లీడర్లు నచ్చట్లేదు.. నోటాకు వేస్తం!.. యూత్ ఒపీనియన్

హైదరాబాద్, వెలుగు :  ఎన్నికలు ఏవైనా యువత ఓట్లే కీలకం. క్యాండిడేట్ల గెలుపు ఓటములను డిసైడ్​చేస్తాయి. ఒకప్పడు రాజకీయాలు, ఎన్నికలంటే తమకు సంబంధం లేనివిగా యూత్ చూసేవారు. కానీ.. వారి సామాజిక ఆలోచన మారుతుంది. కాలక్రమేణా టెక్నాలజీ పెరిగిపోతుండగా సమాచారం అందుబాటులోకి వస్తుండగా రాజకీయాలు, ఎన్నికలు, అభ్యర్థులు, అభివృద్ధి, ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉంటున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సిటీలో తొలిసారి ఓటు వేయనున్న కొందరు యువతను ప్రశ్నించగా ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.

 చాలామంది ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ , రాజకీయ పార్టీలు, నేతల తీరుపై ఆవేదనతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి ఓటు నోటాకే అని తేల్చిచెబుతున్నారు. మరికొందరు అభివృద్ధి, ఉచిత విద్య, ఉద్యోగం కల్పించే పార్టీలకు ఓటు వేస్తామని పేర్కొంటున్నారు. ఎక్కువ శాతం యువత ఓటుకు అర్హులైన అభ్యర్థులు ఎవరూ లేరంటూ.. తమ ఎంపిక ‘నోటా’నే అని స్పష్టంచేస్తున్నారు. ఎన్నికల వేళ మరోవైపు  బస్తీలు, కాలనీల్లోని యువతకు క్రికెట్​కిట్లు, పండుగలకు కల్చరల్​ఈవెంట్స్​ఖర్చులను రాజకీయ నాయకులు అందించారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా యువ నేతలను రంగంలోకి దించారు. యూత్​ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హామీల వర్షం కురిపిస్తున్నారు. సోషల్​ మీడియా ద్వారా కూడా చేరువవుతున్నారు. అయితే.. యువత మాత్రం అభ్యర్థుల అంచనాలకు భిన్నంగా స్పందిస్తున్నారు. 

ఓటుపై అవేర్ నెస్ చేస్తుండగా..  

యువతలో ఓటు, రాజకీయలపై అవగాహన కలిగించడానికి ఎన్నికల సంఘంతో పాటు, పలు స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాయి. ఎన్నికల్లో ఏ
 అభ్యర్థి నచ్చకుంటే నోటా ఆప్షన్ ఉందని తెలియజేస్తున్నాయి. సోషల్​మీడియా వేదికగానూ మరికొన్ని సంస్థలు ఓటు విలువ, ప్రస్తుత రాజకీయాలపై యూత్​ను అవేర్ నెస్ చేస్తున్నాయి.  నోటా అంటే ‘నన్​ ఆఫ్​ది అబౌ’ అని అర్థం. ఎన్నికల్లో పోటీ చేసిన ఏ అభ్యర్థి నచ్చనప్పుడు నోటాను ఎంపిక చేసుకునే ఆప్షన్ కల్పించారు.

 మెజారిటీని దాటిన నోటా.. 

 ప్రస్తుత ఎన్నికల్లో నోటా ఓట్ల చీలిక చిన్నదే అయినా.. కొంతమంది అభ్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. కొద్దిపాటి తేడాతో ఓడిపోయిన స్థానాల్లో మెజారిటీ కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వస్తున్నాయి. దీంతో అభ్యర్థులు నోటా పేరెత్తితే భయపడుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్​పేటలో టీఆర్ఎస్​ నుంచి కాలేరు వెంకటేశ్, బీజేపీ నుంచి కిషన్​ రెడ్డి పోటీ చేశారు. కిషన్​రెడ్డిపై 1,016 ఓట్ల మెజారిటీతో కాలేరు వెంకటేశ్ గెలిచారు. అక్కడ నోటాకు మాత్రం 1,462 ఓట్లు రావడం విశేషం.  అలాగే.. ఖైరతాబాద్ లో 35 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయగా, అందరిని పక్కకు నెట్టి నోటా 5వ స్థానంలో నిలిచింది. శేరిలింగంపల్లిలోనూ ఇదే పరిస్థితి. ముషీరాబాద్​, సనత్​నగర్​, గోషామహల్​, ఉప్పల్ తదితర​ చోట్ల ప్రధాన పార్టీల తర్వాత స్థానం నోటాదే కావడం విశేషం. 

ఎవరూ కనిపించట్లేదు

ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చలేని నేతలు విలువైన ఓటుకు అర్హులు కాదు. ఇప్పటికీ సామాన్య ప్రజలకు ఉచిత విద్య, వైద్యం, పక్కా ఇండ్లు అందని ద్రాక్షగానే మిగిలాయి. నేతలు మాత్రం వీటి మీదనే రాజకీయాలు చేసి లబ్ధి పొందుతారు. జనానికి ఎలాంటి ప్రయోజనం చేయరు. ప్రస్తుతం ప్రజలకు మేలు చేసే అభ్యర్థులు ఎవరూ కనిపించడంలేదు. అందుకే నా తొలి ఓటు నోటాకు వేయాలని అనుకుంటున్నా.

ALSO READ : కాళేశ్వరం ప్రాజెక్టు వండర్ కాదు బ్లండర్

– సందీప్​ నాయక్, డిగ్రీ స్టూడెంట్, ఓల్డ్ బోయిన్ పల్లి


 నిరసనగా భావిస్తూ వేస్తా..

అభివృద్ధి అంటే రోడ్లు, ఫ్లై ఓవర్లు మాత్రమే కాదు. ప్రజా సంక్షేమం కూడా. ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించడం లేదు.  సిటీలో పర్యాపరణాన్ని కాపాడటంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయి. దీంతో భావితరాలకు భరోసా లేకుండా పోతుంది. నోటాతో నా నిరసనను తెలియజేయాలనుకుంటున్నా. నోటాను ఒక నిరసనగా భావిస్తున్నా. 
– రుచిత్ ఆశా కమల్, డిగ్రీ స్టూడెంట్,​ ఉప్పల్