యూట్యూబర్​ : ప్రతి వీడియో కనుల విందే :​ ఫిరోజ్

యూట్యూబర్​ : ప్రతి వీడియో కనుల విందే :​ ఫిరోజ్

ఫుడ్​కి సంబంధించిన ఛానెల్స్ ఎన్ని ఉన్నా వాటిని చూసే వ్యూయర్స్ మాత్రం తగ్గరు. అందుకే యూట్యూబ్​లో ఇప్పటికే ఎన్నో కుకింగ్ ఛానెల్స్ ఉన్నా.. కొత్తవి వస్తూనే ఉంటాయి. అందులో ఇంట్లో అమ్మలు, అమ్మమ్మలు చేసే వంటల నుంచి రెస్టారెంట్​ స్టైల్​లో చేసే ప్రొఫెషనల్ చెఫ్​లు కూడా ఉన్నారు. అలా ఫుడ్​ మీద ప్యాషన్​తో మొదలుపెట్టిన వాళ్లంతా సక్సెస్ అవుతున్నారు. వాళ్లలో ఒకరే ‘విలేజ్ ఫుడ్​ వీడియో’ ఛానెల్​ రన్ చేస్తున్న యూట్యూబర్​ ఫిరోజ్.

కేరళలోని పాలక్కాడ్​కి చెందిన ఫిరోజ్​.. 2007లో ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ వెల్డర్​గా పనిచేశాడు. బిజినెస్​ చేయాలనే ఆలోచనతో 2012లో తిరిగి ఇండియా వచ్చాడు. సొంతూరిలోనే ఫొటోస్టాట్ షాప్ పెట్టాడు. కానీ అది వర్కవుట్ కాలేదు. ఎందుకంటే ఆ షాప్​ ద్వారా వచ్చే ఆదాయం తక్కువ. దాంతో ఏడాదిన్నరకే ఆ షాప్ మూతపడింది. సౌదీ అరేబియాలో కెరీర్​ స్టార్ట్​ చేసిన ఫిరోజ్​ చుట్టిపర తనలో కుకింగ్ టాలెంట్​ ఉందని ఎప్పుడూ గుర్తించలేదు. 

విదేశంలో స్థిరపడిన తను రెగ్యులర్​ హోటల్​ ఫుడ్​ నుంచి కొంచెం డిఫరెంట్​గా ఏదైనా ఉంటే బాగుండు అని కోరుకునేవాడు. అలా ‘ఒకసారి ట్రై చేద్దాం’ అని కుకింగ్​ స్టార్ట్ చేశాడు. ఇంట్లోనే వాళ్లమ్మ చెప్పిన విధంగా అక్కడ వంటలు చేయడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత తనకు కుకింగ్​ అంటే ఇంట్రెస్ట్ అని రియలైజ్​ అయ్యాడు. కానీ, తిరిగి తన సొంతూరికి వచ్చాక ఈ ఇంట్రెస్ట్​ని కెరీర్​గా మలుచుకుంటాడని మాత్రం ఎప్పుడూ ఊహించలేదు. వండడం, వడ్డించడంలో తనకున్న నేర్పు.. యూట్యూబ్​ దిశగా నడిపించింది.

బెస్ట్​ ఫుడ్ వ్లాగర్​

ప్రస్తుతం ‘విలేజ్​ ఫుడ్ ఛానెల్​’కి 8.66 మిలియన్ సబ్​ స్క్రయిబర్లు ఉన్నారు. ఇప్పటివరకు ఇందులో 475కి పైగా వీడియోలు అప్​లోడ్ చేశాడు. తన ఊరి భాష, యాస, కుకింగ్ స్టైల్ వల్ల తను వ్యూయర్స్​కి స్పెషల్​గా కనిపిస్తాడు. తన నిజాయితీ, నేచురల్​ వీడియోలు పెట్టడం వల్ల 2019లో ఉత్తమ యూట్యూబర్​గా అవార్డ్​ కూడా సాధించాడు. 2021లో బెస్ట్ ఫుడ్​ వ్లాగర్​గా అవార్డ్​ అందుకున్నాడు. ఈ ఛానెల్లో ప్రొమోషనల్ వీడియోలు కూడా చేస్తుంటాడు. 

యూట్యూబ్​ ఛానెల్ స్టార్ట్

మొదట్లో 2018లో ‘క్రాఫ్ట్ మీడియా’ అనే యూట్యూబ్​ ఛానెల్ పెట్టాడు. ఆ తర్వాత తను నేర్చుకున్న వంటను కూడా వీడియోల రూపంలో అప్​లోడ్ చేసేవాడు. ఆ వీడియోలకు మంచి అప్రిసియేషన్ వచ్చేది. కానీ అది తన లైఫ్​ని మార్చేస్తుందని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. అలా ‘క్రాఫ్ట్​ మీడియా’ పేరుతో ఉన్న ఛానెల్​ని ‘విలేజ్ ఫుడ్​ ఛానెల్​’గా మార్చేశాడు. ఇంకా చెప్పాలంటే తన వెల్డింగ్​ స్కిల్​ కూడా ఫుడ్​ ఛానెల్​కి ఉపయోగించుకున్నాడు. ఉదాహరణకు మొదట్లో మాంసం వండడానికి షావర్మా స్టేషన్​ని ఏర్పాటు చేశాడు.

ప్రస్తుతం తన ఛానెల్లో పాపులర్ అయిన వీడియో ‘కుచ్చి ఐస్​’. పుదీనా, మ్యాంగో, పైనాపిల్, ద్రాక్ష, నిమ్మ, ఆరెంజ్​, పుచ్చకాయలతో కుల్ఫీ ఐస్​ తయారుచేశారు. నెమలి, పాము వంటివాటిని వండిన వీడియోలు తన ఛానెల్లో అప్​లోడ్ చేసినప్పుడు పబ్లిక్​ నుంచి విపరీతంగా విమర్శలు వచ్చాయి. అయితే.. తను నెమలిని చూపించి  చికెన్​ వండానని వివరణ ఇచ్చాడు. 

వియత్నాం వెళ్లినప్పుడు అక్కడ పాముల్ని తినడం చట్టానికి వ్యతిరేకం కాకపోవడంతో వండినట్టు చెప్పాడు. అయితే విమర్శలు పక్కన పెడితే.. తను వంటచేయడానికి ఎంత కష్టపడతాడో ప్రతి వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. పైగా వీడియోల కోసం ఎక్కువ మొత్తంలో వండిన ఫుడ్​ని గ్రామస్తులకు, అనాథాశ్రమాలకు పంచుతాడు. 

యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా చారిటీకే విరాళమిస్తాడట ఫిరోజ్. అలా ఈ ఛానెల్ బాగా రన్ అవుతుండడంతో ట్రావెల్ వ్లాగ్స్ కోసం ‘ట్రావెల్ మాస్టర్’ పేరుతో సెకండ్ ఛానెల్ స్టార్ట్ చేశాడు. అది సక్సెస్ కాలేదు. ప్రజెంట్​ ‘విలేజ్ ఫుడ్​ ఛానెల్’​తోపాటు డైలీ వ్లాగ్స్​ కోసం ‘ఫిరోజ్​ చుట్టిపర’ అనే రెండు ఛానెల్స్ నడుపుతున్నాడు.