ప్రపంచవ్యాప్తంగా వాడే వీడియో ప్లాట్‌ఫాం యూట్యూబ్. అయితే వ్యూయర్ల సంఖ్యను పెంచుకోవడం కోసం కొన్ని వీడియోలకు ఫేక్ థంబ్‌నెయిల్స్ పెడుతుంటారు. వీడియోలో ఉన్న కంటెంట్‌కి, దానికి పెట్టిన థంబ్‌నెయిల్‌కు సంబంధం ఉండదు. దీంతో చాలామంది దీనిపై రిపోర్ట్ కూడా చేస్తుంటారు. వీడియో కింద కామెంట్స్ అయితే లెక్కలేనన్ని పెడుతుంటారు. ఈ ప్రాబ్లమ్‌కి చెక్ పెట్టాలనే ఆలోచన చేస్తోందట కంపెనీ.
‘ఇండియాలోని ఫేక్ క్లిక్‌బైట్ థంబ్‌నెయిల్స్, టైటిల్స్‌తో వీడియోలను చేసే కంటెంట్ క్రియేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామ’ని తమ బ్లాగులో తెలిపింది. ఇది ముఖ్యంగా బ్రేకింగ్ న్యూస్ లేదా కరెంట్ ఈవెంట్లకు సంబంధించిన వీడియోల్లో ఉంటుంది. దీంతో అసలు ఆ వీడియోలో లేకపోగా, వ్యూయర్స్‌ని తప్పుదారి పట్టిస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్, కరెంట్ అఫైర్స్‌పై వీడియోలు చేసే ఇండియన్ కంటెంట్ క్రియేటర్లు ఈ కోవలోకి వస్తారు. కాబట్టి కంటెంట్‌లో లేని విషయాన్ని థంబ్‌నెయిల్స్, టైటిల్స్‌గా పెట్టకూడదు.
ఒకవేళ అలా పెడితే థంబ్నెయిల్తోపాటు ఆ వీడియోను కూడా తొలగిస్తుందట యూట్యూబ్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వర్క్ జరుగుతోందని తెలిపింది. ఇక నుంచి వీడియోలు అప్లోడ్ చేసేముందు కాస్త ఆలోచించి టైటిల్స్ పెట్టుకుంటే నో ప్రాబ్లమ్! అని చెప్పకనే చెప్తోంది.