బీహార్ ఎన్నికల్లో ఇప్పుడంతా యూత్ హవానే. రాజకీయ పార్టీలను నడిపిస్తున్న వారిలో ఎక్కువ మంది యంగ్ లీడర్లే ఉన్నారు. హ్యాట్రిక్ కొట్టి నాలుగోసారి అధికార పీఠం దక్కించుకోవడానికి 69 ఏండ్ల నితీశ్‌కుమార్ చూస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా, మహాకూటమి సీఎం క్యాండిడేట్‌గా రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీ యంగ్ లీడర్ తేజస్వీ యాదవ్ తలపడుతున్నారు. తేజస్వీ వయసు 30 ఏండ్లే. ఇక మొన్నటి వరకూ ఎన్డీఏ కూటమిలో ఉన్న లోక్‌జనశక్తి (ఎల్జేపీ) పార్టీ చీఫ్, కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ ఇటీవలే కన్నుమూశారు. ఇప్పుడు తమ పార్టీని ఒంటరిగా బరిలోకి దించాలని డిసైడ్ అయ్యారు చిరాగ్ పాశ్వాన్. చిరాగ్ వయసు 37 ఏండ్లే. వీరిద్దరే కాదు ఎంతో మంది యూత్ లీడర్లు ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే యూత్ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఇప్పుడు కీలకం.
బీహార్ ఎన్నికలంటే ఎప్పుడూ టఫ్ ఫైట్ ఉంటుంది. సీనియర్ నాయకులు అధికారం కోసం తలపడుతుంటారు. అటు సీఎం నితీశ్ కుమార్‌గానీ, ఆర్జేడీ చీఫ్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ గానీ, ఎల్జేపీ చీఫ్ కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్.. ఇలా ఎందరో నేతలు బీహార్ రాజకీయాలను ప్రభావితం చేశారు. ఇప్పుడు నితీశ్ ఒక్కరే లైమ్‌లైట్‌లో ఉన్నారు. మిగతా వారు దాదాపు ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి స్కామ్‌లో ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆయన పూర్తిగా ఎన్నికల ప్రచారానికి దూరమయ్యారు. లాలూ లేకుండా బీహార్ లో ఎన్నికలు జరగడం 40 ఏండ్లలో ఇదే తొలిసారి. ఇక రామ్ విలాస్ పాశ్వాన్ బీహార్‌లో బలమైన దళిత నాయకుడు. ఎల్జేపీని సుదీర్ఘకాలంలో అధికారంలో ఉండేలా చేయగలిగిన నాయకుడు ఆయన. ఇటీవల ఆయన మరణించడంతో ఆ పార్టీపైనా ప్రభావం పడింది. అయితే పాశ్వాన్ ప్రభావం ఎన్నికలపై ఎంత ఉంటుందనే విషయం ఇప్పటికిప్పుడు స్పష్టంగా తెలియడం లేదు. ఇక ఎన్డీఏ కూటమి విషయానికి వస్తే నితీశ్ కుమార్ ఒక్కరిపైనే ఆధారపడింది. 69 ఏండ్ల వయసులోనూ పార్టీని గట్టెక్కించేందుకు నితీశ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వ వ్యతిరేకత ఆయనకు పెద్ద అడ్డంకి కానుంది.
అటు తేజస్వీ.. ఇటు చిరాగ్..
లాలూ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్ ఇప్పుడు ఆర్జేడీని నడిపిస్తున్నాడు. ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ ఆధ్వర్యంలోని మహాకూటమికి సీఎం క్యాండిడేట్ తేజస్వీనే. ఇప్పటికే ఒకటిన్నరేండ్లు డిప్యూటీ సీఎంగా పనిచేసిన అనుభవం తేజస్వీకి ఉంది. అలాగే ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత ఆయనే. దేశంలోనే అతి చిన్న వయసులో ప్రతిపక్ష నేతగా ఉన్న నాయకునిగా తేజస్వీ రికార్డు సొంతం చేసుకున్నారు. ఇక రామ్ విలాస్ పాశ్వాన్ మరణంతో ఆయన కొడుకు చిరాగ్ పాశ్వాన్ ఈ ఎన్నికల్లో పార్టీని నడిపిస్తున్నారు. మొన్నటి వరకూ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయిన ఈ పార్టీ ఇప్పుడు ఒంటరిగా బరిలోకి దిగుతోంది. పాశ్వాన్ మరణంతో సానుభూతి ఎంత వరకూ పని చేస్తుందనే విషయం ఇప్పుడు స్పష్టంగా తెలియడం లేదు. పాశ్వాన్ ఎఫెక్ట్ దళితులపై ఉంటుందని పొలిటికల్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. కానీ, ఒంటరిగా పోటీ చేయాలన్న నిర్ణయం ఎవరిపై ప్రభావం చూపుతుందనే దానిపైనా క్లారిటీ లేదు.
ఇంకా ఎందరో యంగ్ లీడర్లు
తేజస్వీ యాదవ్, చిరాగ్ పాశ్వానే కాదు ఇంకా ఎంతో మంది యంగ్ లీడర్లు ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ప్రభావం చూపేందుకు సిద్ధమవుతున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదివిన పుష్పం ప్రియ చౌదరి(28) ప్లూరల్స్ పేరుతో ఓ పార్టీని ఏర్పాటు చేశారు. ఇంజనీర్లు, డాక్టర్లు, సోషల్ యాక్టివిస్టులు, టీచర్లు, ప్రొఫెసర్లు, ఫార్మర్స్, రిటైర్డ్ ఆఫీసర్లకు టికెట్లు ఇచ్చారు. ప్రతి క్యాండిడేట్ తమ మతంగా బీహారీ అని ప్రకటించడం విశేషం. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ సెట్ డిజైనర్ ముకేశ్ సహానీ(35) వికాశ్‌శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) పేరుతో పార్టీ పెట్టారు. ఇది ప్రస్తుతం ఎన్డీఏలో పార్ట్నర్. ఇక షూటర్ శ్రేయసీ సింగ్(29) బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. తేజస్వీ యాదవ్ అన్న తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా వార్తల్లో ఉంటున్నారు.
మార్పునకు మూడు కారణాలు
ఈ ఎన్నికలు కాస్త డిఫరెంట్‌గా ఉంటాయని చెప్పడానికి మూడు కారణాలు ఉన్నాయని సోషల్, పొలిటికల్ ఎక్స్పర్ట్ డీఎం దివాకర్ చెప్పారు. ‘‘లాక్ డౌన్ వల్ల లక్షలాది మంది వలస కూలీలు బీహార్‌కు తిరిగి వచ్చారు. వీరిలో ఎక్కువ శాతం యువతే. ఓటు వేసే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తమ గురించి పట్టించుకుందా లేదా అనేది వీరి నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇక రెండో కారణం.. కరోనా కారణంగా ముసలివారు, ఇతర వ్యాధులు ఉన్న వారు పోలింగ్ బూత్‌లకు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. అందువల్ల యూత్ ఈ ఎన్నికలను డ్రైవ్ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక మూడో రీజన్.. సోషల్ మీడియా, టెక్నాలజీ అందుబాటులోకి రావడం. వీటి కారణంగా యూత్ పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనటానికి వీలవుతుంది”అని చెప్పారు. ‘‘లాలూ జైలులో ఉన్నారు. రామ్ విలాస్ పాశ్వాన్ ఇక లేరు. తేజస్వీ యాదవ్ అపోజిషన్ సీఎం క్యాండిడేట్. చిరాగ్ పాశ్వాన్ కూడా బరిలో ఉన్నారు. కానీ, ఈ ఎన్నికలను యూత్ సెంట్రిక్‌గా చూడటానికి ఇవన్నీ సరిపోకపోవచ్చు. 2025లో నితీశ్ ఒకవేళ రిటైర్ అయితే అప్పుడు ఆ పరిస్థితి రావొచ్చు”అని సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపిం సొసైటీస్(సీఎస్డీఎస్)కు చెందిన సంజయ్ కుమార్ చెప్పారు.
యూత్ ఓటర్లే ఎక్కువ
బీహార్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 7.18 కోట్లు. వీరిలో 18–39 ఏండ్ల మధ్య ఉన్న వారి సంఖ్య3.66 కోట్లు. మొత్తం ఓటర్లలో 18–25 ఏండ్ల మధ్య వయసు ఉన్న ఓటర్లు 16 శాతం వరకూ ఉంటారని అంచనా. అందువల్ల యూత్‌ను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే అధికార జేడీయూ ఆ ప్రయత్నాల్లో తలమునకలై ఉంది. స్టూడెంట్, యూత్ వింగ్స్ నితీశ్ గవర్నమెంట్ చేసిన పనులపై ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు తమ యూత్ వింగ్స్నే వాడుకుంటున్నాయి. బీహార్‌లో అక్టోబర్ 28, నవంబర్ 3, 7వ తేదీల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి.
బీహర్ లో మొత్తం ఓటర్లు: 7.18 కోట్లు
18-39 ఏండ్ల మధ్య ఓటర్లు: 3.66 కోట్లు