిని కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ.. అంతర్గత సంస్థాగత నిర్మాణంలోనూ, అనుబంధ విభాగాల్లోనూ యువతకు ప్రాధాన్యం పెరుగుతోంది.

జాతీయోద్యమంలో పాల్గొన్న యువనేతలు సైతం పార్టీ కోసం సుశిక్షుతులైన సైనికుల్లా పనిచేశారు. ఈ పరంపర కొన్ని దశాబ్దాలపాటు కొనసాగి నాటి కాంగ్రెస్ రాజకీయ ప్రాబల్యాన్ని నిలబెట్టారు. అయితే క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీలోని  అనేక మంది యువనేతలు బయటికొచ్చి సొంతపార్టీల ఏర్పాటుతో  కొంత ఇబ్బందికర పరిస్థితులు మొద లయ్యాయి. తమిళనాడులో కామరాజ్,  మహారాష్ట్రలో శరద్ పవార్,  పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ, ఇక ప్రస్తుత  ఏపీలో  వైఎస్ జగన్ వంటి వారు తమ యువప్రాయంలో కాంగ్రెస్​ను వీడడం సొంత ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ ఓటుబ్యాంకును చీల్చడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్​కు తీరని నష్టం జరిగింది. 

దీనికితోడు నాడు సోషలిస్ట్ పార్టీ, జనతా పార్టీల్లోని యువ నాయకత్వం ములాయం, లాలూ, నితీశ్ వంటి వారు ఏర్పాటు చేసుకున్న సమాజ్ వాదీ, ఆర్జేడీ, జనతాదళ్  వీటికి తోడు దళిత ఉద్యమం ఆధారంగా ఏర్పాటైన కాన్షీరామ్​ బీఎస్పీ, ఆంధ్రుల ఆత్మాభిమానం అంటూ వచ్చిన ఎన్టీఆర్ టీడీపీ సైతం కాంగ్రెస్ ఓటు బ్యాంకును బలహీనపరిచారు. వారి వ్యూహాలను పటిష్టంగా అమలుపర్చడంలో మాత్రం ఆయా పార్టీల యువనేతలే కీలక పాత్ర పోషించారనేది మనకు చరిత్ర చెప్తున్న సత్యం.

ప్రచారమే బీజేపీ బలం

ఇక జనతా పార్టీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వచ్చిన సంఘ్ ఫరివార్,  భారతీయ జనతా పార్టీల్లో సైతం యువ నాయకత్వమే కీలకంగా పనిచేసింది. మధ్యప్రదేశ్​లో  జ్యోతిరాదిత్య సింధియా, ఈశాన్య భారతంలో హిమంత బిశ్వశర్మ,  సుశ్మితాదేవ్, ఉత్తరప్రదేశ్లో  జితిన్ ప్రసాద్,  టామ్ వడక్కన్ వంటి యువనేతలు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన తర్వాత ఆ పార్టీ మరింత మంచి ఫలితాలను సైతం సాధించింది,  వీటికి తోడు వృద్ధాప్యం వల్లనే ఆ పార్టీకి భీష్మ పితామహుడు వంటి ఎల్.కె. ఆద్వానీని, మురళీ మనోహర్ జోషీ వంటి నేతలను సైతం పక్కనపెట్టి, యువనాయకత్వంపై అచంచల విశ్వాసం ఉంచి విజయాలను అందుకున్నది.

గత పదేళ్లుగా దేశంలో బీజేపీ పాలన ఏమంత చెప్పుకోదగిన మార్పును తీసుకురాకున్నా,   బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది.  ఎందుకంటే ప్రస్తుత మారిన రాజకీయ పరిస్థితుల్లో ఎంత గొప్ప పనిచేసినా దాన్ని ప్రచారం చేసుకోలేకపోతే అది ప్రజలకు చేరదు.  కానీ, బీజేపీ తనకు ఆధారమైన మతాన్ని, అలాగే తను చేసిన చిన్న చిన్న పనుల్ని సైతం తమకున్న యువ కార్యకర్తలు, నేతల సహకారంతో ప్రజల్లో నిరంతరం ప్రచారంలో ఉంచగలుగుతోంది. అదే వారి అధికారాన్ని మరింత సుస్థిరం చేస్తోంది.  అందుకే  నిజం సైతం నిరంతరం ప్రచారంలో ఉండాలి అనే కొత్త నానుడి రూపొందింది.  

ప్రజల మనసులో కాంగ్రెస్​ స్థిరంగా ఉంది

ఈ యువతరం ఇప్పుడు అన్ని పార్టీలకు అత్యంత ముఖ్యవనరు. కాంగ్రెస్​కు సైతం అదే రాబోయే రోజుల్లో నూతన జవజీవాల్ని అందించబోతుంది.  ఎందుకంటే  ఇప్పుడు గెలుపు,  ఓటమికి మధ్య ఓట్ల తేడా చాలా స్వల్పంగానే ఉంటున్నాయి.  మొన్నటి 473 స్థానాల పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు ఎక్కువ చోట్ల పోటీచేసిన అధికార పక్షం  బీజేపీ సాధించింది 36.56 శాతం ఓట్లైతే, అంతకంటే చాలా తక్కువ స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్ సైతం అదే రేషియోలో 21.19 శాతం సాధించింది.

  ఇందులోనూ దాదాపు కర్నాటక,  తెలంగాణ, పంజాబ్,  కేరళ వంటి పెద్ద రాష్ట్రాలతో పాటు మొత్తంగా పది రాష్ట్రాల్లో బీజేపీ కన్నా అత్యధిక ఓట్లను కాంగ్రెస్ సాధించింది. చత్తీస్​గఢ్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్,  గోవా,  అరుణాచల్ ప్రదేశ్ వంటి  రాష్ట్రాల్లో అత్యల్ప తేడా మాత్రమే ఉంది.  ఈ  ఫలితాల సారాంశం కాంగ్రెస్ ఈ దేశ ప్రజల మనస్సుల్లో సుస్థిరంగా ఉందనే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.  ఈ కాలంలో ప్రచారలోపమే ఓటమికి ప్రధాన కారణంగా
నిలబడుతున్నది. 

చేసిన పనులకు ప్రచారం లేక..

కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వాలు చేసిన అతి గొప్ప పనులైన పేదలకు ఉచిత బియ్యం పంపిణీ  మొదలు,  వేలాది కిలోమీటర్ల  రైల్వే లైన్లు,  రోడ్లు,  నవరత్న కంపెనీల బలోపేతం, ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల ఏర్పాటు, బాక్రానంగల్ మొదలు నాగార్జున సాగర్ వంటి మహా ప్రాజెక్టుల నిర్మాణం.. చివరకు ఐటీని సైతం ఒడిసిపట్టి దేశాన్ని టెక్నాలజీలో ముందుకు తీసుకెళ్లడం,  ప్రపంచంలో అత్యధిక శాతం జనాభా  ఉన్న మనదేశంలోని కోట్లాది మందికి ఉపాధి కల్పించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటివి సైతం యువ నేతలు, కార్యకర్తలకు అవగాహన కల్పించకపోవడం కాంగ్రెస్  పార్టీ ప్రచారలేమికి కారణంగా కనిపిస్తోంది.

తెలంగాణ నుంచే మొదలైంది

రానున్న రోజుల్లో ప్రచారంలో పదును పెరగాలంటే నిరంతరం ఉత్సాహంతో ఉండే యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యం పెరగాలి. ఇందులో సబ్బండ వర్ణాలకు ప్రాతినిధ్యం దక్కాలి.  ఇప్పటికే ఆ దిశగా తెలంగాణ కాంగ్రెస్ కొంత స్పష్టమైన కార్యాచరణ ప్రకటించింది.  పీసీసీ అధ్యక్షుడు మొదలు, ఇతరత్రా నామినేటెడ్ పదవుల్లోనూ యువతకు ప్రాధాన్యం పెంచుతూ వస్తుంది. సీనియర్ల సలహాలతో ఈ టీం పనిచేసేలా సమన్వయం చేసింది. మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రారంభించిన ఈ ఒరవడిని దేశమంతా కొనసాగించి మహిళా కాంగ్రెస్, సేవాదళ్, ఐఎన్​టీయూసీ, విద్యార్థి విభాగం(ఎన్​ఎస్​యూఐ) ఇలా ప్రతి సంస్థాగత విభాగాన్ని యువతతో పరిపుష్టం చేస్తుందనే ఆశాభావం కనిపిస్తోంది. ఇందుకు రాహుల్ గాంధీ ఇప్పటికే నిర్దిష్ట కార్యాచరణను తెలంగాణ నుంచి మొదలుపెట్టారనేది మనకు కనిపిస్తున్న వాస్తవం.  రాహుల్ సారథ్యంలో యువనేతల ప్రాధాన్యం పెరుగుతున్న మాట నిజం. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ  భవిష్యత్తుకు యువనేతలే కీలకం కానున్నారనడంలో సందేహంలేదు.

-బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి,
సీఈవో, టిసాట్
నెట్​వర్క్​