- ఉమ్మడి జిల్లాల్లో యువ ఓటర్లు 54. 07 శాతం
వనపర్తి, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో యువత ఓటే కీలకం కానుంది. 54 శాతం ఓట్లు 30 ఏండ్ల లోపు వారివే ఉండడంతో వారి తీర్పే ఫైనల్ అవుతుందని అంటున్నారు. అభ్యర్థుల గెలుపోటములను యువత ఓట్లు ప్రభావితం చేయనుండడంతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ పార్టీలు వారికి తాయిలాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే ఈ సారి ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరుజిల్లా వ్యాప్తంగా 100 మంది వరకు యువత (నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు. ) ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేయడం గమనార్హం. గ్రామాలు, మండల కేంద్రాలు, పట్టణాల్లో యువ ఓటర్లకు మద్దతు పలుకుతుండడంతో ఉమ్మడి పాలమూరులోని అన్ని నియోజకవర్గాల్లో యువరక్తం ఉరకలేస్తోంది.
ఎవరి వైపు మొగ్గుతారో?
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగానికిపైగా 40 ఏండ్ల లోపు ఓటర్లు ఉండడం, వారు ఎవరి వైపు మొగ్గుతారోనని రాజకీయ పరిశీలకులు అంచనాలు వేస్తున్నారు. ఇక 30 ఏండ్ల లోపు వారిపై ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాలతో పాటు వనపర్తి జిల్లాలోని వనపర్తి నియోజకవర్గం, నాగర్ కర్నూల్ జిల్లాలోని నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాలు, గద్వాల జిల్లాలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలు, నారాయణపేట జిల్లాలోని నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో యువత ఓట్లపై అన్ని పార్టీలు ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించాయి.
బీఆర్ఎస్ యువతలో ఉన్న వ్యతిరేకతను ఏదో రకంగా జయించాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ అభ్యర్థులు ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. బీజేపీ లీడర్లు మాత్రం జాతీయ భావం, దేశభక్తి అంశాలను ప్రస్తావిస్తూ ఓటు అడుగుతున్నారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో తుది అభ్యర్థుల జాబితా వెల్లడైంది. ఈ నేపథ్యంలో మిగిలిన అభ్యర్థులు ఇక గెలుపే లక్ష్యంగా ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు.
సామాజిక వర్గాల వారీగా వివరాలు తీసుకొని లెక్కలు కట్టి ఎవరి ఓటు ఏ విధంగా పొందాలన్న దానిపై వ్యూహం రచిస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో యువతీ, యువకులు ఎక్కువగా ఈసారి ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండడంతో వారిని ఆకట్టుకుంటే తమదే విజయం అంటూ ఆశలు పెట్టుకుంటున్నారు.
పార్టీల స్పెషల్ ఫోకస్..
అన్ని పార్టీలు యువత తమ వైపు మొగ్గు చూపుతారని ఆశలు పెట్టుకుంటున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అభ్యర్థులు యువతను ఆకట్టుకునేందుకు ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించారు. గ్రామాల్లో క్రికెట్, వాలీబాల్ కిట్లు, ఇతర క్రీడా సామగ్రి పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్రామాల్లో యువజన సంఘాలను కలిసి మద్దతు కోసం ప్యాకేజీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
మరికొందరు కాలేజీ ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లను కలిసి స్టూడెంట్ల ఓట్లు తమకు వచ్చేలా చూడాలని కోరుతున్నారు. వీటితో పాటు యువతకు మందు, విందులు ఏర్పాటు చేస్తుండడంతో పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల అధికారులు ఇలాంటి దావత్లపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
85 వేల మంది కొత్త ఓటర్లు ..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 85 వేల మంది కొత్త ఓటర్లు ఈ సారి తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఐదేండ్లుగా ఓటు నమోదు చేసుకున్న వారికి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి ఓటు వేసే అవకాశం వచ్చింది. ఆయా నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల లీడర్లు ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా స్టూడెంట్లను ఓటర్లుగా నమోదు చేయించేందుకు చొరవ చూపారు. ఇలా ఓటర్ల జాబితాలో చేర్పించిన వారిని కలిసి తమకే ఓటు వేయాలని కోరుతున్నారు. అయినప్పటికీ కొత్త ఓటర్లు ఎవరికి అనుకూలంగా ఓటు వేస్తారోననే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది.