తిరువనంతపురంకు చెందిన ఒక వ్యక్తికి సోషల్ మీడియాలో నలుగురు వ్యక్తులు పరిచమయ్యారు. అనంతరం ఆ నలుగురు కలిసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని ఆ వ్యక్తిపై ఒత్తిడి తెచ్చి రెండు కోట్ల రూపాయలను దోచేశారు. ఈ కేసులో కోజికోడ్ లోని నల్లాలంకు చెందిన సాధిక్ (48), ఇడుక్కి తొడుపుజాకు చెందిన షెఫీక్ (37), కోజికోడ్ వడకర ఇరింగల్కు చెందిన సాదిక్ (24), త్రిసూర్ పూకోడ్కు చెందిన నందుకృష్ణ (21)లను తిరువనంతపురం సిటీ పోలీస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అరెస్టు చేసి వివరాలు వెల్లడించారు.
ఆన్ లైన్ ద్వారా బాధితునికి నిందితులు దగ్గరయ్యారు. అనంతరం లాభాలు సంపాదించడానికి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని సలహాలు ఇచ్చారు. మొదట్లో లాభాలను చూపించి బాధితున్ని నమ్మించారు. అనంతరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేసే అప్లికేషన్లను బాధితుడి ఫోన్ లో ఇన్ స్టాల్ చేశారు. వారు చెప్పినట్లు చేసిన తర్వాత రెండు కోట్ల రూపాయలు కాజేశారు.
బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. బాధితుడు, నిందితుల మధ్య వాట్సాప్ చాటింగ్ ఆధారంగా తిరువనంతపురం సిటీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ నిద్దిన్రాజ్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ సీఎస్ హరి నేతృత్వంలో ప్రత్యేక బృందం దర్యాప్తు ప్రారంభించింది. నిందితుడు కాజేసిన డబ్బు రాష్ట్రంలోని వివిధ జాతీయ బ్యాంకుల శాఖల ద్వారా బదిలీ అయినట్లు దర్యాప్తులో తేలింది. ఇందులో భాగంగా కొంతమందికి కమీషన్ ఆశ చూపి వివిధ ఖాతాల్లోకి ఆ డబ్బును ట్రాన్స్ ఫర్ చేసినట్లు గుర్తించారు. తిరువనంతపురం సిటీ వ్యాప్తంగా నిందితులు కొందరు ఏజెంట్లను నియమించుకుని వారి ద్వారా బ్యాంక్ ఖాతాకు అనుసంధానమైన ఖాతాదారుల నెంబర్లు తీసుకుని ఇలాంటి క్రైమ్ కు పాల్పడుతున్నట్లు విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు.
అరెస్టయిన వారిలో మలప్పురం పాపన్నూరుకు చెందిన సాధిక్ ప్రధాన నిందితుడని తెలిపారు. సాదిక్ కు మన్హు అని ప్రధాన అనుచరుడు ఉన్నట్లు విచారణలో తేలిందని.. అతను కంబోడియాలోని కాల్ సెంటర్ ద్వారా ఈ నేరాలన్నీ ప్లాన్ చేసి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ బ్యాచ్ ఇలా కాజేసిన సొమ్మును డిజిటల్ కరెన్సీగా మార్చి కంబోడియాకు పంపిస్తారని తెలిపారు. ఈ కేసులో ప్రమేయమున్న మరికొంతమంది నిందితుల కోసం విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు వి. శిబు, సునీల్ కుమార్, సీనియర్ సివిల్ పోలీసు అధికారులు బి. బెన్నీ, పిఎస్ ప్రశాంత్, సివిల్ పోలీసు అధికారులు వి.విపిన్, ఆర్. రాకేష్, ఎస్.మణికంఠన్ తదితరులున్నారు.