ఏ గురువు దగ్గరా డాన్స్ నేర్చుకోలేదు. వాళ్ల ఫ్యామిలీలో కూడా డాన్సర్లు లేరు. కానీ.. ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి విగ్రహం పెట్టుకుని విద్య నేర్చుకున్నట్టు, బాబా జాక్సన్ టీవీని ఎదురుగా పెట్టుకుని డాన్స్ నేర్చుకున్నాడు. అతను డాన్స్ చేస్తే... అచ్చం మైఖేల్ జాక్సన్ డాన్స్ చేసినట్టే ఉంటుందని చాలామంది చెప్తుంటారు. అంతెందుకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, రవీనా టాండన్ లాంటివాళ్లు కూడా అతని డాన్స్‌ని మెచ్చుకున్నారు.
ఇంటర్నెట్ సెన్సేషన్ బాబా జాక్సన్ అసలు పేరు యువరాజ్ సింగ్. రాజస్తాన్, జోధ్‌పూర్‌లో 2002లో పుట్టాడు. ప్రైమరీ ఎడ్యుకేషన్ జోధ్‌పూర్‌లోనే సాగింది. అతన్ని కొందరు ‘దేశీ జాక్సన్’ అని పిలుస్తారు. ఇంకొందరేమో అతని యూట్యూబ్ ఛానెల్ ‘బాబా జాక్సన్’ పేరుతో పిలుస్తారు. యువరాజ్ తల్లిదండ్రులు అతన్ని బాగా చదివించి ఇంజినీర్ చేయాలని కలలు కన్నారు. కానీ, యువరాజ్ మాత్రం డాన్సర్ కావాలని కలలు కన్నాడు.
డాన్స్‌పై ఇష్టం
యువరాజ్‌కి డాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే చిన్నప్పటినుంచి పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ డాన్స్ ప్రోగ్రామ్స్, ఇండియన్ డాన్స్ రియాలిటీ షోలు ఎక్కువగా చూసేవాడు. మైఖేల్ జాక్సన్‌కి వీరాభిమాని. అందుకే ఎక్కువగా అతని స్టైల్‌లోనే డాన్స్ చేస్తుంటాడు. యువరాజ్ డాన్స్ చూస్తే.. మైఖేల్ జాక్సన్ డాన్స్ చూసినట్టు ఉంటుందని చాలామంది చెప్తుంటారు. యువరాజ్ చాలా రోజుల కిందటే తను డాన్స్ చేసిన వీడియోలను టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఆ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అలా అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్ లాంటివాళ్ల వరకు చేరాయి. యువరాజ్ డాన్స్‌ని మెచ్చిన వాళ్లు కూడా అతని వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాళ్లతోపాటు చాలామంది బాలీవుడ్ ప్రముఖులు అభినందించారు.
ఎక్కడా నేర్చుకోలేదు
ఇతగాడి డాన్స్ చూస్తే.. పెద్ద డాన్స్ మాస్టర్ దగ్గర నేర్చుకున్నాడేమో అనుకుంటారు. కానీ.. అతనికి అసలు గురువే లేడు. సినిమాలు చూస్తూ డాన్స్ స్టెప్స్ నేర్చుకున్నాడు. స్టెప్స్ ఎలా వేస్తున్నాడో చూసుకోవడానికి అతని దగ్గర కనీసం పెద్ద అద్దాలు కూడా లేవు. అందుకే నీడను చూస్తూ... డాన్స్ చేసేవాడు. సరిగా రాని స్టెప్స్‌ని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేసి నేర్చుకునేవాడు.
స్నూప్ డాగ్ షేర్
యువరాజ్ సింగ్ చేసిన ఒక డాన్స్ వీడియోను అమెరికన్ ర్యాపర్ ‘స్నూప్ డాగ్’ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియోలో యువరాజ్ ‘గెలాక్సీ వాక్’ చేశాడు. అది మైఖేల్ జాక్సన్ ఐకానిక్ ‘మూన్‌వాక్’తో ఇన్‌స్పైర్ అయ్యి చేసిన స్టెప్. ఆ స్టెప్ బాగా నచ్చడంతో స్నూప్ డాగ్ డిసెంబర్ 2023లో ఆ వీడియో పోస్ట్ చేశాడు. అతని డాన్స్‌ని “మూన్ హాప్” అని ప్రస్తావించాడు. స్నూప్ ఫాలోవర్స్‌తోపాటు అర్జున్ కనుంగో, టాంజానియా కంటెంట్ కిలి పాల్, పవిత్రా పునియా లాంటి ప్రముఖులు యువరాజ్‌ని మెచ్చుకున్నారు. 2020లో అతను ‘‘ఇండియాస్ బెస్ట్ డాన్సర్’’ అనే రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేశాడు. బెస్ట్ పర్ఫార్మెన్స్‌లు ఇచ్చి టాప్‌లో నిలిచాడు. బెస్ట్ ఎంటర్‌టైనర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.
యూట్యూబ్‌లోకి...
యువరాజ్ ‘బాబా జాక్సన్’ పేరుతో 2020 ఏప్రిల్ 11న యూట్యూబ్ ఛానెల్ పెట్టాడు. ఆ తర్వాత ‘‘బాబా జాక్సన్ డాన్స్ ఆన్ స్కెచర్స్ సాంగ్” పేరుతో మొదటి వీడియోను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఛానెల్‌లో డాన్స్ వీడియోలతోపాటు వ్లాగ్స్ కూడా అప్‌లోడ్ చేస్తున్నాడు. ఇప్పటివరకు ఛానెల్‌లో 725 వీడియోలు అప్‌లోడ్ చేశాడు. ఇందులో షార్ట్ వీడియోలు కూడా చాలానే ఉన్నాయి. అతను చేసిన ఒక షార్ట్ వీడియోకు పది కోట్ల(108 మిలియన్లు)కు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక పది మిలియన్ల వ్యూస్ దాటిన వీడియోలు ఛానెల్‌లో బోలెడు కనిపిస్తాయి.