![యూట్యూబర్ : డేల్ ఫిలిప్ మన దేశంలో](https://static.v6velugu.com/uploads/2023/07/YouTuber-Dale-Philip-in-our-country_Nco7Ubhxg6.jpg)
మన దేశ సంస్కృతి, చారిత్రక కట్టడాలను చూసేందుకు ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుంచి టూరిస్ట్‌లు వస్తుంటారు. అలా వచ్చి.. మన కల్చర్‌ని మనవాళ్లకే చూపించాడు స్కాటిష్ స్టార్ పోకర్ ప్లేయర్, యూట్యూబర్ డేల్ ఫిలిప్.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు తిరిగిన అనుభవం ఫిలిప్‌కు ఉంది. స్కాట్‌ల్యాండ్‌కు చెందిన ఫిలిప్ ఫేమస్ పోకర్ ప్లేయర్, సోషల్ మీడియా సెలబ్రిటీ కూడా. దాదాపు ఆరేండ్లక్రితం నుంచి ట్రావెలింగ్ చేస్తున్నాడు. ఇప్పటివరకు ఇండియాకు మూడుసార్లు వచ్చాడు!
తను వెళ్లిన ప్రతి దేశంలో అక్కడి ఆహారపు అలవాట్లు, పరిస్థితులు, కట్టడాలు, ప్రత్యేకతలను వీడియో తీసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుంటాడు. అలాగే ఇండియా వచ్చినప్పుడు కూడా వీడియోలు తీశాడు. ఆ వీడియోలను తన దేశస్తులతోపాటు ఇండియన్స్ కూడా చాలామంది చూశారు. డేల్ యూట్యూబ్ ఛానెల్లో చాలా షార్ట్ వీడియోలకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి.
స్కామర్ల నుంచి
ప్రపంచంలోని ప్రసిద్ధ నగరాలకు వెళ్లి, అక్కడ ఎలా ఉండాలి? ఏం చూడొచ్చు? ఏ ఫుడ్ టేస్ట్‌గా ఉంటుందనేది వ్లాగ్స్ ద్వారా చూపిస్తాడు. అంతేకాదు.. ఎవరైనా అక్కడికి వెళ్తే.. స్కామర్ల నుంచి ఎలా తప్పించుకోవాలి? అనేది కూడా చెప్తాడు. టూరిస్ట్‌లకు చిట్కాలు కూడా చెప్తుంటాడు. సలహాలు ఇస్తుంటాడు. ఈ మధ్య ఇండియా, పాకిస్తాన్ దేశాల్లో ట్రావెల్ చేశాడు. అప్పుడు స్కామర్లకు సంబంధించిన ఇన్సిడెంట్స్ వీడియోలుగా తీసి పోస్ట్ చేశాడు.
చిన్నప్పటి నుంచీ ఇష్టం
స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బరోలో పుట్టి పెరిగాడు ఫిలిప్. అతను ఇప్పటివరకు ఇండియాతోపాటు థాయ్‌లాండ్, జపాన్ లాంటి అనేక దేశాలు ట్రావెల్ చేశాడు. ఆ ట్రావెలింగ్ వీడియోలను యూట్యూబ్ ప్లాట్ఫామ్లో షేర్ చేసుకుంటున్నాడు. ఫిలిప్‌కు చిన్నప్పటి నుండి ట్రావెలింగ్ చేయడమంటే ఇష్టం. అందుకే పోకర్ ప్లేయర్‌గా రాణిస్తూనే ట్రావెలింగ్ మొదలుపెట్టాడు. తన కెరీర్‌లో ఎన్నో పోకర్ టోర్నమెంట్లను గెలిచాడు. తర్వాత యూట్యూబ్‌లో అడుగుపెట్టాడు. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఇతనికి 2.26 మిలియన్ల సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు.
వైరల్ వీడియోలు
డేల్ ఫిలిప్ చేసిన వీడియోల్లో కొన్ని చాలా వైరల్ అయ్యాయి. వాటిలో చిన్న చిన్న స్కామ్స్, ఫారెనర్స్‌కి ఎక్కువ ధరకు వస్తువులు అమ్మడం లాంటివి చూపించాడు. ఫిలిప్ ఇండియాకు వచ్చినప్పుడు జైపూర్ వెళ్లాడు. అక్కడ వీధి వ్యాపారి స్థానికంగా దొరికే లోబ్లాచి అనే స్వీట్ అమ్ముతున్నాడు. ఆ వ్యాపారిని ‘లోబ్లాచి స్వీట్ ఒకదాని రేటు ఎంత’ అని అడిగాడు ఫిలిప్. ‘రెండూ కలిపి100 రూపాయలు’ అని చెప్పాడు అతను.
ఆ వ్యాపారి రేటు ఎక్కువగా చెప్పడంతో ఫిలిప్ షాక్ అయ్యాడు. అతనితో బేరమాడి చివరికి పది రూపాయలకు ఒక స్వీట్ కొన్నాడు. కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలంటాడు ఫిలిప్. ఈ వీడియో ఇంటర్నెట్లో బాగా వైరల్ అయింది. కొన్ని మిలియన్ల మంది చూశారు. రెండు మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. కొందరు నెటిజన్లు ఆ స్వీట్ ధర 50 రూపాయలు అయ్యి ఉండొచ్చు. ఫిలిప్ దగ్గర డబ్బులు లేవనుకుని పది రూపాయలకు ఇచ్చి ఉండొచ్చు అన్నారు.
నెగెటివిటీ..
పాకిస్తాన్‌కి వెళ్లినప్పుడు తనకు ఎదురైన మోసాన్ని అంతటినీ వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టాడు ఫిలిప్. కరాచీ బీచ్ నుంచి చంకీ మంకీ పార్క్‌కి వెళ్లి, వచ్చేందుకు 200 రూపాయలకు గుర్రం మాట్లాడుకుంటాడు. కానీ.. స్వారీ ముగిశాక 5 వేల రూపాయలు డిమాండ్ చేస్తాడు ఆ రౌతు. అందుకు ఫిలిప్ నిరాకరించి వెయ్యి రూపాయలు ఇచ్చాడు. అయినా అతను వినిపించుకోకుండా ఫిలిప్ వెంటపడతాడు. ఆ గొడవంతా వీడియో తీసి, పోస్ట్ చేశాడు ఫిలిప్. తర్వాత తనను మోసగించినందుకు ముగ్గురు గుర్రపు రౌతులను బీచ్‌లో అరెస్టు చేశారని ట్వీట్ చేశాడు. ఫిలిప్ చేసిన ట్వీట్లో
‘‘ప్రజలను మోసం చేసి ఉపాధి పొందుతున్నాడు. కానీ, ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాడు. కరాచీ పోలీసులకు థ్యాంక్స్” అని రాసి ఒక వ్యక్తి జైలులో ఉన్న ఫొటో ట్వీట్ చేశాడు. ఆ పోస్ట్ చూసిన పాకిస్థానీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం మీద పాకిస్తానీ కమెడియన్, హోస్ట్ షెహజాద్ గియాస్ షేక్ ట్వీట్ చేస్తూ “అతను మిమ్మల్ని 20 డాలర్ల విషయంలో మోసగించే ప్రయత్నం చేశాడు. మీరు అతని ముఖాన్ని వాడుకుని యూట్యూబ్ నుండి 4,000 డాలర్లు సంపాదించడం కోసం వీడియో తీశారు. అతన్ని దోపిడీ చేశారు. ఇంతకీ అసలు మోసగాడు ఎవరు?’’ అని ట్వీట్ చేశాడు.