హామీలు అమలు చేయకుండా ఓట్లు అడగడానికి వస్తవా? : గ్రామస్తులు

తిమ్మాపూర్, వెలుగు : ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామగ్రామాన నాయకులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్  మండలంలోని నల్లగొండ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతుండగా అక్కడే ఉన్న యువకులు జై కాంగ్రెస్  అని నినదించారు. 

రసమయి ప్రసంగాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఆయన సహనం కోల్పోయి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘గతంలో గ్రామానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే కాకుండా ఇప్పుడు ఓట్లు అడగడానికి వచ్చావా?” అని స్థానిక యువకులు, గ్రామస్తులు నిలదీశారు. దీంతో గ్రామస్తులు, బీఆర్ఎస్  నాయకులకు మధ్య తోపులాట జరిగి కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనంతరం రసమయి మాట్లాడుతూ ఇప్పుడైతే ఓటు వేయండి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పినా స్థానికులు వినకుండా ఆందోళన చేశారు. 

దీంతో రసమయి గ్రామస్తులను దుర్భాషలాడినట్లు పలువురు చెప్పారు. అక్కడే ఉన్న స్థానిక ఎల్ఎండీ పోలీసులు పలువురికి నచ్చచెప్పినప్పటికీ వినకపోవడంతో కొంతమందిని అదుపులోకి తసుకున్నట్లు సమాచారం. ఇరు వర్గాల వారు చేసిన ఫిర్యాదుపై కేసులు నమోదు చేశామని ఎల్ఎండీ ఎస్సై ప్రమోద్​ రెడ్డి తెలిపారు.