ఆకతాయిలు.. హల్ చల్!

ఆకతాయిలు.. హల్ చల్!
  • అర్ధరాత్రి బైక్ లపై జులాయిగా తిరుగుతున్నరు 

  • రోడ్లపైనే కూర్చొని మద్యం తాగుతున్నరు

  • మత్తులో వచ్చిపోయే వారిపై దాడులు 

  • బస్టాండ్లు, మెట్రో స్టేషన్లలో కనిపించని పెట్రోలింగ్​

  • పోలీసులు నిఘాను పెట్టాలని కోరుతున్న సిటీజనాలు


 “కొద్దిరోజుల కిందట ఎల్​బీనగర్ కు చెందిన సురేశ్ అర్ధరాత్రి1 గంట సమయంలో చైతన్యపురి మెట్రో స్టేషన్​వద్ద ర్యాపిడో బుక్ చేసుకుని వెయిట్​చేస్తున్నాడు. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు అతని వద్దకు వచ్చి అకారణంగా దాడికి దిగారు. వాళ్లు ఎవరో, ఎందుకు దాడి చేస్తున్నారో తెలియదు.. సురేశ్​ తేరుకునేలోపే దుండగులు పరారయ్యారు. అయితే వారంతా మద్యం మత్తులో ఉన్నారని బాధితుడు పోలీసులకు కంప్లయింట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపలేదు.’’

“నాంపల్లి ఎగ్జిబిషన్​ గ్రౌండ్స్ లోని వనితా మహిళా కాలేజీ విద్యార్థినులను పోకిరీలు వేధిస్తున్నారు. కాలేజీ సమయాల్లో బైక్స్ పై  రాంగ్​రూట్​లో తిరుగుతూ అమ్మాయిలను వెంబడిస్తున్నారు. బస్టాండుల్లోనూ తిష్ట వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు.’’

హైదరాబాద్, వెలుగు: సిటీలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రులు రోడ్ల మీద తిరుగుతూ హల్ చల్ చేస్తున్నారు. వచ్చి పోయేవారిపై అకారణంగా దాడులు దిగుతున్నారు. రాష్​ డ్రైవింగ్​చేస్తూ ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. పోకిరీలు రాత్రిపూటనే కాదు.. పగటిపూట కూడా వేధింపులకు పాల్పడుతున్నారు. గల్లీలో తిరగడం, రోడ్లపైనే మద్యం తాగడం వంటివి నిత్యం కనిపిస్తున్నాయి. రాత్రి పదకొండు దాటిందంటే బైక్​లు వేసుకుని రోడ్ల మీద అరుస్తూ నడుచుకుంటూ వెళ్లేవారిని, బస్సుల కోసం వెయిట్​చేసేవారిని, ఆఫీస్​నుంచి ఇండ్లకు నడుచుకుంటూ వెళ్లేవారిని అడ్డగించి భయభ్రాంతులకు గురిచేయడం, లేదంటే దాడులు చేయడం చేస్తున్నారు. దీంతో  రాత్రిళ్లు రోడ్ల మీద నుంచి జనం నడిచివెళ్లాలంటేనే భయం భయంగా వెళ్తున్నారు. 

ఫిర్యాదు చేసేందుకు ఆసక్తి చూపట్లేదు 

సిటీలో ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకుని నిత్యం తరచూ ఎక్కడో ఒకచోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే అన్ని ఘటనల్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆసక్తి చూపడంలేదు. కొందరు చిన్న విషయాలనుకుని  పోలీస్​స్టేషన్​ దాకా తీసుకెళ్లడం ఎందుకుని, లేనిపోని ఇబ్బందులు వస్తాయని వదిలేస్తున్నారు. మరికొందరు బాధితులు స్టేషన్ల చుట్టూ ఎవరు తిరుగుతారని లైట్​తీసుకుంటున్నారు. 

కనిపించని ఆపరేషన్​ కార్డన్​

సిటీలో ప్రధాన సర్కిళ్లు, మెట్రో, బస్ స్టేషన్లలో విజిబుల్​పోలిసింగ్​కరువైంది. ఎప్పుడో ఓసారి మాత్రమే పెట్రోలింగ్​వెహికల్స్ కనిపిస్తుంటాయి. అర్ధరాత్రి పోకిరీలను కంట్రోల్​చేయడానికి ఆపరేషన్​మిడ్​నైట్​ రోమియో, ఆపరేషన్​చబుత్రా వంటివి సిటీ పోలీసులు తీసుకొచ్చారు.  రాత్రిపూట బస్తీలు, రోడ్లు, ప్రధాన సర్కిళ్లు, వివిధ ప్రాంతాల్లో గొడవలు, దాడులు, బైక్​ రేసింగ్ నిర్వహించే పోకిరీలను గుర్తించి పట్టుకునేవారు.  వారి తల్లిదండ్రుల సమక్షంలో  కౌన్సెలింగ్ చేసేవారు. రిపీట్​అయితే పెటీ కేసులు కూడా నమోదు చేసేవారు.  ఇప్పుడు వాటిస్థానంలో ఆపరేషన్​కార్డన్​తీసుకొచ్చారు. ఇది కొన్ని ప్రాంతాలకే పరిమితమైందనే విమర్శలు ఉన్నాయి.  సిటీలోని చాలా ప్రాంతాల్లో రాత్రివేళ విజిబుల్​పోలీసింగ్​కరువైందని సిటిజన్స్ చెబుతున్నారు.  బస్టాండ్లు, రైల్వే, మెట్రోస్టేషన్లలో పెట్రోలింగ్​ను పెంచాలని కోరుతున్నారు. 

నిఘా పెట్టి.. కౌన్సెలింగ్ ఇస్తున్నాం

 
సిటీలో న్యూసెన్స్​చేసే వారిపై నిఘా పెట్టాం.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. మా జోన్​ పరిధిలో రాత్రి 12 గంటల తర్వాత కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నాం. రోడ్ల మీద అనవసరంగా తిరిగేవాళ్లను గుర్తించి, ఆకతాయిలైతే కౌన్సెలింగ్ ఇస్తున్నాం. అలాగే హోటల్, ఫుట్​పాత్, షాపింగ్​మాల్స్, బస్టాండ్లు, మెట్రోస్టేషన్ల వద్ద మళ్లీ పట్టుబడిన వారిపై పిటీ కేసులు నమోదు చేస్తున్నం. 
– ఓ పోలీస్​ అధికారి, ఓల్డ్​సిటీ