- పెరిగిన కొత్త ఓటర్లు
- కామారెడ్డి జిల్లాలో 18 నుంచి 39 ఏండ్ల లోపు వారే కీలకం
కామారెడ్డి , వెలుగు: జహీరాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో యూత్ ఓటర్లు కీలకంగా మారనున్నారు. కామారెడ్డి జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 18–39 ఏండ్లలోపు వారు 3,44,373 మంది ఉన్నారు. వీరిలో మెజార్టీ ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపనున్నారనేది, ఏ పార్టీ యూత్ ఓట్లను తమ ఖాతాలో వేసుకుంటుందనేది పొలిటికల్‌గా చర్చ నడుస్తోంది. దీంతో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు వీరి ఓట్లపై స్పెషల్‌గా ఫోకస్ పెడుతున్నారు.
జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజక వర్గాల్లో మొత్తం 6,80, 921 మంది ఓటర్లు ఉండగా వీరిలో 18 నుంచి 39 ఏండ్ల లోపు ఉన్న 3,44,373 ఓటర్లు అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించనున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో యూత్ ఓటర్లు ప్రభావం చూపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగాల భర్తీ , నిరుద్యోగ సమస్య, నిరుద్యోగ భృతి వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రాగా.. అభ్యర్థుల గెలుపొటములను ఈ ఓట్లే డిసైడ్ చేశాయి. ఈ పరిస్థితుల్లో ఎంపీ ఎన్నికల్లో యూత్ ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రయత్నిస్తున్నాయి. దేశ భవిష్యత్, ఉద్యోగాల భర్తీ లాంటి అంశాలను ప్రధానంగా ఆయా చోట్ల నిర్వహించే బహిరంగ సభలు, మీటింగ్స్ లో నేతలు ప్రస్తావిస్తున్నారు. ఉన్నత విద్య, ఉద్యోగాల భర్తీపై హామీలు కురిపిస్తున్నారు.
పెరిగిన యూత్ ఓటర్లు
గతంలో కంటే యూత్ ఓటర్ల సంఖ్య పెరిగింది. 18 ఏండ్లు నిండిన వారు గతంలో ఓటరుగా నమోదుకు ఆసక్తి చూపేవారు కాదు. ఎలక్షన్ కమిషన్ యూత్ ఓటర్లు నమోదు చేసుకునే విధంగా పలు చర్యలు చేపట్టింది. కాలేజీల్లో అవగాహన పొగ్రాంలు నిర్వహించారు. ఆన్లైన్లో ఓటరుగా ఎంట్రీకి అప్లికేషన్లను స్వీకరించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల కంటే ఎంపీ ఎన్నికల వరకు జిల్లాలో కొత్తగా యూత్ ఓటర్లు 3 వేల మంది పెరిగారు. 18-,19 ఏండ్ల మధ్య 20,962 మంది ఉన్నారు. వీరిలో కొందరు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు.
కొత్తగా ఓటరుగా నమోదైన వారు ఎంపీ ఎన్నికల్లో కీలకం కానున్నారు. పార్లమెంట్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో 2 వేల నుంచి 4 వేల వరకు కొత్త ఓటర్లు ఉన్నారు. ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపడుతోంది. యూత్ ఓటర్ల పోలింగ్ శాతం పెరిగే అవకాశముంది.
సోషల్ మీడియా ద్వారా
యూత్ ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా పార్టీలు ప్రధానంగా సోషల్ మీడియాను నమ్ముకున్నాయి. ఎక్కువగా యూత్ సోషల్ మీడియాలోని వివిధ ఫీచర్స్‌ను వినియోగిస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే పథకాలు, ఉద్యోగాల భర్తీ లాంటి అంశాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ యూత్‌కు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.