యూట్యూబర్​ : క్యాంపింగ్ టూరిస్ట్

యూట్యూబర్​ : క్యాంపింగ్ టూరిస్ట్

ఓజ్గర్ అతిక్‌‌, అతని భార్య, ఇద్దరు పిల్లలు.. ఓ చిన్న ఫ్యామిలీ. అంతా కలిసి వారానికోసారి వ్యాన్‌‌లో ట్రావెల్‌‌ చేస్తుంటారు. దట్టమైన అడవులు, మంచు ఎడారులు, నదీ తీరాలు.. ఇలా ఎక్కడ అందమైన, ఆహ్లాదకరమైన ప్లేస్ కనబడితే.. అక్కడే ఒక టెంట్‌‌ వేసుకుని ఉంటారు. అక్కడి వాతావరణం, వాళ్ల అనుభవాలను వీడియోలు తీసి యూట్యూబ్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేస్తుంటారు. ఇదే వాళ్ల జీవితం.. ఇదే వాళ్లకు ప్రత్యేక గుర్తింపుని తెచ్చిపెట్టింది. 

టర్కీకి చెందిన అతిక్‌‌ ఫ్యామిలీ కొన్నేండ్ల నుంచి ట్రావెలింగ్ చేస్తోంది. టర్కీ అంతటా తిరుగుతూ.. అందమైన ప్రదేశాల్లో క్యాంపింగ్ చేసి, ఆ ఎక్స్‌‌పీరియెన్స్‌‌ని వీడియో తీసి యూట్యూబ్‌‌లో పంచుకుంటుంటారు. పర్వతాల నుండి బీచ్‌‌ల వరకు, అడవుల నుండి సరస్సుల వరకు.. ఏ ప్లేస్‌‌ని వదిలిపెట్టకుండా ఎక్స్‌‌ప్లోర్‌‌‌‌ చేస్తుంటారు. హైకింగ్, ఫిషింగ్, బోటింగ్, క్యాంప్‌‌ ఫైర్‌‌‌‌.. లాంటి వాటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటివి చేస్తూ.. ప్రకృతితో కనెక్ట్ అవ్వడమే వాళ్ల లక్ష్యం అంటున్నారు. 

ఓజ్గర్‌‌‌‌ అతిక్‌‌

ఓజ్గర్‌‌‌‌ అతిక్‌‌1975లో పుట్టాడు. అతని వృత్తి ‘ప్లంబింగ్’. కానీ.. ఇప్పుడు ఆ పనికి తక్కువ టైం కేటాయిస్తున్నాడు. ఎక్కువ టైం యూట్యూబ్‌‌తోనే సరిపోతోంది. భవిష్యత్తులో క్యాంపింగ్‌‌నే వృత్తిగా మార్చుకోవాలి  అనుకుంటున్నట్లు ఓజ్గర్ అతిక్ చెప్తున్నాడు. అందుకు తన భార్య బుర్కో అతిక్‌‌ని కూడా ఒప్పించాడు. ఆ తర్వాతే యూట్యూబ్‌‌ మొదలుపెట్టాడు. అందులో ముఖ్యంగా క్యాంపింగ్ లైఫ్‌‌స్టయిల్‌‌ని బాగా చూపిస్తున్నారు. టెంట్లు వేయడంతో పాటు అవుట్‌‌డోర్‌‌‌‌లో ఎదురయ్యే సమస్యలు.. వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తుంటారు.

అంతేకాదు.. వాళ్లు ఎక్కడికి వెళ్లినా అక్కడి సంస్కృతులను ఎక్స్‌‌ప్లోర్‌‌‌‌ చేస్తుంటారు. అక్కడి లోకల్స్​తో కలిసిపోయి మాట్లాడతారు. రుచికరమైన ప్రాంతీయ వంటకాల గురించి తెలుసుకుంటారు. వాటి రివ్యూ చేస్తుంటారు. వాళ్లు చేసే ప్రతి క్యాంపింగ్ ట్రిప్... వ్యూయర్స్‌‌కి కొత్త అనుభూతిని ఇస్తుంది. ఒక్కోసారి ఒక్కోరకమైన టెంట్ వేస్తుండడంతో ప్రతి వీడియో కొత్తగా కనిపిస్తుంది.  

యూట్యూబ్‌‌లోకి.. 

ఓజ్గర్‌‌‌‌ అతిక్‌‌ 2018 జూన్‌‌ 15న ‘అతిక్‌‌ ఫ్యామిలీ’ పేరుతో యూట్యూబ్‌‌ ఛానెల్‌‌ పెట్టాడు. అప్పటినుంచి క్యాంపింగ్‌‌ వీడియోలే అప్‌‌లోడ్‌‌ చేస్తున్నాడు. ఛానెల్‌‌లో ఇప్పటివరకు 222 వీడియోలు అప్‌‌లోడ్‌‌ చేశాడు. వాటిలో10 మిలియన్ల వ్యూస్‌‌ దాటిన వీడియోలు కూడా ఉన్నాయి. ఇక షార్ట్ వీడియోల విషయానికి వస్తే.. ఒక వీడియోకు ఏకంగా 38 మిలియన్ల వ్యూస్‌‌ వచ్చాయి. వీడియోల్లో వాళ్లు చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. వాళ్లు చేసే పని ద్వారానే విషయాన్ని కమ్యూనికేట్‌‌ చేస్తుంటారు. ఇది కూడా ఈ ఛానెల్‌‌ సక్సెస్‌‌కు కారణమైంది.

ప్రస్తుతం ఈ ఛానెల్‌‌కు 2.57 మిలియన్ల సబ్‌‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఇందులో వారానికో వీడియో అప్‌‌లోడ్‌‌ చేస్తున్నారు. అయితే.. వీడియోల్లో వాళ్ల పిల్లలు చాలా తక్కువగా కనిపిస్తుంటారు.  ఈ మధ్య కాలంలో టర్కీతోపాటు బ్రెజిల్, పోర్చుగల్ దేశాల్లో కూడా ఎక్స్‌‌ప్లోర్‌‌‌‌ చేస్తున్నారు. 

ఎడిటింగ్‌‌.. 

క్యాంపింగ్‌‌ టెంట్‌‌ వేయడంలో ఓజ్గర్‌‌‌‌ ఎక్స్‌‌పర్ట్స్‌‌. అయితే... అతని భార్య బుర్కో వీడియోలు తీయడం, ఎడిటింగ్‌‌ చేయడంలో ఎక్స్‌‌పర్ట్. వీళ్ల ఛానెల్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేసే అన్ని వీడియోలు ఆమే ఎడిట్‌‌ చేస్తుంటుంది. యూట్యూబ్‌‌లోకి రాకముందు కూడా వీడియో ఎడిటర్‌‌‌‌గా పనిచేసిందామె. 

కరోనాలో వైరల్‌‌

అతిక్ ఫ్యామిలీ ఛానెల్‌‌లో 2018 నుంచే వీడియోలు అప్‌‌లోడ్‌‌ చేస్తున్నా.. అవి జనాలకు ఎక్కువగా చేరింది మాత్రం కరోనా టైంలోనే. లాక్‌‌డౌన్ టైంలో చాలామంది ఇండ్లకే పరిమితమయ్యారు. అందుకే డిజిటల్‌‌ కంటెంట్‌‌కి వ్యూయర్‌‌‌‌షిప్‌‌ పెరిగింది. ఆ టైంలోనే వీళ్ల ఛానెల్‌‌ గ్రోత్‌‌ మొదలైంది. వీడియోలో ఎక్కువగా ప్రకృతి దృశ్యాలు కనిపిస్తుండటంతో ఎక్కువ వ్యూస్‌‌ వచ్చాయి. పైగా బుర్కో చేసే వంటకు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సంప్రదాయ టర్కీ వంటకాలను ప్రపంచానికి పరిచయం చేస్తుంటుంది. ఈ ఛానెల్‌‌ వీడియోల్లో భాష అర్థం కాకపోయినా.. దక్షిణ అమెరికా దేశాల నుండి చాలామంది చూస్తున్నారు. 

ప్రకృతికి హాని చేయరు

అతిక్ ఫ్యామిలీ ఎక్కడ క్యాంపింగ్‌‌ చేసినా అక్కడి చెట్లకు హాని చేయడం కానీ, నీళ్లను కలుషితం చేయడం వంటి పనులు చేయరు. అక్కడి వనరులను జాగ్రత్తగా వాడుకుంటారు. ప్రకృతి మీద గౌవరం, భక్తి ఉండడం వల్లే  పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగస్వాములు అవుతున్నారు. వీడియోల్లో ఎప్పుడూ క్యాంపింగ్ చేసేటప్పుడు రెస్పాన్సిబిల్​గా ఎలా ఉండాలనే విషయాల గురించే మాట్లాడుతుంటారు.