మీరు మారరా.. వీకెండ్స్ లో రేసింగ్ తో రెచ్చిపోతున్న హైదరాబాద్ యువత

క్రేజ్ కోసం ఎంత రిస్క్ అయినా సరే చేసెయ్యాలి అనే ఇంటెన్షన్ నేటి యువతలో ఎక్కువైపోతోంది. కొన్ని విషయాల్లో ఈ దృక్పధం మంచిదే అయినప్పటికీ.. నేటి యువత పనికిమాలిన విషయాల్లో అత్యుత్సాహం చూపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రీల్స్ కోసం వికృత చేష్టలు చేస్తున్నవారు కొందరైతే, క్రేజ్ కోసం రిస్క్ చేసి ప్రాణాల మీదకు తెచుకుంటున్నవారు చాలామందే ఉన్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ లో రేసింగ్ కల్చర్ పెరిగిపోతోంది. వీకెండ్స్ వస్తే చాలు.. సిటీలోని చాలామంది యూత్ అర్థరాత్రి సమయంలో బైకులేసుకొని రోడ్లపై పడుతున్నారు.

శని, ఆదివారాలలో రాత్రి రహదారులపై చాలామంది యువత ప్రమాదకర స్థితుల్లో బైక్‌రేస్‏లు చేస్తూ, స్టంట్లు చేస్తున్నారు. రేసింగ్‌ చేస్తూ.. బైక్‌లను గాలిలోకి లేపుతూ ప్రమాదకర ఫీట్స్ చేస్తున్నారు. బైక్ స్టాండ్ తో కొందరు మంటలు పుట్టిస్తున్నారు. దీంతో తోటి వాహనదారులు ఆయా రూట్లలో వెళ్లాలంటేనే హడలిపోతున్నారు.  తాజాగా శనివారం ( నవంబర్ 9, 2024 ) రాత్రి రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలోని టీ హబ్ రహదారులపై ప్రమాదకర స్థితిలో బైక్‌రేస్‌, స్టంట్స్ చేస్తూ రెచ్చిపోయారు కొంతమంది యువకులు.

శని, ఆదివారం రాత్రి 12 గంటల నుంచి అర్థరాత్రి 2 గంటల వరకు బైక్ రేసులు నిర్వహించటం ఈ మధ్య ఎక్కువైపోతోంది. బైక్ మీద ప్రమాదకర విన్యాసాలుచేస్తూ క్రేజ్ కోసం చేస్తున్న ఫీట్స్ తో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు యువకులు. గతంలో కొంతమంది బైక్‌ రైడర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని బైక్‌లను సీజ్‌ చేసినప్పటికీ మార్పు రాలేదు. శని, ఆదివారాలు వచ్చిందంటే సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. బైక్ రేసులు నిర్వహిస్తున్నవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వాహనదారులు.