యూట్యూబ్ పెద్దవాళ్లకే కాదు.. పిల్లలకూ ఎంతో నచ్చే యాప్. అల్లరి చేసే పిల్లల్ని సైలైంట్‌గా ఉంచాలన్నా, తినిపించాలన్నా, నిద్రపుచ్చాలన్నా ఎక్కువమంది తల్లిదండ్రులు యూట్యూబ్ మీదే ఆధారపడుతున్నారు. అలాగే ఖాళీగా ఉన్న టైంలో యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు పెద్దలు. ఇలా వయోభేదం లేకుండా యూట్యూబ్‌ను అందరూ వాడేస్తున్నారు. రీల్స్ వచ్చినప్పటి నుంచి దీని వాడకం మరీ ఎక్కువైపోయింది. కానీ, ఒక్కసారి యూట్యూబ్ చూడడం మొదలుపెడితే గంటల తరబడి చూస్తూ ఉండిపోతున్నారు. ఈ అలవాటు రకరకాల సమస్యలు తెచ్చి పెడుతోంది. ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటి? యూట్యూబ్ చూసే సమయాన్ని రిస్ట్రిక్ట్ చేయడమే!
అందుకు ‘స్లీప్ టైమర్’ పేరుతో ఒక కొత్త ఫీచర్ తేబోతుంది యూట్యూబ్. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫీచర్ వచ్చిన తరువాత యూజర్లు య్యూటూబ్ వీడియోలో స్లీప్ టైమర్ సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ సాయంతో స్క్రీన్ టైం తగ్గించుకోవచ్చు. ఒకవేళ వీడియో చూస్తున్నప్పుడు యూట్యూబ్ అప్లికేషన్‌ను క్లోజ్ చేయకుండా అలాగే నిద్రపోతే ముందుగా సెట్ చేసుకున్న టైమ్‌కి వీడియో దానంతటదే ఆగిపోయేలా సెట్ చేశారు. అలా స్మార్ట్ ఫోన్ వాడే సమయాన్ని తగ్గించొచ్చన్నమాట!
టైమర్ సెట్టింగ్‌లో10 నిమిషాల నుంచి 15, 20 , 30, 45, 60 నిమిషాల ప్లేబ్యాక్ పాజ్ ఆప్షన్ కూడా రానుంది. టెస్టింగ్‌లో భాగంగా ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ను త్వరలోనే మిగతా యూజర్లకు కూడా వాడే ఆప్షన్ తెస్తారట. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలంటే.. యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసి, వీడియో ప్లే అయ్యేటప్పుడు సెట్టింగ్స్ లో టైమర్ సెట్ చేసుకోవాలి. ఈ ఫీచర్‌ను యాక్సెస్ చేయాలంటే యాప్‌లో సైన్ ఇన్ అయి ఉండాలి.
చెమటతో ఛార్జింగ్..!?
ఫోన్ ఉంటే సరిపోదు.. దానికి ఛార్జింగ్ ఉండాలి. అందుకనే బయటకు అడుగుపెట్టాలంటే చాలు ఛార్జర్ వెంటే పట్టుకెళ్లాలి. కొందరేమో పవర్ బ్యాంక్‌లు వాడుతుంటారు. ఈ ఛార్జింగ్ సమస్యకు చెక్ పెట్టేందుకు మన చేతి వేళ్లతో ఛార్జింగ్ చేసేలా ఒక గాడ్జెట్ తయారు చేశారు. కాలిఫోర్నియాకు చెందిన రీసెర్చర్స్ చెమట నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే డివైజ్ డిజైన్ చేశారు. నిద్రపోయేటప్పుడు ఈ గాడ్జెట్‌ను చేతికి పెట్టుకుంటే అది చెమట నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని చెప్తున్నారు వాళ్లు.
ఈ ఎలక్ట్రిసిటీ సాయంతో స్మార్ట్ ఫోన్లతో పాటు, స్మార్ట్ వాచ్‌లు కూడా ఛార్జ్ చేసేయొచ్చు. పది గంటలపాటు డివైజ్ పెట్టుకుంటే 24 గంటలపాటు ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చట. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉంది. కాబట్టి మూడు వారాలు చేతి వేళ్లకు పెట్టుకోవాలి. అప్పుడే ఛార్జింగ్ చేయగలరు. ముందుముందు దీని కెపాసిటీని మరింత పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
చిన్న చిప్ సైజ్‌లో ఉండే ఈ డివైజ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోకపోతే ఎలా? ఈ డివైజ్‌ను మొదట వేళ్లకు ప్లాస్టర్‌లా చుట్టుకోవాలి. ఇందులోని కార్బన్ ఫోమ్ ఎలక్ట్రోడ్ల పాడింగ్ చెమటను గ్రహిస్తుంది. అది చెమటను కరెంట్‌గా మారుస్తుంది. వేళ్ల నుంచి వచ్చే చెమటతో తడిసినప్పుడు స్ట్రిప్ పై ఒత్తిడి పడుతుంది. అది విద్యుత్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ డివైజ్‌ను పూర్తిగా డెవలప్ చేశాక మార్కెట్లోకి తెస్తాం అంటున్నారు. ఇదేదో బాగుంది. ఎంత త్వరగా వస్తే అంత మేలు అనిపిస్తుంది కదా!
ఒకేసారి ఇరవై ఫొటోలు
ఇన్‌స్టాలో ఏదైనా ఈవెంట్‌కి సంబంధించి ఫొటోలు షేర్ చేయాలంటే చాలా ఫొటోలు పెట్టాలనిపిస్తుంది. కానీ, అన్ని ఫొటోలు పోస్ట్ చేసే అవకాశం లేదు. అందుకని చాలామంది కొన్ని కొన్ని ఫొటోలను రెండు, మూడు సార్లు పోస్ట్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఒక సందర్భానికి సంబంధించిన పోస్ట్‌లను ఒక్కసారి చూసిన ఫాలోవర్లు మళ్లీ చూడాలనుకోరు. అందుకే ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్ తెచ్చింది.
అదేంటంటే... ఒక పోస్ట్‌లో 20 మీడియా ఫైల్స్ షేర్ చేసుకునే వీలు కల్పిస్తోంది ఇన్స్టాగ్రామ్. గతంలో ఒక పోస్ట్‌కు10 ఫైల్స్ లిమిట్ ఉండేది. ఆ సంఖ్యను ఇప్పుడు డబుల్ చేసింది. యూజర్లు తమ మెమొరీస్, క్రియేటివిటీ లేదా రోజువారీ పనులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పంపుకోవచ్చు.
ఇన్స్టాగ్రామ్ 2015లో ‘కరోజల్’ ఫీచర్ తెచ్చింది. అందులో 5 ఇమేజ్‌లు షేర్ చేసే లిమిట్ ఉంది. 2017నాటికి అది పది వీడియోలకు పెంచింది. ఈ ఏడాది మార్చిలో15 ఫొటో ఫ్రేమ్స్‌కు అనుమతి కల్పించింది.
ఇప్పుడు 20కు పెంచింది. దీంతో మల్టిపుల్ పోస్ట్‌లు పెట్టకుండా ఒకే కరోజల్లో 20 ఫొటోల వరకు అప్లోడ్ చేయొచ్చు. అప్పుడు ఫాలోవర్లు రెండు మూడు పోస్ట్‌లు చూడాల్సిన అవసరం లేకుండా ఒక్క పోస్ట్‌లోనే చూసేయొచ్చు. ఛాన్స్ దొరికింది కదా అని అన్నేసి ఫొటోలు పెడుతుంటే.. ఫాలోవర్లకు విసుగ్గా అనిపించొచ్చు. అప్పుడు మీ అకౌంట్ అప్డేట్ మ్యూట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి సందర్భాన్ని బట్టి ఎన్ని ఫొటోలు లేదా వీడియోలు పెట్టాలో డిసైడ్ చేసుకుని అప్లోడ్ చేయడం బెటర్.