యూట్యూబర్​: వారానికి 4 వీడియోలు.. మిలియన్ సబ్‌‌స్క్రైబర్లు..

యూట్యూబర్​: వారానికి 4 వీడియోలు.. మిలియన్ సబ్‌‌స్క్రైబర్లు..

ఆమె ఒక మామూలు హోమ్​ మేకర్​. భర్త, పిల్లలే ఆమె ప్రపంచం. పిల్లలు స్కూలుకు వెళ్లాక ఇంట్లో ఖాళీగా ఉండలేక కుకరీ వ్లాగ్స్​ మొదలుపెట్టింది. ఇప్పుడు ఆమె ‘కర్రీస్​ వరల్డ్’​లో ఎన్నో ప్రామాణికమైన కేరళ వంటకాలు ఉన్నాయి. సరదా కోసం వ్లాగ్స్​ మొదలుపెట్టినా ఇష్టంతో కష్టపడి పనిచేసింది. అందుకే యూట్యూబ్  నుంచి గోల్డ్ ప్లే బటన్​ అందుకున్న మొదటి మలయాళీ మహిళగా నిలిచింది వీణాజాన్‌‌. 

వీణ కేరళలోని త్రిసూర్‌‌కి దగ్గర్లోని పెరింజనంలో పుట్టి, పెరిగింది. వాళ్ల నాన్న సక్సెస్​ఫుల్​ బిజినెస్​ మెన్​. ఒకే బిడ్డ కావడంతో తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచారు. ఇంటర్​ వరకు సొంతూరిలోనే చదువుకుంది. తర్వాత ఇంజనీరింగ్ చేసేందుకు తమిళనాడుకు వెళ్లింది. చదువు పూర్తయిన వెంటనే పెళ్లి చేశారు. 2006లో భర్త జాన్‌‌తో కలిసి దుబాయ్‌‌కి వెళ్లింది. జాన్​ బిజినెస్ అనలిస్ట్ మేనేజర్​గా పనిచేస్తున్నాడు.

ఇప్పుడు కూడా వాళ్ల కుటుంబం అక్కడే ఉంటోంది. దుబాయ్​కి వెళ్లాక వీణ జీవితం పూర్తిగా మారిపోయింది. భర్త, పిల్లలను చూసుకోవడమే డైలీ రొటీన్​గా మారింది. అయినా.. కొత్తలో పెద్దగా ఇబ్బందిపడలేదు. కానీ.. పిల్లలు స్కూల్​కి వెళ్లడం మొదలయ్యాక ఇంట్లో ఒంటరిగా ఉండలేకపోయింది. సరదాగా మాట్లాడేందుకు ఆమెకు అక్కడ ఎక్కువ మంది ఫ్రెండ్స్​ కూడా లేరు. దాంతో చేసేదేమీ లేక  ఏదైనా పని చేయాలనే ఆలోచనలో పడింది. 

ఫుడ్​ బ్లాగ్స్

వీణకు జాబ్​ చేసిన అనుభవం లేదు. పెండ్లికి ముందు కూడా వంట తప్ప మరో పని చేసింది లేదు. దాంతో తనకు బాగా తెలిసిన వంటలోనే ప్రయోగాలు చేయడం మొదలుపెట్టింది. కొత్త కొత్త వంటకాలు వండేది. కొన్నాళ్లకు చాలా వంటలు, చిట్కాలు నేర్చుకుంది. ఆమె చేసే వంటలు ఇంట్లో వాళ్లంతా ఇష్టంగా తినేవాళ్లు. అందుకే ఆమె భర్త జాన్ ఒకరోజు ఫుడ్ బ్లాగ్స్​ రాస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు.

అలా 2008లో రాయడం మొదలుపెట్టింది. చాలా తక్కువ టైంలోనే బ్లాగ్స్​కి రీచ్​ పెరిగింది. చాలామంది పాఠకులు ఆమెకు కుకింగ్​ వీడియోలు చేయాలని సలహా ఇచ్చారు. కానీ.. వీణ కెమెరా ముందు కనిపించడానికి ఇష్టపడలేదు. చివరగా 2015లో ‘వీణాస్​ కర్రీ వరల్డ్​’ పేరుతో యూట్యూబ్​ ఛానెల్​ పెట్టింది. ఎన్నో ట్రయల్ రన్స్​ తర్వాత తన మొదటి వీడియోను యూట్యూబ్​లో అప్‌‌లోడ్ చేసింది. 

అన్నీ తానై.. 

ఛానెల్​ పెట్టిన మొదట్లో ఆమెకు సపోర్ట్​ చేయడానికి ఎవరూ లేరు. జాన్ అప్పటికి తన ఉద్యోగ బాధ్యతలతో చాలా బిజీగా ఉన్నాడు. దాంతో ఛానెల్​కు సంబంధించిన అన్ని పనులను తానే చూసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ.. తనకేమీ తెలియదు. అయినా.. ప్రతీది నేర్చుకుంది.  వీడియో కెమెరాను ఆపరేట్ చేయడం నుంచి ఎడిటింగ్ చేసి, అప్​లోడ్​ చేయడం వరకు అన్ని పనులూ తానే చేసుకుంది.

తర్వాత ఛానెల్​ నెమ్మదిగా డెవలప్​ అయ్యింది. ప్రస్తుతం ఛానెల్​కు 2.57 మిలియన్ల సబ్​స్క్రయిబర్స్ ఉన్నారు. ఇప్పటివరకు 1,387 వీడియోలు అప్​లోడ్​ చేసింది. ముఖ్యంగా కేరళ సంప్రదాయ వంటకాలనే ఎక్కువగా చేస్తోంది.  ప్రస్తుతం ఫుడ్​ వీడియోలతో పాటు బ్యూటీ టిప్స్‌‌, లైఫ్​ స్టయిల్​ వ్లాగ్స్​ కూడా చేస్తోంది.

మొదటి వంటకం కిచిడీ

వీణ చదువుకునే రోజుల్లో మొదటిసారి వంట చేసింది. తన పేరెంట్స్​ కోసం సెమోలినా కిచిడీ వండింది. ఆ వంటకం వాళ్ల నాన్నకు చాలా నచ్చింది. మరిన్ని కొంత వంటకాలు ట్రై చేయమని ప్రోత్సహించాడు. ‘“మా అమ్మ కూడా కొత్త కొత్త వంటకాలు చేస్తుండేది. పరీక్షల టైంలో నా కోసం ప్రత్యేకంగా చిన్న చిన్న రైస్​ బాల్స్​ చేసేది. నేను చదువుకుంటుంటే అమ్మ తినిపించేది. ఆ  రైస్ బాల్స్ చాలా రుచిగా ఉండేవి. వాటి రుచిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రపంచంలోని అనేక రకాల వంటకాలు తిన్నా వాటి రుచి నాకు ఎప్పటికీ స్పెషలే” అంటోంది వీణ.

వారానికి 4 వీడియోలు

వీణ ఛానెల్​ పెట్టిన కొత్తలో వారానికి నాలుగు వీడియోలు అప్‌‌లోడ్ చేసేది. హెల్త్‌‌ బాగోలేనప్పుడు, పిల్లల ఎగ్జామ్స్​ టైంలో తప్ప ఎప్పుడూ యాక్టివ్​​గా ఉండేది. అలా చేయడం వల్లే సబ్​స్క్రయిబర్ల సంఖ్య పెరిగింది. తను వీడియోలు చేయడం మొదలుపెట్టిన తర్వాత తన ఫ్రెండ్స్ కూడా కొంతమంది వీడియోలు చేశారు. కానీ.. పెద్దగా సక్సెస్​ కాలేదు. అందుకు కారణం.. వాళ్లు రెగ్యులర్​గా వీడియోలు చేయకపోవడమే అంటోంది వీణ. కానీ.. వీణ మాత్రం వ్యూస్‌‌, డబ్బు వచ్చినా.. రాకపోయినా వీడియోలు చేస్తూనే ఉంది. అందుకే సక్సెస్​ అయ్యింది. ఇప్పటికీ వారానికి ఒక వీడియో కచ్చితంగా అప్​లోడ్​ చేస్తుంటుంది. అంతేకాదు.. వీణ కేరళలో మిలియన్ సబ్‌‌స్క్రైబర్లను సంపాదించుకున్న మొదటి మహిళా వ్లాగర్​గా రికార్డ్​ క్రియేట్​ చేసింది. 

రెగ్యులర్​గా యూట్యూబ్‌‌లో ఫుడ్ వ్లాగ్స్​ చూసేదాన్ని.ముఖ్యంగా చెఫ్ వికాస్ ఖన్నా ప్రభావం నా మీద ఎక్కువగా పడిందిఅతని ప్రత్యేకమైన వంటకాలు, సరదాగా ఉండే వ్యక్తిత్వం నన్ను ఇన్​స్పైర్​ చేశాయి. ‘కుకింగ్​షూకింగ్‌‌’ ఛానెల్​ నడుపుతున్న యంగ్​ చెఫ్ యమన్ అగర్వాల్ వంటలు కూడా నాకు చాలా ఇష్టం. తమిళనాడులోని
దిండిగల్‌‌లోని ఒక కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్​  కమ్యూనికేషన్స్​ ఇంజనీరింగ్‌‌ చేశా. ఆ టైంలో ఇంటికి దూరంగా ఉండడంతో వంట చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడే నాకు కుకింగ్​ మీద ఇంట్రెస్ట్​ పెరిగింది. చిన్నపాటివంట ప్రయోగాలు కూడా చేశా.కుకింగ్​నివృత్తిగా ఎంచుకోవాలనే ఆలోచన కూడా వచ్చింది.ఆ ఆలోచన ఇప్పుడు ఆచరణలోకి వచ్చింది.