ఫ్యాషన్ అంటే మంచి బట్టలు వేసుకోవడం మాత్రమే కాదు... అది వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఎక్స్‌ప్రెస్ చేసే శక్తివంతమైన టూల్. అందుకే మనిషి జీవితంలో ఫ్యాషన్ ‘కీ’ రోల్ పోషిస్తుంది. అలాంటి ఫ్యాషన్ ట్రెండ్స్‌ని క్రియేట్ చేస్తూ.. దాన్ని అందరికీ అర్థమయ్యేలా చేయడమే కరోన్ ఎస్ ధింగ్రా లక్ష్యం. అందుకే రెగ్యులర్‌గా ప్రజలకు మంచి మేకోవర్‌ల గురించి చెప్తుంటాడు. ఫ్యాషన్ అంటే ఏంటో వివరిస్తుంటాడు.
కరోన్ ఎస్ ధింగ్రాకు ఫ్యాషన్ వరల్డ్‌లో చాలా ఫాలోయింగ్ ఉంది. ఇతను ఎవరంటారా? ఫేమస్ మోడల్, యూట్యూబర్, వ్లాగర్, లాయర్, డిజిటల్ క్రియేటర్. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరు ఉంది. యూట్యూబ్ ఛానెల్ ‘ది ఫార్మల్ ఎడిట్’ ద్వారా జనాలకు దగ్గరయ్యాడు కరోన్. ఇప్పుడు ఈ ఛానెల్‌కు 5.21 మిలియన్ల సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఈ ఛానెల్‌లో లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ గురించి చెప్తాడు. ఫ్యాషన్‌లో చేసే పొరపాట్ల గురించి వివరిస్తాడు.
మేకోవర్ సిరీస్
మార్కెట్‌లో చాలామంది ఫ్యాషన్ క్రియేటర్స్ ఉన్నా.. ఇతను మాత్రం కాస్త భిన్నంగా వీడియోలు చేస్తుంటాడు. ప్రత్యేకంగా మేక్ఓవర్ సిరీస్ చేస్తున్నాడు. ట్రెండీగా ఉండటం అంటే.. మంచి బట్టలు వేసుకోవడమే కాదు.. ఫిట్‌గా ఉండడం కూడా అంటాడు కరోన్. అందుకే ఫిట్‌నెస్ మీద కూడా అవగాహన కల్పిస్తున్నాడు.
జుట్టు ఎలా కాపాడుకోవాలి? తల అందంగా ఎలా దువ్వుకోవాలి? వంటి అంశాలపై చేసిన వీడియోలు అతనికి మంచి గుర్తింపు తెచ్చాయి. కరోన్‌కు ఫ్యాషన్ హిస్టరీ మీద మంచి అవగాహన ఉంది. ఏ టైంలో ఎలాంటి ఫ్యాషన్ ట్రెండింగ్‌లో ఉంది? ఎందుకు ఉంది?.. వంటి విషయాల గురించి చర్చిస్తుంటాడు.
లాయర్‌గా మొదలై..
కరోన్ ఢిల్లీలో పుట్టి పెరిగాడు. అక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తర్వాత కార్పొరేట్ లాయర్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. ‘ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్. కో లిమిటెడ్’ కంపెనీలో లీగల్ మేనేజర్‌గా ఉద్యోగంలో చేరాడు. రెండేండ్ల పాటు అదే వృత్తిలో ఉన్నాడు. సక్సెస్‌ఫుల్ లాయర్, అడ్వైజర్‌గా పేరు తెచ్చుకున్నాడు. కానీ.. చిన్నప్పటినుంచి ఫ్యాషన్ ప్రపంచం మీదే ఎక్కువ ఇష్టం ఉండేది అతనికి. ఢిఫరెంట్‌గా డ్రెస్ చేసుకోవాలి అనుకునేవాడు. ఆ ఇష్టంతోనే టిక్‌టాక్‌లో ఫ్యాషన్‌కు సంబంధించిన వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. వాటికి బాగా వ్యూస్ రావడంతో యూట్యూబ్‌లో కూడా అడుగుపెట్టాడు.
2017లో అతను యూట్యూబ్ ఛానెల్ పెట్టాడు. 2018లో ఉద్యోగం మానేసి ఫ్యాషన్ గురించి తెలుసుకున్నాడు. అప్పటినుంచి ఛానెల్‌లో ఫ్యాషన్ వ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నాడు. ఇప్పటివరకు 841 వీడియోలు అప్‌లోడ్ చేశాడు. వాటిలో కొన్నింటికి ఐదు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాదు.. కరోన్ చేసే షార్ట్ వీడియోలకు రీచ్ బాగుంటుంది. అయితే.. ఈ సక్సెస్ వెంటనే వచ్చింది కాదు. ఛానెల్ 2017లో మొదలుపెడితే 2021లో ఒక మిలియన్ సబ్‌స్క్రయిబర్స్ మార్క్ దాటింది. ఆ తర్వాత నిదానంగా సబ్‌స్క్రయిబర్స్ పెరుగుతూ వచ్చారు.
యువత కోసం...
యువతలో కొందరికి ఎలా డ్రెస్ చేసుకోవాలో తెలియదు. దానివల్ల ఆత్మన్యూనత భావంతో బాధపడుతుంటారు. అలాంటి వాళ్లకు అవగాహన కల్పించడంతోపాటు వాళ్ల బడ్జెట్‌లోనే ఎలాంటి బట్టలు కొనుక్కోవచ్చు? ఎలా రెడీ అవ్వాలి? అనేది కరోన్ చెప్తుంటాడు. అయితే.. ‘రెడీ అవ్వడమంటే అందంగా కనిపించడం మాత్రమే కాదు. బయటి ప్రపంచానికి మనమేంటో చెప్పడం. అందుకే లైఫ్‌లో ఫ్యాషన్‌కు ప్రయారిటీ ఇవ్వడం ముఖ్యం’ అంటాడు కరోన్.
ఇతను ఫార్మల్ డ్రెస్సింగ్ ఎక్స్‌పర్ట్. గ్రూమింగ్ హ్యాక్స్ కూడా చెప్తుంటాడు. వాటివల్లే అతనికి ఇంత పేరొచ్చింది. బాడీ షేమింగ్, ఫిట్‌నెస్, యువతలో విశ్వాసం లేకపోవడం, వృద్ధాప్యం లాంటి ప్రధాన సమస్యలకు ఫ్యాషన్‌తో చెక్ పెట్టొచ్చు అనేది కరోన్ అభిప్రాయం. ఇలా యూత్‌ని డైరెక్ట్ చేసినందుకు అతనికి 2019లో మినిషా లాంబా వాళ్లు లీడింగ్ ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్–2019 అవార్డు ఇచ్చారు.
ఆ తర్వాత 2020 ఫిబ్రవరిలో ‘షేడ్స్ ఆఫ్ ఉమెన్’ మ్యాగజైన్ కవర్ పేజీ మీద కూడా మెరిశాడు ఇతను. 2020 నాటికి అతను చాలా ఫేమస్ అయ్యాడు. అప్పటినుంచి ‘నివియా, బ్లెండర్జ్, యారో, ఎంకెఫిన్, గార్నియర్, ఎంగేజ్’ లాంటి చాలా బ్రాండ్స్ అతనితో కొలాబరేట్ అయ్యి వీడియోలు చేస్తున్నాయి.
ట్రెండ్ సెట్టర్
కరోన్ ఫ్యాషన్ క్రియేటర్ మాత్రమే కాదు.. ఒక ట్రెండ్‌సెట్టర్. ఎందుకంటే.. ఎంతో మంది కరోన్ చెప్పిన మేకోవర్ ఫాలో అవుతుంటారు. మేకోవర్కి తగ్గట్టు హెయిర్‌స్టైలింగ్, మేకప్‌ల గురించి కూడా చెప్తుంటాడు. దాంతో అతను చెప్పినట్టు రెడీ కావడానికి చాలామంది యువత ఇష్టపడతారు. అందుకే అతను ఎప్పుడెప్పుడు కొత్త వీడియో అప్‌లోడ్ చేస్తాడా అని ఎదురు చూస్తుంటారు.