
తూప్రాన్ , వెలుగు : మెదక్ జిల్లా తూప్రాన్ లో ఓ యువకుడిని అతడి స్నేహితులు సిగరెట్లు, లైటర్లతో కాల్చి చిత్రహింసలు పెట్టారు. వారి నుంచి తప్పించుకున్న అతడు కొందరి సాయంతో కుటుంబసభ్యులకు సమాచారమివ్వగా దవాఖానలో చేర్పించారు. స్థానికుల కథనం ప్రకారం..మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపల్లికి చెందిన నారాయణ తూప్రాన్ కు చెందిన సాయి, జితేందర్ స్నేహితులు. నారాయణ వ్యవసాయ కూలి కాగా, సాయి ఆటో డ్రైవర్. జితేందర్ కుటుంబసభ్యులకు టీ స్టాల్ ఉంది. ఆదివారం రాత్రి మద్యం తాగుదామని చెప్పి నారాయణను సాయి, జితేందర్ తూప్రాన్ పిలిపించారు. సాయి ఇంట్లో మద్యం తాగారు.
రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి మూడు గంటల వరకు నారాయణ బట్టలిప్పేసి చిత్రహింసలు పెట్టారు. శరీరంపై సిగరెట్లతో వాతలు పెట్టారు. లైటర్లతో స్ర్కూడ్రైవర్లు, టెస్టర్లను వేడిచేసి మర్మాంగాన్ని కాల్చారు. కరెంటు తీగలతో కొట్టారు. చివరకు మూడు గంటల సమయంలో నారాయణ వారి కళ్లు గప్పి తప్పించుకుని 44 నేషనల్ హైవే దాబాల వైపు వెళ్లాడు. అక్కడ కొందరిని సాయం కోరి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. వారు వచ్చి నారాయణకు తూప్రాన్ గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతోనే నారాయణను చిత్ర హింసలు పెట్టినట్లు తెలిసింది. తల్లిదండ్రులు తూప్రాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.