
జిమ్‌కు వెళ్లే ఆడవాళ్ల కంటే మగవాళ్లే ఎక్కువ. కానీ.. ఆడవాళ్లు కూడా జిమ్‌కు వెళ్లి ఫిట్‌గా ఉండాలంటోంది కవితా మఖిజా. సోషల్ మీడియా ద్వారా ఆడవాళ్ల ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించడంతోపాటు డైట్ గురించి సలహాలు ఇస్తోంది. అందుకే ఆమెను లక్షలమంది ఫాలో అవుతున్నారు. కేవలం యూట్యూబ్‌లోనే ఆమె చానెల్‌కు 14 లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఉన్నారు.
కవితా మఖిజా 1993లో ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో పుట్టింది. వాళ్లది మధ్య తరగతి కుటుంబం. కవితకు చిన్నప్పటినుంచి ఫిట్‌గా ఉండడం అంటే ఇష్టం. అందుకే రెగ్యులర్‌గా జిమ్‌కు వెళ్లడం, యోగా చేయడం లాంటివి చేసేది. కానీ.. సమాజంలో చాలామంది ఆడవాళ్లు ఫిట్‌నెస్‌పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం.. మగవాళ్లే ఎక్కువగా జిమ్‌లకు వెళ్తుండడం ఆమె గమనించింది. ఎలాగైనా ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలి అనుకుంది.
ఆడవాళ్లు ఫిట్‌నెస్ కోసం ఏం ఏం చేయొచ్చని రీసెర్చ్ చేసింది. ఆమె తెలుసుకున్న విషయాలను టిక్‌టాక్ ద్వారా జనాలకు చెప్పడం మొదలుపెట్టింది. అలా మహిళల్లో ఫిట్‌నెస్ మీద అవగాహన పెంచాలనే బలమైన కోరికతో సోషల్ మీడియాలోకి వచ్చింది. చాలా తక్కువ టైంలోనే టిక్‌టాక్‌లో దాదాపు 8 మిలియన్ల మంది ఫాలోవర్స్ వచ్చారు. కానీ.. మన దేశంలో టిక్‌టాక్ మీద నిషేధం విధించడంతో తన దృష్టిని ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్స్ వైపు మళ్లించింది.
కరోనా టైంలో..
కరోనా టైంలో చాలామంది ఇళ్లకే పరిమితం అయ్యారు. దాంతో.. అనేక రకాల మానసిక, శారీరక సమస్యలు తలెత్తాయి. కొంతమంది బరువు పెరిగారు. ఆ టైంలో జనాలకు ఫిట్‌నెస్ మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో యూట్యూబ్‌లో వీడియోలు చేసింది. అప్పటికే మొదలుపెట్టిన అయామ్కేవి(imkavy) చానెల్లో ‘‘మీరు వర్కవుట్ కోసం కొంత ప్రేరణ కోరుకుంటున్నారా?.. తప్పక చూడండి” అనే టైటిల్‌తో మొదటి వీడియో పోస్ట్ చేసింది. వర్కవుట్స్ ఎలా చేయాలి? ఫిట్‌గా ఎలా ఉండాలి? ఎలాంటి డైట్ పాటించాలి?.. ఇలాంటి విషయాలన్నీ తన వీడియోల్లో చెప్పింది. ప్రతి వీడియోలో అందరూ ఫిట్‌గా ఉండాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పడం లక్ష్యంగా పెట్టుకుంది.
పైగా ప్రతి విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా సులభంగా చెప్పడం ఆమె పత్యేకత. తన వ్యూయర్స్‌కి ఏ విషయం చెప్పాలన్నా ముందుగా దానిమీద ఎంతో రీసెర్చ్ చేస్తుంది. అందుకే ఆమె చానెల్ తక్కువటైంలోనే ప్రజాదరణ పొందింది. సబ్స్క్రయిర్లు పెరిగిన తర్వాత ఫిట్‌నెస్ వీడియోలతోపాటు డైలీ రొటీన్ వ్లాగ్స్కూడా చేస్తోంది. కొన్నాళ్ల క్రితం వాళ్ల అమ్మకు కూడా ఫిట్‌నెస్ సలహాలు ఇచ్చి వెయిట్ తగ్గేలా చేసింది. ఆ జర్నీని కూడా వీడియో తీసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. తన క్లయింట్స్‌కి ఆన్లైన్లో కూడా ఫిట్‌నెస్ ట్రైనింగ్ ఇస్తోంది.
687 మిలియన్ల వ్యూస్
కవిత 2015లోనే యూట్యూబ్ చానెల్ పెట్టింది. కానీ.. చాలా రోజుల వరకు వీడియోలు పోస్ట్ చేయలేదు. 2020 మే 30న తన మొదటి వీడియోని పోస్ట్ చేసింది. చానెల్ పెట్టిన మొదట్లో పెద్దగా వ్యూస్ రాలేదు. కానీ.. కొన్నాళ్లకు సబ్స్క్రయిబర్స్సంఖ్య పెరుగుతూ వచ్చింది. చానెల్లో ఇప్పటివరకు 3,165 వీడియోలు అప్లోడ్ చేసింది. వాటిలో కొన్ని షార్ట్ వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. తన భర్త ఉమాంగ్ కత్యాల్‌తో కలిసి చేసిన ఒక కామెడీ షార్ట్ వీడియోకు ఏకంగా 687 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. చానెల్లో వంద మిలియన్ల వ్యూస్ దాటిన షార్ట్ వీడియోలు చాలానే ఉన్నాయి. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా 2.7 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
మూడు ట్రక్ టైర్లను వీపు మీద పెట్టుకుని ప్లాంక్స్ చేసిన ఇక వీడియోని కవిత ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో కొన్నాళ్ల క్రితం చాలా వైరల్ అయ్యింది. ప్రస్తుతం వారానికి కనీసం ఒక్క వీడియో అయినా యూట్యూబ్‌లో అప్లోడ్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. కవితకు యూట్యూబ్ ద్వారానే కాకుండా బ్రాండ్ స్పాన్సర్‌షిప్‌లు, మోడలింగ్ ద్వారా కూడా డబ్బు వస్తోంది. పైగా.. సొంతంగా ఒక వెబ్సైట్ ఏర్పాటుచేసుకుని పీనట్ బటర్ లాంటివి అమ్ముతోంది. వీటిన్నింటి నుంచి ప్రతి నెలా పది లక్షలకుపైగానే సంపాదిస్తోంది.