యూట్యూబర్..తమిళ వంటలకు కేరాఫ్​. . స్టెఫీ

ఇంట్లో ఏం కూరగాయలు ఉన్నాయి.. వాటితో ఏం వండాలి? కొత్త వంటకం ఎలా ట్రై చేయాలి? .. ఇలాంటి ప్రశ్నలు తలెత్తిన ప్రతిసారి ఎక్కువమంది మహిళలు యూట్యూబ్‌‌లో వంటల వీడియోలు చూస్తుంటారు. అయితే.. తమిళ ఆడపడుచులు మాత్రం ముఖ్యంగా మద్రాస్‌‌ సమయల్‌‌ ఛానెల్‌‌ చూస్తారు. ఎందుకంటే.. ఈ ఛానెల్‌‌లో అథెంటిక్‌‌ తమిళ వంటకాలు ఎన్నో ఉన్నాయి. ఇంతకీ ఈ ఛానెల్ ఎవరు నడుపుతున్నారు? ఎలా మొదలైంది? 

ఈజీగా వంటలు చేయడం చూపించే యూట్యూబ్ ఛానెళ్లు ఆడవాళ్లకు ఒక విధంగా వరమనే చెప్పాలి. వాటి వల్లే వంట తెలియని వాళ్లు కూడా గరిటె తిప్పుతున్నారు. కమ్మని వంటలు వండుతున్నారు. అలా తమిళ ఆడవాళ్లకు సాయపడే ఛానెళ్లలో మద్రాస్ సమయల్‌‌ ముందు వరుసలో నిలుస్తుంది. తమిళనాడులోని ఎన్నో కిచెన్‌లలో ఘుమఘుమలకు కారణమైన ఈ ఛానెల్‌‌ను నడిపించేది అమెరికాలో ఉంటున్న స్టెఫీ. ఈ ఛానెల్‌‌ను 2015లో మొదలుపెట్టారామె. ప్రస్తుతం ఈ ఛానెల్ తమిళంలోని టాప్10లో ఒకటిగా ఉంది. ఛానెల్‌‌కు 5.82 మిలియన్ల సబ్‌‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఈ ఛానెల్‌‌లో ఇప్పటివరకు 741 వీడియోలు అప్‌‌లోడ్‌‌ చేశారు. 
ఏంజెలా స్టెఫీ తమిళనాడులోని నాగర్‌‌కోయిల్‌‌లో పుట్టి పెరిగింది. ఊరికి దగ్గర్లోని తిరుచెంగోడ్‌‌లో ఉన్న ఒక రెసిడెన్షియల్‌‌ స్కూల్‌‌లో చదువుకునేందుకు అక్కడే హాస్టల్‌‌లో ఉండేది. ఇంటర్‌‌‌‌ వరకూ అక్కడే చదువుకుంది. అక్కడ ఉన్నన్ని రోజులు అమ్మ చేతి వంటను బాగా మిస్‌‌ అయ్యేది. 

ఇంజనీర్‌‌‌‌ కావాలనేది కల

ఇంటర్ పూర్తయ్యాక బీటెక్ చేయాలి అనుకుంది స్టెఫీ. ఇంజనీర్ కావాలనేది ఆమె కల. చెన్నయ్​లో ఒక హాస్టల్‌‌లో ఉంటూ ఇంజినీరింగ్‌‌పూర్తి చేసింది. అప్పుడు కూడా హాస్టల్ ఫుడ్ పెద్దగా నచ్చేది కాదు. చదువు పూర్తయ్యాక చెన్నయ్​లోని హెచ్‌‌సీఎల్‌‌ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. అక్కడ జాబ్ చేసిన రెండేండ్ల పాటు ఫ్రెండ్స్‌‌తో కలిసి రూమ్‌‌లో ఉండేది. ఆమెకు చిన్నప్పటినుంచే వంటలు చేయడమంటే చాలా ఇష్టం. అందువల్ల టైం దొరికినప్పుడల్లా కొత్త కొత్త వంటలు ట్రై చేసేది. ఆమె చేసిన వంటలు తిని ఫ్రెండ్స్‌‌ బాగా మెచ్చుకునేవాళ్లు.

పెండ్లి.. అమెరికా

వాస్తవానికి స్టెఫీకి అమ్మ చేతి వంట అంటే చాలా ఇష్టం. కానీ.. చిన్నప్పటినుంచి ఇంటికి దూరంగా ఉండడంతో ఆ ఫుడ్‌‌ ఎక్కువ రోజులు తినలేకపోయింది. అంతలోనే చదువు పూర్తవడం, ఉద్యోగం.. తర్వాత పెండ్లి జరిగిపోయాయి. భర్త అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. దాంతో అమ్మకు, ఆమె చేతి వంటకు దూరంగా అమెరికాకు వెళ్లాల్సి వచ్చింది. 

తాను పోగొట్టుకున్నది.. 

అమెరికా వెళ్లాక ఇంట్లో ఖాళీగా ఉండేది. జీవితంలో ఏమీ సాధించలేదనే ఆలోచన  ఆమెలో ఎప్పుడూ ఉండేది. అదే టైంలో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు... స్టెఫీకి ఒక ‌‌‌‌ఐడియా వచ్చింది. జీవితంలో తను పోగొట్టుకున్నది ఇతరులకు దగ్గర చేయాలనేదే ఆ ఆలోచన. స్టెఫీ చదువుకునే రోజుల్లో రుచికరమైన తిండి దొరక్క చాలా ఇబ్బంది పడింది. అలా ఇబ్బంది పడేవాళ్లకు మంచి రుచికరమైన భోజనం ఎలా వండుకోవాలో నేర్పించాలి అనుకుంది. అందుకోసం యూట్యూబ్ ఛానెల్‌‌ మొదలుపెట్టి, చాలా ఈజీ పద్ధతిలో వంట నేర్పే వీడియోలు చేసింది. చదువుకునే రోజుల్లో, ఉద్యోగం చేస్తున్నప్పుడు ప్రతి ఆదివారం ఇంటికి వెళ్లి అమ్మ దగ్గర నేర్చుకున్న వంట ఎక్స్‌‌పీరియెన్స్ ఇక్కడ ఆమెకు ఉపయోగపడింది.

ముందుగా ‘క్లాసిక్ మసాలా హట్’ అనే యూట్యూబ్ ఛానెల్‌‌ పెట్టింది. అందులో ఇంగ్లిష్​లో చేసిన వీడియోలు అప్‌‌లోడ్‌‌చేసేది. కానీ.. ఆ ఛానెల్‌‌కు అంత రీచ్ రాలేదు. సబ్‌‌స్క్రయిబర్స్ సంఖ్య చాలా మెల్లిగా పెరుగుతూ వచ్చింది. దాంతో ఇక లాభం లేదని మాతృభాష తమిళంలో వీడియోలు చేయాలని డిసైడ్‌‌ అయ్యింది. అందుకే మొదటి ఛానెల్‌‌ పెట్టిన నెల రోజుల్లోనే 2015 డిసెంబర్‌‌‌‌8న మద్రాస్‌‌ సమయల్‌‌ పేరుతో మరో ఛానెల్‌‌ పెట్టింది. మొదట్లో ఛానెల్‌‌కి పెద్దగా రెస్పాన్స్‌‌ రాలేదు. కానీ.. కాలం గడిచే కొద్దీ ఊహించని స్థాయిలో వ్యూస్ పెరిగాయి. సంవత్సరంలోనే లక్ష మంది సబ్‌‌స్క్రయిబ్ చేసుకున్నారు. అయినా.. తమిళం, ఇంగ్లిష్  రెండు ఛానెల్స్​లో వీడియోలు పోస్ట్ చేసింది. కానీ.. ఆరేండ్ల క్రితం ఇంగ్లిష్‌‌ ఛానెల్లో వీడియోలు అప్‌‌లోడ్‌‌ చేయడం ఆపేసింది. ఆ ఛానెల్‌‌కు ప్రస్తుతం 2.89 లక్షల సబ్‌‌స్క్రయిబర్స్‌‌ఉన్నారు. 

ప్రయత్నించాకే అప్‌‌లోడ్‌‌

స్టెఫీ సక్సెస్‌‌కు కారణం.. తన ఛానెల్‌‌లో ఏది పడితే అది అప్‌‌లోడ్‌‌ చేయదు. కచ్చితంగా బాగుంది అనుకుంటేనే రెసిపీ అప్‌‌లోడ్‌‌ చేస్తుంది. అందుకు ముందుగానే రెసిపీని రెండు సార్లు ట్రై చేస్తుంది. తిన్న తరువాత తనకు నచ్చితేనే వీడియో చేస్తుంది. ఒక వారంలో రెండు వీడియోలు రికార్డ్ చేస్తుంది. రెండు రోజులు షూటింగ్, రెండు రోజులు ఎడిటింగ్‌‌... అంటే నాలుగు రోజుల్లో పని పూర్తవుతుంది. 

ఎక్కడ నేర్చుకుంది? 

స్టెఫీ తల్లి, అత్త ఇద్దరూ వంట బాగా చేస్తారు. వాళ్ల దగ్గరే వంటలు చేయడం నేర్చుకుంది స్టెఫీ. కొన్ని వంటలు స్టెఫీకి తెలియకపోయినా వాళ్ల అమ్మ, అత్తను అడిగి తెలుసుకుని వీడియోలు చేస్తుంటుంది. స్టెఫీ భర్త కూడా ఆమెను బాగా ప్రోత్సహిస్తాడు.