యూట్యూబర్​ : హెల్పింగ్​ రైడర్​..తక్కువ టైంలో సక్సెస్​ అయిన ఇన్​ప్లుయెన్సర్ల లిస్ట్‌‌‌‌లో ఒక్కడు

యూట్యూబర్​ : హెల్పింగ్​ రైడర్​..తక్కువ టైంలో సక్సెస్​ అయిన ఇన్​ప్లుయెన్సర్ల లిస్ట్‌‌‌‌లో ఒక్కడు

రోడ్డు మీద వెళ్తుంటే అప్పుడప్పుడు పెట్రోల్​ లేక బైక్​ని తోసుకుంటూ వెళ్లేవాళ్లు కనిపిస్తుంటారు. వాళ్లను చూసి ‘అయ్యో పెట్రోల్​ అయిపోయినట్టుందే!’ అని జాలి పడడం తప్ప చేసేదేమీ లేక వెళ్లిపోతుంటాం. కానీ.. లక్ష్మణ్​ అలాంటి వాళ్లకోసం తన బైక్​లో ఎప్పుడూ ఒక పెట్రోల్ బాటిల్ పెట్టుకుంటాడు. ఒకవేళ అతని దగ్గర పెట్రోల్​ లేకపోతే.. బైక్​ని కాలితో నెడుతూ పెంట్రోల్​ బంక్​ వరకు తీసుకెళ్తాడు. ఇదొక్కటే కాదు.. తన ప్రయాణంలో ఇబ్బందుల్లో ఉన్నవాళ్లు ఎవరైనా కనిపిస్తే.. తోచిన సాయం చేస్తాడు. అందుకే అతనికి దేశమంతా ఫాలోవర్స్​ ఉన్నారు. అన్ని రాష్ట్రాలవాళ్లు అతని వీడియోలను చూస్తున్నారు. 

యూట్యూబ్​లో చాలా తక్కువ టైంలో సక్సెస్​ అయిన ఇన్​ప్లుయెన్సర్ల లిస్ట్‌‌‌‌లో లక్ష్మణ్​ ముందు వరుసలో ఉంటాడు. అతని అసలు పేరు లక్ష్మణ్ గోస్వామి అయినప్పటికీ అతని చానెల్​ ‘లేకి రైడర్​’ పేరుతో ఎక్కువ గుర్తింపు పొందాడు.  లక్ష్మణ్ కర్నాటకలో పుట్టి పెరిగాడు. కానీ.. బైక్​ రైడ్స్​ చేస్తూ దేశమంతా తిరిగాడు. లక్ష్మణ్​ ఇప్పటివరకు థ్రిల్లింగ్ బైకింగ్ అడ్వెంచర్స్​ చాలా చేశాడు.

అయితే.. అవి చేసినప్పుడు వచ్చిన ఫాలోవర్స్​ కంటే.. హెల్పింగ్​ వీడియోలు చేసినప్పుడు వచ్చిన ఫాలోవర్స్​ సంఖ్య చాలా ఎక్కువ. బైకింగ్‌‌‌‌ అతని హాబీ అయితే.. సాయం చేయడం అతని గుణం. అందుకు అతను కర్నాటకలో చాలా ఫేమస్​. ఎక్కడ అతని బైక్​ కనిపించినా అభిమానులు చుట్టుముడుతుంటారు. అందుకే తన సబ్​స్క్రయిబర్స్ కోసం అప్పుడప్పుడు మీటప్​లు కూడా పెడుతుంటాడు లక్ష్మణ్​. 

రైడింగ్​ కోసమే.. 

లక్ష్మణ్​కి చిన్నప్పటినుంచి బైక్​ నడపడం అంటే ఇష్టం. అందుకే రెగ్యులర్​గా లాంగ్​ రైడ్స్​ చేస్తుండేవాడు. అలా కొన్నాళ్లకు తన రైడ్స్​ని వీడియోలు తీసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేయాలనే ఆలోచన వచ్చింది.  అలా యూట్యూబ్​లో చానెల్​ పెట్టాడు. తన డ్యూక్​  బైక్​ మీద తిరుగుతూ.. హీరో గోప్రో కెమెరాతో వీడియోలు తీసి పోస్ట్‌‌‌‌ చేయడం మొదలుపెట్టాడు. కానీ.. వాటికి పెద్దగా వ్యూస్​ రాలేదు.

అయితే.. తను రైడింగ్​ చేస్తున్నప్పుడు ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉన్నవాళ్లు కనిపిస్తే తన వంతుగా ఎంతో కొంత సాయం చేసేవాడు. దాన్ని కూడా వీడియో తీసి చానెల్​లో పోస్ట్‌‌‌‌ చేయడం మొదలుపెట్టాడు. అతని మంచి మనసును అందరూ మెచ్చుకున్నారు. దాంతో ఇప్పుడు రైడింగ్​ కంటెంట్​ కంటే హెల్పింగ్ వీడియోలే ఎక్కువగా పోస్ట్ చేస్తున్నాడు. 

ఇన్​స్పైర్​ 

లక్ష్మణ్​ చేసేది చిన్న చిన్న సాయాలే. కానీ.. అలాంటివి చేయడానికి కూడా ఎంతో పెద్ద మనసు ఉండాలి. లక్ష్మణ్​ పెద్ద మనసుతో పేదవాళ్లకు ఫుడ్​ పెట్టడం, వీధి కుక్కలకు బిస్కెట్లు వేయడం, తన ప్రయాణాల్లో యాదృచ్ఛికంగా కలిసే వ్యక్తులకు సాయం చేయడం లాంటివి చేస్తున్నాడు. అతన్ని చూసి ఎంతోమంది ఇన్​స్పైర్​ అయ్యారు. అతని వల్ల కర్నాటకలో చాలామంది ఇలాంటి చిన్న చిన్న సాయాలు చేయడం మొదలుపెట్టారు. 

సాయం కోసం వెబ్​సైట్​

‘‘యూట్యూబర్‌‌‌‌గా నా ప్రయాణాన్ని 2021లో స్టార్ట్​ చేశా. దానివల్ల ఎంతోమంది ప్రేమని దక్కించుకున్నా. ఈ అపారమైన ప్రేమ, సపోర్ట్‌‌‌‌ని నేను ఎప్పుడూ ఎక్స్​పెక్ట్‌‌‌‌ చేయలేదు. వీడియోలు చేయాలనే లక్ష్యంతోనే యూట్యూబ్​ మొదలుపెట్టా. కానీ.. ఇప్పుడు నలుగురికీ సాయం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నా. అందుకే నాకు సాయం చేయడానికి చాలామంది ముందుకొస్తున్నారు. కానీ.. అలాంటివాళ్ల దగ్గర్నించి నేరుగా డబ్బు తీసుకోవడం నాకు ఇష్టం లేదు’ అంటున్నాడు లక్ష్మణ్​.

కానీ.. ఎవరైనా కచ్చితంగా సాయం చేస్తామంటే నేరుగా తీసుకోకుండా తన వెబ్​సైట్​ నుంచి వస్తువులు కొనాలని చెప్తున్నాడు. అతను లేకిగో పేరుతో ఇ–కామర్స్​ వెబ్​సైట్​ నడుపుతున్నాడు. అందులో ఉండే వస్తువులను ఎవరైనా కొంటే... దాని మీద వచ్చే లాభాన్ని పేదలకు సాయం చేయడానికి వాడుతున్నాడు. 

పది మిలియన్లకు దగ్గర్లో.. 

లక్ష్మణ్​ గోస్వామి నడిపే చానెల్​ ‘లేకి రైడర్​’కి ఇప్పటివరకు 9.53 మిలియన్ల మంది సబ్​స్క్రయిబర్లు ఉన్నారు.  చానెల్​ పెట్టిన మూడేండ్లలోనే పది మిలియన్ల సబ్​స్క్రయిబర్ల మార్క్​కు దగ్గరైంది. ఇప్పటివరకు చానెల్​లో 2600 వీడియోలు పోస్ట్​ చేశాడు. వాటిలో ఎక్కువగా షార్ట్​ వీడియోలే ఉన్నాయి.  లక్ష్మణ్​ పోస్ట్​ చేసే పెద్ద వీడియోలకు పెద్దగా వ్యూస్​ రావడం లేదు. కానీ.. షార్ట్​ వీడియోలు మాత్రం రెగ్యులర్​గా వైరల్​ అవుతుంటాయి.

లక్ష్మణ్​ ఒకసారి ట్రాఫిక్​లో ఇరుక్కున్నాడు. అతని పక్కనే అంబులెన్స్​ ఉంది. అందులో ఉన్న పేషెంట్​ పరిస్థితి సీరియస్​గా ఉందని తెలిసి లక్ష్మణ్​ ఫుట్​పాత్​ మీదకి బైక్​ ఎక్కించి సిగ్నల్​ వరకు వెళ్లి ట్రాఫిక్​ క్లియర్​ చేశాడు. అదంతా వీడియో తీసి యూట్యూబ్​లో పెట్టాడు. దానికి ఏకంగా 122 మిలియన్ల వ్యూస్​ వచ్చాయి. పది మిలియన్ల వ్యూస్​ దాటిన వీడియోలు చానెల్​లో చాలానే ఉన్నాయి.