బెట్టింగ్​ నుంచి బయటపడాలంటే ఎలా.?

బెట్టింగ్​ నుంచి బయటపడాలంటే ఎలా.?

పొగ, మందు, డ్రగ్స్​కు మనిషి అలవాటు పడినట్లే.. బెట్టింగ్​కి కూడా బానిస అవుతున్నాడు! సరదాగా మొదలైన అలవాటు వ్యసనంగా మారుతుంది. ఇలాంటి వాటిని ‘బిహేవియరల్ అడిక్షన్స్’ అంటారు. సాధారణంగా ఇష్టమైన ఫుడ్ తిన్నా, నచ్చిన గేమ్ ఆడినా బాడీలో డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆన్​లైన్ రమ్మీ, క్రికెట్ బెట్టింగ్, స్టాక్ మార్కెట్, హార్స్ రేస్​ లాంటివి ఆడినా బాడీలో హ్యాపీ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఆ క్షణం వచ్చే ఎగ్జయిట్​మెంట్​, డబ్బు వచ్చిందన్న సంతోషం భూమ్మీద నిలబడనీయవు. ఒక్కసారిగా రెక్కలు కట్టుకుని గాల్లో తేలినట్టు అనిపిస్తుంటుంది. దాంతో మైండ్ పూర్తిగా దాని ఆధీనంలోకి వెళ్లిపోతుంది. 

బెట్టింగ్​కి అలవాటు పడినవాళ్లంతా మొదట్లో ‘ఒకసారి ట్రై చేద్దాం’ అని స్టార్ట్​ చేస్తారు. మొదట తక్కువ డబ్బుతో బెట్టింగ్​ వేస్తారు. ఉదాహరణకు పోతే కొంచెమే.. వస్తే అంతకు పదింతలు అని ఆశపడతారు. లేదంటే ఏదో ఒకరోజు గెలుస్తామనే నమ్మకంతో చేస్తారు. అలా బెట్టింగ్​ వేయడం స్టార్ట్ చేశాక నిర్వాహకులకు కొత్త వాళ్లు అనే విషయం తెలిసి, మొదట డబ్బులు వచ్చేలా చేస్తారు. డబ్బురెట్టింపయ్యే కొద్దీ ఆశ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే దానికి పూర్తిగా అలవాటు పడి, చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా అప్పులు చేయడం స్టార్ట్ చేస్తాడో అక్కడి నుంచి అతని పతనం మొదలవుతుంది.

పైగా ఎక్కువ డబ్బు పెడితే ఇంకా ఎక్కువ వస్తుందనే అజ్ఞానంతో పెద్ద మొత్తంలో బెట్టింగ్ పెట్టి పోగొట్టుకుంటారు. డబ్బు పోతున్నా సరే.. బెట్టింగ్​కి బానిస అయిన వ్యక్తి ఆడకుండా ఉండలేడు. డబ్బులేకపోతే ఆడలేడు. దానివల్ల అప్పులు పెరుగుతాయి. అప్పులిచ్చినవాళ్లు తిరిగి ఇవ్వమని అడుగుతారు. ఇచ్చే స్థోమత లేనప్పుడు ఒత్తిడి పెరుగుతుంది. మానసికంగా కృంగిపోతారు. కొందరైతే ఎవరికీ చెప్పుకోలేక మథనపడిపోతుంటారు. ఇంట్లోవాళ్లకు అబద్ధాలు చెప్తుంటారు. ఎక్కువరోజులు అలాంటి స్థితిలో ఉన్నవాళ్లకు సూసైడ్ ఆలోచనలు వస్తాయి. అయితే ఇలాంటివాళ్లను అబద్ధాలు చెప్తున్నారనో, మోసం చేస్తున్నారనో భావించకూడదు. వ్యసనానికి బానిసైన వాళ్లుగా పరిగణించాలి. అలాంటివాళ్లను సైకియాట్రిస్ట్​ దగ్గరకు తీసుకెళ్లాలి. అవసరమైతే ‘డీ అడిక్షన్ సెంటర్​’లో ట్రీట్​మెంట్ ఇప్పించాలి. కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల కూడా బెట్టింగ్ వ్యసనాన్ని మాన్పించొచ్చు. ఆర్థిక పరమైన విషయాల్లో ఇతరులు బాధ్యత తీసుకోవాలి. వాళ్ల పట్ల సానుభూతితో ఉండాలి. ఇలాంటి సమస్యల నుంచి గట్టెక్కాలంటే ఇంట్లోవాళ్లు, ఫ్రెండ్స్ సాయం, మద్దతు చాలా అవసరం. 

గ్యాంబ్లింగ్ డిజార్డర్

ఇదొక బిహేవియరల్ డిజార్డర్. ఈ డిజార్డర్​ ఏంటంటే జూదం ఆడకుండా ఉండలేకపోవడం దీని లక్షణం. ఎప్పుడూ జూదం ఆడి ఎలా సంపాదించాలనే ఆలోచనలోనే ఉంటారు. ఎగ్జయిట్​మెంట్ కోసం పెద్దమొత్తంలో బెట్టింగ్ వేస్తారు. అందులో పోగొట్టుకున్న వాటిని అక్కడే తిరిగి సంపాదించాలనే ధోరణిలో ఉంటారు. జూదం ఆడడం వల్ల మానసిక సమస్యలు వస్తాయని తెలిసినా మానలేరు. ఆడడం తగ్గించినా, ఆపేసినా ఎమోషనల్​గా డిస్టర్బ్ అవుతారు. చిరాకు, అసౌకర్యం, యాంగ్జైటీ వంటివి కనిపిస్తాయి. లైఫ్​, కెరీర్​లో ప్రాబ్లమ్స్ ఎదురైనా గుర్తించలేకపోతారు. అప్పులు చేయడం, ఆస్తులు అమ్మడం చేస్తారు. అబద్ధాలు, దొంగతనాలు కూడా అలవాటవుతాయి. ఆర్థిక, మానసిక సమస్యలు వచ్చినా ఆడడం ఆపరు. 

బయటపడాలంటే.. 

ఆర్థిక సమస్యల్ని బాధ్యతగా ఇంట్లో వాళ్లతో చర్చించాలి. అప్పులు తీర్చే మార్గాలు ఏమున్నాయో వెతకాలి. ఫైనాన్షియల్​ ప్లానింగ్​ చేసుకోవాలి. అందుకోసం ఆర్థిక సలహాదారుల్ని సంప్రదిస్తే బెటర్.

గ్యాంబ్లింగ్​కి సంబంధించిన గ్రూపుల నుంచి బయటకు రావాలి. వాటినుంచి బయటపడేందుకు సపోర్ట్​ గ్రూపులు ఉంటాయి. వాటిల్లో చేరడం వల్ల సమస్యను అర్థం చేసుకోవచ్చు. 

ఒత్తిడి తగ్గడానికి ఏదైనా హాబీలను ప్రయత్నించొచ్చు. ఎక్సర్​సైజ్ వంటివి ప్రాక్టీస్  చేయాలి. మైండ్ గేమ్స్ స్ట్రెస్ రిలీఫ్ ఇస్తాయి.  
కోపింగ్ స్ట్రాటజీలు డెవలప్​ చేయడం, కోరికలను కంట్రోల్​ చేయడంలో కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఉపయోగపడుతుంది. 
కమ్యూనికేషన్ మెరుగుపరచడం, నమ్మకం కలిగేలా చేయడం, ఫ్యామిలీ సపోర్ట్​ కోసం ఫ్యామిలీ థెరపీ తోడ్పడుతుంది. 

బెట్టింగ్.. ప్రమోషన్.. కేసు.. 

సినీ సెలబ్రెటీలు, స్టార్​ క్రికెటర్లు, సోషల్ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్లు.. వీళ్లకున్న గుర్తింపుతో ప్రజలను విపరీతంగా ఆకట్టుకోగలరు. ఎంతగా అంటే.. వాళ్లు ‘ఏది చెప్పినా.. ఏం చేసినా కరెక్ట్​’ అనుకునేంత! అలాగని ప్రజలు అమాయకులు కాదు.. కానీ, ఎంతటి విజ్ఙానవంతులైననా ఇన్​ఫ్లుయెన్స్ చేయగలిగే సత్తా వాళ్లకు ఉంటుంది. ఇది అదనుగా తీసుకున్న బెట్టింగ్ యాప్ నిర్వహకులు, వాళ్లతో ప్రమోషన్లు చేయిస్తున్నారు.  ఇదంతా బాగానే ఉంది.. కానీ, వాళ్లను నమ్మి బెట్టింగ్ యాప్​లలో డబ్బులు పెట్టి నష్టపోయినవాళ్లు అప్పులపాలయ్యారు. మన తెలంగాణ రాష్ట్రంలోనే ఒక సంవత్సరంలో వంద కోట్లకు పైగా నష్టపోయినట్టు అంచనా. ఆ అప్పులు తీర్చలేక, ఇంట్లోవాళ్లకు చెప్పుకోలేక మానసిక వేదనతో ఆత్మహత్యాయత్నాలు చేస్తున్నారు కొందరు. ఇప్పటికే ఒక్క హైదరాబాద్​లోనే దాదాపు పది మంది ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు. 

ఐపీఎల్.. బెట్టింగ్​ సీజన్ 

ఐపీఎల్ అంటేనే బెట్టింగ్​ సీజన్​ అన్నట్టు మారిపోయింది. అవగాహన లేని వాళ్లు, అలవాటు లేనివాళ్లు అందరూ ఐపీఎల్ సీజన్ అనగానే బెట్టింగ్ పెట్టడానికి రెడీ అయిపోతుంటారు. జేబులో డబ్బుల్లేకపోయినా ఇతరుల దగ్గర అప్పులు చేసో, ఇంట్లో నగలు ఎవరికీ తెలియకుండా అమ్మేసో ఇలా రకరకాలుగా బెట్టింగ్​ చేస్తుంటారు. తీరా డబ్బులన్నీ పోగొట్టుకున్నాక, దిక్కుతోచని స్థితిలో సూసైడ్ అటెంప్ట్​ చేస్తుంటారు. ఇప్పటికే ఇలా ఆర్థిక, ప్రాణ నష్టం జరిగిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు బెట్టింగ్ యాప్​లపై పోలీసులు నిఘాపెట్టారని తెలియడంతో నిర్వాహకులు వేరే దారులు వెతుక్కునే అవకాశాలూ లేకపోలేదు. ఎందుకంటే ఐపీఎస్​ స్టార్ట్​ కావడంతో ఈ యాప్స్​కు మరింత డిమాండ్ పెరుగుతుందని కొత్త పేర్లతో యాప్స్​ని తీసుకొస్తుంటారు. ముఖానికి మాస్క్​లు పెట్టుకుని మరీ బెట్టింగ్ యాప్స్​ ప్రచారం చేయిస్తుంటారు. కొత్త పేర్లు, ఐడీలు, గ్రూపులు క్రియేట్ చేస్తారట!

గేమింగ్ వర్సెస్ బెట్టింగ్

గేమింగ్ అనేది సోషల్ యాక్టివిటీ. అంటే.. ఆన్​లైన్​లో గేమ్స్ ఆడడం ఒక యాక్టివిటీకి కిందకు వస్తుంది. అలా ఆడే ఆటలు కొన్ని ఉంటాయి. అవన్నీ గేమ్​ ఆఫ్ స్కిల్​ కిందకి వస్తాయి. మైండ్​కి పని చెప్పి, స్కిల్స్ పెంచే ఆట ఏదైనా చట్ట వ్యతిరేకం కాదు. అయితే జూదం, బెట్టింగ్ వంటివి స్కిల్​ గేమ్స్ కాదు. అవి గేమ్​ ఆఫ్​ చాన్స్ కిందకి వస్తాయి. అలాంటివి శిక్షార్హమే. కానీ, చట్టం గట్టిగా లేకపోవడం వల్ల అందులోని లొసుగుల్ని ఉపయోగించి బెట్టింగ్ యాప్​లు ప్రమోట్ చేయిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్​లో ఒరిజినల్ గేమ్స్ కంటే వర్చువల్ గేమ్స్​కే ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ గేమ్స్​లోనే ఎక్కువగా మోసపోతున్నారు పబ్లిక్. 

అప్పు తీర్చలేక..

బీటెక్ స్టూడెంట్, సాఫ్ట్​వేర్ ఇంజనీర్, ఒక్కడే కొడుకు, పేదరికం.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో కథ. వీళ్లు చేసిన తప్పుకు వాళ్ల కుటుంబాలు మనోవేదనకు గురవుతున్నాయి. ఒకప్పుడు కుటుంబాన్ని పోషించడానికి తల్లిదండ్రులు చేసిన అప్పులు పిల్లలు తీర్చే పరిస్థితులు ఉండేవి. కానీ, ఇప్పుడు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి, బిడ్డల భవిష్యత్​ బాగుండాలని వాళ్లు ఏది అడిగినా కాదనకుండా తెచ్చి ఇచ్చి, ఎంత బాగా చూసుకుంటున్నా పిల్లలు పక్కదోవ పడుతున్నారు. వాళ్లు చేసిన అప్పులు పేరెంట్స్ తీర్చాల్సి వస్తోంది. ఈ బెట్టింగ్​ వల్ల చేతికి అంది వచ్చిన పిల్లలు అర్థంతరంగా ప్రాణాలు తీసుకుంటుంటే.. ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం.

యువతే టార్గెట్​

నేటి యువత ఈజీగా సంపాదించే మార్గాలు వెతుక్కుంటున్నారు. అందులో భాగంగానే ఈ బెట్టింగ్​ యాప్​లు. ప్రస్తుతం సోషల్ మీడియాని విపరీతంగా వాడుతున్నారు. వాళ్లకు వేలల్లో ఫాలోవర్లు ఉంటారు. వాళ్లు చెప్తే ఫాలోవర్లు గుడ్డిగా నమ్మేస్తారనే ఉద్దేశంతోనే నిర్వాహకులు ఇన్​ఫ్లుయెన్సర్లకు డబ్బు ఆశ చూపి ప్రమోషన్లు చేయిస్తున్నారు. వాళ్లకు పెద్ద సెలబ్రెటీలు, క్రికెటర్లు కూడా చేస్తున్నారు.. ఇది లీగల్​ యాప్​. చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని నమ్మబలు కుతున్నారు. వాళ్ల మాటలు నమ్మిన ఇన్​ఫ్లుయెన్సర్లు తమ వీడియోల్లో బెట్టింగ్ యాప్​లు ప్రమోట్ చేస్తున్నారు. 

ముఖ్యమైన కారణాలు ఇవే.. 

  •     లగ్జరీ లైఫ్​స్టయిల్​ కోసం, ఇతరుల్ని చూసి తానూ అలా బతకాలని ఆశపడడం.
  •     ఖాళీగా ఉన్నప్పుడు టైంపాస్​ కోసం, ఎంటర్​టైన్​మెంట్ కోసం ఆడడం. కొవిడ్ టైంలో సరదాగా మొదలైంది చాలామందికి. 
  •     యాంగ్జైటీ, స్ట్రెస్​కి గురైనప్పుడు వాటి నుంచి బయటపడడానికి ఆడుతుంటారు. 
  •     బెట్టింగ్​లో గెలిచినవే గుర్తుంటాయి. కాబట్టి అప్పు చేసైనా ఆడాలనుకుంటారు.  
  •