- సాయం చేసేందుకు స్వతహాగా ముందుకొచ్చారు
- యూత్ ముందుండి ఇలాంటి మూవ్‌మెంట్స్ పెద్ద ఎత్తున తేవాలి
- ఇండియా@75 యూత్ సమ్మిట్‌లో జయేష్ రంజన్
బిజినెస్‌డెస్క్, వెలుగు: కరోనా కష్ట కాలంలో యువత ముందుకొచ్చి అవసరాల్లో ఉన్నవారికి సాయం చేసిందని రాష్ట్ర ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ పొగిడారు. అన్నదానం చేయడం, ట్రాన్స్‌పోర్టేషన్, మెడికల్ సప్లయ్ ఇలా చాలా అంశాల్లో సాధారణ ప్రజలు ముందుకొచ్చారని, ముఖ్యంగా యువత యాక్టివ్‌గా పాల్గొందని అన్నారు. ప్రస్తుతం 75 వ ఇండిపెండెన్స్ డేను, 150 వ మహాత్మా గాంధీ జయంతిని జరుపుకుంటున్నామని, ఈ సందర్భంగా సాధారణ ప్రజలు స్వతహాగా ముందుకొచ్చి సాయం చేసేలా మూవ్‌మెంట్‌ను తీసుకురావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మూవ్‌మెంట్‌ను యువతే ముందుండి నడిపేలా చేయాలన్నారు. సీఐఐ తెలంగాణ, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) కలిసి నిర్వహించిన ఇండియా@75 యూత్ సమ్మిట్‌లో జయేష్ రంజన్ మాట్లాడారు. ఈ ఈవెంట్‌లో యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్స్లర్ బీజే రావు, సీఐఐ తెలంగాణ చైర్మన్ సమీర్ గోయల్, ఐడబ్ల్యూఎన్–తెలంగాణ చైర్‌వుమెన్ కాంబ్లే పూర్ణిమా, విశాక ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ జీ వంశీ కృష్ణ, గివ్‌రెడ్ ఫౌండర్ హర్షిణీ, ఫ్యాకల్టీ ఫౌండర్ రాకేష్ దుబ్బుడు, కిర్బీ ఇండియా ఎండీ డీ రాజు, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్ ప్రభాకర్ రావు పాల్గొన్నారు.
మెరుగైన వ్యవస్థ కోసం అందరం కలిసి పనిచేయాలి: వంశీ కృష్ణ
విశాక ఎండీ వంశీ మాట్లాడుతూ, పరిస్థితులను మార్చుకొని ముందుకెళ్లాలని యువతకు సలహాయిచ్చారు. వ్యవస్థను మెరుగుపరచడానికి అందరం కలిసి పనిచేయాల్సి ఉందని, తాత్కాలిక ఆనందం కోసం ఆగిపోవద్దని యూత్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. ‘ప్రపంచానికి సస్టయినబుల్ బిజినెస్‌లు చాలా అవసరం. వీటిని డెవలప్ చేయడానికి మనమందరం కలిసి పనిచేయాలి’ అని అన్నారు. ఇన్నొవేటివ్ మైండ్స్‌ను క్రియేట్ చేయడంలో కొన్ని విధానాలను ఏర్పాటు చేసుకోవాలని బీజే రావు అన్నారు. క్లాస్ రూమ్‌లో కంటే బయటే అసలైన విషయాలను నేర్చుకోవచ్చని, అందుకే యూనివర్శిటీలు ‘అవుట్ ఆఫ్ బాక్స్’ లెర్నింగ్ విధానాలను డెవలప్ చేయాలని చెప్పారు. ఇండియా 75 వ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్న సందర్భంగా, యూత్‌ను ఇండస్ట్రీలలోని సీనియర్లతో ఇంటరాక్ట్ చేయిస్తున్నామని సమీర్ గోయల్ అన్నారు. ఇందులో మొదటిది ఇండియా@75 యూత్ సమ్మిట్ అని పేర్కొన్నారు.