యూట్యూబ్ సంచలనం​ ధృవ్ రాథీ​

యూట్యూబ్ సంచలనం​ ధృవ్ రాథీ​

యూట్యూబ్​లో సొంత ఛానెల్స్​ నడిపేవాళ్లలో ఎక్కువమంది ఎంటర్​టైన్​మెంట్​, వ్లాగ్స్​, ఎడ్యుకేషన్​, ఫ్యాషన్​, యాక్టింగ్​ లాంటి సబ్జెక్ట్స్​ఎంచుకుంటారు. కానీ.. ధృవ్​ రాఠీ మాత్రం అందుకు కాస్త డిఫరెంట్​. పాలిటిక్స్​, ఫిలాసఫీ, ఫ్యాక్ట్స్​పై వీడియోలు చేస్తున్నాడు. ఈ సబ్జెక్ట్స్​కి అంత రీచ్​ ఉండదని తెలిసినా వీడియోలు చేశాడు. కానీ.. జనాలు అతని వీడియోలు చూసేందుకు ఇష్టపడ్డారు. అందుకే యూట్యూబర్​గా బోల్డెంత సక్సెస్​ సాధించాడు. 

ధృవ్ రాథీ ఫేమస్​ యూట్యూబర్​. మెకానికల్ డిజైన్ ఇంజనీర్ కూడా. మన దేశంలో సోషల్​, పొలిటికల్​, ఎన్విరాన్​మెంట్ సమస్యలపై ఎనలైజ్​​ చేసి, ఆ విషయాలను యూట్యూబ్​లో తన ఛానెల్​ ద్వారా పంచుకుంటున్నాడు. ధృవ్ రాఠీ 1994 అక్టోబర్ 8న హర్యానాలో పుట్టాడు. వాళ్ల ఊరికి దగ్గరలో ఉన్న సీబీఎస్​ఈ స్కూల్​లో చదువుకున్నాడు. చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవాడు. జర్మనీలోని కార్ల్స్‌‌రూహ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్​ మెకానికల్ ఇంజినీరింగ్‌‌ చేశాడు.  తరువాత అక్కడే రెన్యువబుల్ ఎనర్జీ ఇంజినీరింగ్‌‌లో మాస్టర్స్ కూడా చేశాడు. చదువుకునేటప్పటి నుంచే సామాజిక సమస్యలు, పాలిటిక్స్​ మీద బాగా పట్టు ఉండేది. అందుకే పొలిటికల్​ సైన్స్​, పొలిటికల్​ ఫిలాసఫీ, ఎకనమిక్స్​ పుస్తకాలు చదివేవాడు. 

ఒకదాని తరువాత ఒకటి...

యూట్యూబ్​ ఛానెల్​ని 2013లో​ మొదలుపెట్టాడు. పేరు ‘‘ధృవ్​ రాఠీ’’. దీనికి 9.27 మిలియన్ల మంది సబ్​స్క్రయిబర్లు ఉన్నారు. ప్రస్తుతం ఆయన నడుపుతున్న రెండో ఛానెల్​ ‘‘ధృవ్ రాఠీ వ్లాగ్స్”. ఈ ఛానెల్​ను జులై 14, 2020న మొదలుపెట్టాడు. దీనికి 1.63 మిలియన్ల సబ్​స్క్రయిబర్స్​ ఉన్నారు. తన మొదటి ఛానెల్​లో, మొదటి వీడియోను 2014లో అప్​లోడ్​ చేశాడు. 2016లో యురి దాడి, 2016 నోట్ల రద్దు.. లాంటి అంశాల మీద వరుస వీడియోలు చేశాడు. వీటితోపాటు ఎకనమిక్స్​, ఎన్విరాన్​మెంట్, ఫిజిక్స్​, హిస్టరీ, సొసైటీ, ఫిలాసఫీ, బయోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, గ్రౌండ్ రిపోర్ట్‌‌ వంటి ఎన్నో విషయాలను కవర్​  చేస్తుంటాడు. ‘‘ధృవ్​ రాఠీ షార్ట్స్” అనే మరో ఛానెల్​ పెట్టి, షార్ట్​ వీడియోలు అప్​లోడ్​ చేస్తున్నాడు. ఆయన రెండో ఛానెల్​ ధృవ్ రాఠీ వ్లాగ్స్​లో ట్రావెల్ వ్లాగ్స్​ను అప్​లోడ్​ చేస్తున్నాడు. వీటితోపాటు నెట్​ఫ్లిక్స్​లో ‘‘డీ కోడ్​ విత్​ ధృవ్​’’, స్పోటిఫైతో ఒక స్పెషల్​ పాడ్‌‌కాస్ట్  కూడా చేశాడు. 

ఐ–ఫోన్​తో మొదలుపెట్టి...

ధృవ్​ వీడియోలు చేయడం మొదలుపెట్టిన కొత్తలో అంతగా వ్యూస్​ రాలేదు. మొదటి వీడియోకు కేవలం 50 వేల వ్యూస్​ మాత్రమే వచ్చాయి. మొదట్లో ధృవ్​ ట్రావెల్స్​, ఫొటోగ్రఫీకి సంబంధించిన వీడియోలు కూడా చేసేవాడు. ఆ తర్వాత నుంచి పూర్తిగా సీరియస్​ అంశాలపైనే చేయడం మొదలుపెట్టాడు. అప్పటినుంచి వీడియోలకు వ్యూస్​ బాగా పెరిగాయి. దాంతో తక్కువ టైంలోనే ఇండియాలోనే టాప్​ యూట్యూబర్​గా మారాడు.  మొదట్లో ఐ–ఫోన్​తోనే వీడియోలు తీశాడు ధృవ్​.

పరువు నష్టం కేసు 

సెంట్రల్​ గవర్నమెంట్​కు వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నాడని 2018 మేలో వికాస్​ పాండే అనే సాఫ్ట్​వేర్​ ఇంజినీర్ ధృవ్​ మీద పోలీస్​ కేసు పెట్టాడు. 15 లక్షల రూపాయలకు పరువు నష్టం దావా వేశాడు. తన మీద కేసు పెట్టిన వికాస్​ మీద కూడా వీడియో చేశాడు. 2019 మార్చిలో ధృవ్​ ఫేస్​బుక్​ కూడా కొన్నాళ్లపాటు బ్లాక్​ అయింది. అంతేకాదు.. ధృవ్​ ఛానెల్ పెట్టినప్పటినుంచీ రాజకీయాలపై మాట్లాడుతూనే ఉన్నాడు. సోషల్ మీడియా యాక్టివిస్ట్​గా పనిచేస్తున్నాడు. అప్పటినుంచి అతని మీద ఎన్నో వివాదాలు వచ్చాయి. జనాలు కొన్నిసార్లు పాజిటివ్​గా, మరికొన్ని సార్లు నెగెటివ్​గా రియాక్ట్​ అయ్యారు. కానీ.. ధృవ్​ అవేవీ పట్టించుకోకుండా వీడియోలు చేస్తూనే ఉన్నాడు.  

నెట్​వర్త్​

ధృవ్ రాఠీ ఆస్తి 2022 నాటికి సుమారు 41 కోట్ల రూపాయలు. ఇతర ఆదాయ మార్గాలు​ ఉన్నా..  యూట్యూబ్​ ద్వారానే ఎక్కువ సంపాదిస్తున్నాడు. మూడు ఛానెల్స్​ నుంచి ధృవ్​కి నెలకు 30 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. అంతేకాకుండా బ్రాండ్ ప్రమోషన్లు, కొలాబరేషన్స్​, ఇన్‌‌స్టాగ్రామ్ నుంచి కూడా డబ్బు వస్తోంది. 

రీసెర్చ్​ చేశాకే.. 

ధృవ్​ చేసే ప్రతి వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్​ ఉంటుంది. కొన్ని వీడియోల కోసం ఎంతో బ్యాక్​గ్రౌండ్​ వర్క్​ చేస్తుంటాడు. అందుకే వీడియోలకు మిలియన్లలో వ్యూస్​ వస్తుంటాయి. ఇతను సెలక్ట్​ చేసుకునే సబ్జెక్ట్స్​ ఎంత కాంప్లికేటెడ్​గా ఉంటాయో, వాటి గురించి వివరించే విధానం అంత సింపుల్​గా ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని ఎక్స్​ప్లెయిన్​ చేస్తాడు. అందరికీ అర్థమయ్యే హిందీలో చెప్తాడు. హిందీ పెద్దగా తెలియని వాళ్లకు కూడా వీడియో సారాంశం అర్థమై పోతుంది. ఒక సంఘటన జరిగిందంటే.. దాని వెనక ఏం జరిగిందో తెలుసుకుని, తర్వాత ఏం జరుగుతుందో అంచనా వేసుకుని విశ్లేషిస్తాడు.