ఆటో డబ్బింగ్​.. క్రియేటర్లకు ఓ వరం!

ఆటో డబ్బింగ్​.. క్రియేటర్లకు ఓ వరం!

యూట్యూబ్​ ఛానెల్​లో కంటెంట్ క్రియేటర్లు చాలామందే ఉన్నా, అందులో కొందరే అన్ని భాషల వారికీ చేరువగా ఉన్నారు. మిగతా వాళ్లంతా తమ భాష తెలిసినవాళ్లకు మాత్రమే దగ్గరయ్యారు. కానీ, యూట్యూబ్​ అనేది ప్రపంచవ్యాప్తంగా సక్సెస్​ఫుల్​గా రన్​ అవుతోన్న అతిపెద్ద ప్లాట్​ఫాం. ఇందులో మారుమూల పల్లె నుంచి సిటీల దాకా, అంతెందుకు దేశాలు, ఖండాంతరాలు దాటి వీడియోలు చేస్తుంటారు. అదే విధంగా చూసేవాళ్లూ ఉన్నారు. కాకపోతే కంటెంట్ క్రియేటర్లు చేసే వీడియో దేనికి సంబంధించింది, వాళ్లు ఏం మాట్లాడుతున్నారనేది తెలియాలంటే భాష తెలిసి ఉండాలి. 

అందరూ అన్ని భాషలు నేర్చుకోలేరు. కాబట్టి ఒక భాషలో వీడియో చేస్తే.. ఇతర భాషల్లో డబ్బింగ్​ చెప్పుకునేలా యూట్యూబ్​ స్వయంగా కొత్త ఫీచర్​ తీసుకొచ్చేసింది. ఇప్పుడు సినిమాలు ఎలాగైతే ఏ భాషలో తీసినా, అన్ని భాషల్లో చూస్తున్నామో అచ్చం అలానే యూట్యూబ్​ వీడియోలు కూడా చూసేయొచ్చు. ఇంతకీ యూట్యూబ్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్​ ఏంటంటే.. ఆటో డబ్బింగ్. దీని ద్వారా యూట్యూబ్​ చూసే ఏ వీడియోలనైనా అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. ఈ ఆటో డబ్బింగ్ ఫీచర్​ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం​తో పనిచేస్తుంది. 

ఇదెలా పనిచేస్తుందంటే.. ఒక భాషలో వీడియో చేసి అప్​లోడ్ చేస్తే.. ఆ భాష తెలియని వాళ్లు దాన్ని అర్థం చేసుకునేందుకు వీలుగా ఇతర భాషల్లోకి అనువాదం అవుతుంది. ఉదాహరణకు ఇంగ్లీష్​లో వీడియో చేస్తే అది ఫ్రెంచ్, జర్మన్, హిందీ, ఇండోనేసియా, ఇటాలియన్, జపనీస్, పోర్చుగీస్, స్పానిష్​ భాషల్లోకి అనువాదం చేస్తుంది. ఈ భాషల్లో చేసిన ప్రతి వీడియో ఇంగ్లీష్​లో డబ్​ అవుతుంది. ఇలా ఒక భాష నుంచి మరొక భాషకు అనువాదం చేయడానికి ఏఐ టెక్నాలజీ సాయపడుతుంది.

 కంటెంట్ క్రియేటర్స్​కు చాలా ఉపయోగపడుతుంది ఈ ఆటో డబ్బింగ్ ఫీచర్. ప్రస్తుతానికి ఈ ఫీచర్​ కొత్తగా వచ్చింది కాబట్టి కొన్నిసార్లు అనువాదం చేసేటప్పుడు తప్పులు ఉండొచ్చు. కానీ, రాబోయే రోజుల్లో ఈ ఫీచర్​ మరింత మెరుగుపడుతుంది. ఇప్పటికైతే అందరికీ అందుబాటులో లేదు. కంపెనీ ప్రస్తుతం దీన్ని ఎంచుకున్న కొన్ని ఛానెల్స్​కు మాత్రమే అందుబాటులో ఉంచింది. ఈ ఫీచర్ మీ ఛానెల్​కు అందుబాటులో ఉంటే దీన్ని అడ్వాన్స్డ్​ సెట్టింగ్స్​లో చూడొచ్చు.