ముంపు గ్రామాల పిలగాండ్లకు పిల్లనిస్తలె

ముంపు గ్రామాల పిలగాండ్లకు పిల్లనిస్తలె
  • ఒక్కో ఊరిలో 50 మందికిపైగా లగ్గంకాని యువకులు
  • ఏండ్లు గడుస్తున్నా ఇండ్లు కట్టివ్వని, ఉపాధి చూపని సర్కారు 
  • అలాంటి కుటుంబాలకు పిల్లనివ్వలేమంటున్న అమ్మాయిల తల్లిదండ్రులు

(వెలుగు, నెట్​వర్క్​): రాష్ట్రంలో ఇరిగేషన్​ ప్రాజెక్టుల కోసం ఇండ్లు, భూములను త్యాగం చేసిన ముంపు గ్రామాల ప్రజలను చిత్రమైన సమస్య వెంటాడుతున్నది. సర్కారు ఇచ్చిన పరిహారంతో వేరేచోట అగ్రికల్చర్​ ల్యాండ్స్​ కొనే పరిస్థితి లేక చాలా మంది నిర్వాసితులు ఎలాంటి భూమిలేని రైతు కూలీలుగా మిగిలిపోయారు. ఆర్​ అండ్ ​ఆర్​ కింద సర్కారు పునరావాసం కల్పించకపోవడంతో నిలువ నీడలేక టెంపరరీ, కిరాయి ఇండ్లలో గడుపుతున్నారు. ఇలా ఇండ్లు, భూములు లేని నిర్వాసిత కుటుంబాలకు పిల్లనిచ్చేందుకు ఇతర గ్రామాల్లోని ఆడపిల్లల తల్లిదండ్రులు ముందుకు వస్తలేరు. కొత్తగా చేపడుతున్న పలు రిజర్వాయర్ల కింద ముంపునకు గురయ్యే గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ముంపు గ్రామాలకు చెందిన అమ్మాయిల పెండ్లిళ్లు ఎలాగోలా జరుగుతున్నా.. అబ్బాయిల లగ్గాలు మాత్రం ఆగిపోతున్నాయి. 

ప్లాట్లు రావు.. ఇండ్లు లేవు..
ప్రాజెక్టులు పూర్తికాగానే గేట్లు వేసి ఆగమాగం నీళ్లు నింపుతున్న సర్కారు.. ముంపు గ్రామాలను హడావుడిగా ఖాళీ చేయిస్తున్నది. పునరావాస పనులు జాడలేకపోవడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియని నిర్వాసితులు ఆగమవుతున్నారు. పాత గ్రామాల శివారుల్లో, పునరావాస కేంద్రాల్లో టెంపరరీ ఇండ్లు కట్టుకొని కొందరు, పక్క గ్రామాల్లో ఇండ్లు కిరాయికి తీసుకొని ఇంకొందరు నివాసం ఉంటున్నారు. సర్కారు ఇచ్చే పరిహారం కోసం, ఆర్​అండ్​ఆర్​ కాలనీలో ప్లాటు కోసం ఏండ్ల కొద్దీ ఎదురుచూస్తున్నారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్​లో 8 గ్రామాలు పోగా.. 5,500 కుటుంబాలు నిర్వాసితులయ్యారు. కానీ ఇప్పటివరకు 2,500 కుటుంబాలకు మాత్రమే గజ్వేల్ సమీపంలోని ముట్రాజ్ పల్లి వద్ద ఆర్అండ్ఆర్ కాలనీలో ఇండ్ల స్థలాలు ఇచ్చారు. మరో 3 వేల కుటుంబాలకు ఇప్పటికీ ఇవ్వలేదు. సిరిసిల్ల జిల్లా మిడ్​మానేరులో ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టుకునేందుకు రూ.5  లక్షల చొప్పున అందజేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా ఇప్పటికీ అమలు చేయలేదు. దీంతో కొదురుపాక, నీలోజిపల్లికి చెందిన నిర్వాసితులు అద్దె ఇండ్లలో ఉండి ఎదురుచూస్తున్నారు. పాలమూరు-–రంగారెడ్డి లిఫ్టు స్కీం కింద  వనపర్తి జిల్లాలో నిర్మిస్తున్న ఏదుల రిజర్వాయర్  దాదాపు పూర్తయింది. కానీ ముంపు గ్రామాలైన బండరావిపాకుల, కొంకలపల్లి గ్రామాలకు పునరావాసం కల్పించలేదు. దీంతో కొంకలపల్లిలో 115, బండ రాయిపాకులలో 390 ఫ్యామిలీలు టెంపరరీ, కిరాయి ఇండ్లలో ఉంటున్నాయి. ఇదే జిల్లాలోని శంకరసముద్రం రిజర్వాయర్ కింద కానాయపల్లి, రంగసముద్రం రిజర్వాయర్ కింద నాగరాల గ్రామం  ముంపునకు గురవుతున్నాయి. ఈ రెండు గ్రామాల్లో సుమారు 2 వేల కుటుంబాలకు.. నేటికీ పునరావాసం కల్పించలేదు. నాగర్ కర్నూలు జిల్లాలో పాలమూరు లిఫ్ట్ కింద  ఉదండాపూర్, వల్లూరుతో పాటు 20 అనుబంధ గ్రామాలకు, గద్వాల జిల్లాలో నెట్టెంపాడు ప్రాజెక్టు కింద ర్యాలంపాడ, చిన్నంపల్లి గ్రామాలదీ ఇదే పరిస్థితి.  నల్గొండ జిల్లాలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్​లో భాగంగా నిర్మిస్తున్న చర్ల గూడెం రిజర్వాయర్ కింద  నర్సిరెడ్డి గూడెం, చర్ల గూడెం, వెంకే పల్లి, వెంకేపల్లి తండావాసులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఇండ్ల నిర్మాణం ఇప్పటికీ జరగలేదు. 1,500 ఫ్యామిలీలకు చింతపల్లి మండలంలో ఇండ్లు నిర్మిస్తామని చెప్పినా నేటికీ అమలు చేయలేదు. యాదాద్రి జిల్లాలో కాళేశ్వరం 16వ ప్యాకేజీ కింద నిర్మిస్తున్న బస్వాపూర్ (నృసింహ) రిజర్వాయర్​కింద  బి ఎన్ తిమ్మాపూర్, లక్ష్మి నాయకుడి తండా, చొంగల్ నాయకుడి తండా మునిగి పోతున్నాయి. ఈ మూడు గ్రామాలకు చెందిన 1,156 కుటుంబాలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు ఎలాంటి ప్రోగ్రెస్​ లేదు.

పిల్లనెట్లిస్తం..!
ప్రాజెక్టుల్లో భూములు కోల్పోవడం, ఉండేందుకు ఇండ్లు లేకపోవడంతో చాలా నిర్వాసిత కుటుంబాలకు పిల్ల నిచ్చేందుకు ఆడపిల్లల తల్లిదండ్రులు ముందుకు రావట్లేదు. గతంలో ఆయా కుటుంబాల్లోని యువకులు తాము వ్యవసాయం చేస్తామని చెప్పి పిల్లనడిగేవాళ్లు. ఇప్పుడు అటు భూములు లేక, ఉపాధి దొరకక ఖాళీగా ఉంటుండటంతో  పెండ్లి సంబంధాలు రావడం లేదు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ కింద 8 గ్రామాలు ముంపునకు గురికాగా.. ఒక్కో ఊరిలో 30 ఏండ్ల వయసు దాటిపోయినా పెండ్లికాని అబ్బాయిలు 50 మందికిపైగానే ఉన్నారని అక్కడి సర్పంచులు చెప్తున్నారు. పునరావాసం కింద జాగా చూపిస్తే కనీసం ఇల్లు కట్టుకొని పిల్లను అడుగుదామనే ఆలోచనతో ఎదురు చూస్తున్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం లోని ఎల్లంపల్లి ముంపు గ్రామాలైన కోటిలింగాల, మొక్కట్రావ్ పేట్,రాంనూర్, తాళ్లకొత్తపేట్, చెగ్యాం, ఉండేడా గ్రామాల్లో సుమారు150 మంది యువకులకు వివాహాలు కావడం కష్టం గా మరిందని గ్రామస్తులు చెప్తున్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో మంచిప్ప రిజర్వాయర్  వల్ల అమ్రాబాద్ , బైరాపూర్ గ్రామాలు నీటమునగనున్నాయి. ఈ రెండు గ్రామాల్లో 2వేల మంది నిర్వాసితులవుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు ఊర్లలో సుమారు 200 మంది వరకు మగ పిల్లలు పెండ్లిళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ముంపు గ్రామాలకు తమ పిల్లలను ఎట్లా ఇస్తామని ఆడపిల్లల తల్లిదండ్రులు అంటున్నారు. 

 సమస్య బయటకు చెప్తలేరు
మల్లన్న సాగర్ రిజర్వాయర్  ముంపు గ్రామాల్లోని యువకులకు పిల్లనిచ్చేందుకు వేరే గ్రామాల్లోని ఆడ పిల్లల తల్లిదండ్రులు ముందుకు వస్తలేరు. తమకు భూమి ఉందని, పిలగాడు వ్యవసాయం చేస్తడని చెప్పి గతంలో పిల్లను అడిగేవాళ్లు. ఇప్పుడు ఊరు, దాంతోపాటే భూములు, ఇండ్లు పోవడంతో యువకులకు పెండ్లిళ్లు కావడం లేదు. ఒక్క మా ఊరిలోనే 50 మందికి పైగా యువకులు పెండ్లి కోసం ఎదురు చూస్తున్నరు. చాలామంది ఈ సమస్యను బయటకు చెప్పుకోకుండా లోలోపలే బాధపడుతున్నరు. 
- ఘనపురం నర్సింలు, మాజీ సర్పంచ్ , వేములఘాట్

మరిన్ని వివరాల కోసం..

కరోనా పోయింది... ఆఫీసులకెళ్లండి 

కాంగ్రెస్​ వల్లే విభజన  సమస్యలు