నల్గొండ అర్బన్, వెలుగు : జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్- యువతేజం కార్యక్రమంలో భాగంగా గ్రామీణ యువత క్రీడా నైపుణ్యాలు పెంపొందించేందుకు కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. సోమవారం నల్గొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో యువతేజం కబడ్డీ పోటీల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తి గల గ్రామీణ యువకులు తమ టీం సభ్యుల జాబితాను సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరి 2లోపు నమోదు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు మండల స్థాయిలో కబడ్డీ పోటీలు, ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు డివిజన్, జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ రమేశ్, డీఎస్పీలు శివరాంరెడ్డి, రాజశేఖర్ రాజు, టూ టౌన్ సీఐ రాఘవరావు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో భాగంగా పోలీసు కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 30 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని
ఆదేశించారు.