యువత ఓట్లే కీలకం

యువత ఓట్లే కీలకం
  • క్యాండిడేట్ల భవిష్యత్​ను డిసైడ్​ చేసేది వీరే  
  • ఉమ్మడి జిల్లాలో 39 ఏండ్ల లోపు ఓటర్లు 10.32 లక్షలు
  • కొత్తగా నమోదైన వారు 61,399​ మంది

కామారెడ్డి, వెలుగు: వచ్చే ఎన్నికల్లో ఎవరిని అసెంబ్లీకి పంపాలని నిర్ణయించే వారిలో యువతీయువకులు ​చాలా కీలకం కానున్నారు. ఆయా పార్టీల గెలుపోటములను యువ ఓటర్లు తేల్చనున్నారు.       అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కమిషన్​ప్రకటించిన ఫైనల్​ఓటర్ లిస్టులో యూత్​ఓటర్ల సంఖ్యే అధికంగా ఉంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 18,11,530 మంది ఓటర్లుండగా, ఇందులో 39 ఏండ్ల లోపువారే 10,32,638 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో 18 నుంచి 39 ఏండ్ల లోపు వారే 57 శాతం మంది ఉండడం గమనార్హం. కొత్తగా 61,399 మంది ఓటు హక్కు పొందారు. వీరు నవంబరు​30న జరిగే ఎలక్షన్​లో మొదటిసారి ఓటేయనున్నారు.18 ఏండ్లు నిండిన వాళ్లు తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలనే ఉద్దేశంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికార యంత్రాంగం ప్రత్యేక క్యాంప్​లు ఏర్పాటు చేసింది. కాలేజీల్లో ఆవేర్​నెస్​ప్రోగ్రామ్స్​కూడా చేపట్టారు. బూత్​ల వారిగా ఆఫీసర్లను నియమించి ఓటుహక్కు నమోదుకు అవకాశమిచ్చారు. దీంతో ఈ సారి ఎక్కువ సంఖ్యలో యువత ఓటు హక్కుకోసం దరఖాస్తు చేసుకున్నారు.

కామారెడ్డి జిల్లాలో.. 

జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్​నియోజకవర్గాల్లో మొత్తం 8,54,004 మంది ఓటర్లున్నారు. ఇందులో 39 ఏండ్ల లోపువారే 4,44,939 మంది ఉన్నారు. 29 ఏండ్లలోపు వారి సంఖ్య 1,78,734గా ఉంది. 39 ఏండ్ల లోపు వారు 2,39,560 మంది ఉన్నారు. కొత్తగా 26,645 మంది ఓటుహక్కు పొందారు.

నిజామాబాద్​జిల్లాలో.. 

జిల్లాలోని నిజామాబాద్​అర్బన్, నిజామాబాద్​రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో మొత్తం 9,57,526 మంది ఓటర్లుండగా, ఇందులో 39 ఏండ్లలోపు వారే  5,87,699 మంది ఉన్నారు. 29 ఏండ్లలోపు వారు 2,40,963 మంది, 39 ఏండ్ల లోపు వారు  3,11,982 మంది ఉన్నారు. 34,982 మంది కొత్తగా ఓటు హక్కు పొందారు.  

ALSO READ: రాష్ట్రంలో రజాకారుల రాజ్యం నడుస్తున్నది

యువతను ఆకర్షించేందుకు..

ఎన్నికల్లో యూత్ ఓట్లే కీలకంగా మారనున్న నేపథ్యంలో వీరిని ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ప్రతిపక్షాలు నిరుద్యోగ సమస్యను తమ ప్రచార అస్త్రంగా మార్చుకున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీల లీడర్లు జాబ్​మేళాలు కూడా ఏర్పాటు చేశారు. తమ పర్యటనల్లో యువతను ఆకట్టుకునేలా స్పీచ్​లు ఇస్తున్నారు. గ్రామాల్లో యూత్​కు పోటీలు నిర్వహించడంతో పాటు స్పోర్ట్స్​కిట్లు పంపిణీ చేస్తున్నారు. అధికార బీఆర్ఎస్​కూడా యూత్​పైనే అధికంగా దృష్టి సారించింది. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో జాబ్​మేళాలు ఏర్పాటు చేశారు. ఆర్మూర్, బోధన్​తదితర నియోజకవర్గాల్లో డ్రైవింగ్​లైసెన్సు మేళాలు నిర్వహించారు.