యూట్యూబర్​: పాములతో స్నేహం!..యూట్యూబ్​లో 15 లక్షల సబ్​స్క్రయిబర్లు

యూట్యూబర్​: పాములతో స్నేహం!..యూట్యూబ్​లో 15 లక్షల సబ్​స్క్రయిబర్లు

సాధారణంగా పాముని చూడగానే.. అందరూ భయపడతారు. కానీ.. మురళీవాలె మాత్రం పాములను తన ఫ్రెండ్స్​లా భావిస్తుంటాడు.  పాముల వల్ల మనుషులకే కాదు.. మనుషుల వల్ల పాములకు కూడా ఎలాంటి ఆపద రాకూడదని కోరుకుంటారు. అందుకే పాముల నుంచి మనుషులను, మనుషుల నుంచి పాములను కాపాడుతుంటాడు. ఎక్కడ పాము ఉందని తెలిసినా వెంటనే వాలిపోతాడు. ఎలాగైనా పాముని పట్టుకుని సేఫ్​ ప్లేస్​లో వదిలిపెడతాడు. ఇలా ఒక్కటి కాదు రెండు కాదు.. ఇప్పటివరకు పది వేలకుపైగా పాములను కాపాడాడు మురళి. అందుకే అతన్ని యూట్యూబ్​లో పదిహేను లక్షల మంది అభిమానిస్తున్నారు. 

మురళీవాలె హౌస్లాది ఉత్తరప్రదేశ్‌‌లోని జౌన్‌‌పూర్​కి దగ్గర్లోని బేలాపర్ గ్రామం. అసలు పేరు మురారి లాల్​. ‘మురళీవాలె హౌస్లా’ పేరుతో యూట్యూబ్​ చానెల్​ పెట్టడంతో అందరూ ఆ పేరుతోనే పిలుస్తున్నారు. పాములను పట్టడంలో అతను ఎక్స్​పర్ట్‌‌. అంతేకాదు.. అతనికి ప్రతి పాము గురించి క్షుణ్ణంగా తెలుసు. ఎక్కడ పాముని పట్టుకున్నా.. అక్కడివాళ్లకు దాని గురించి వివరంగా చెప్తుంటాడు. 

అయితే.. పాములు పట్టడం మురళికి వంశ పారంపర్యంగా వచ్చిన విద్య కూడా కాదు. మురళి సోషియాలజీ, పొలిటికల్ సైన్స్‌‌లో మాస్టర్స్ పూర్తి చేశాడు. ఆ తర్వాత బి.ఎడ్ కూడా చేశాడు. కానీ.. ఆశించిన ఉద్యోగం రాలేదు. అయితే.. మురళికి చిన్నప్పటినుంచే పాములంటే ప్రేమ. వాటికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా అతను తట్టుకోలేడు. అందుకే వాటితో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. విషపూరిత పాములతో ఆడుకోవడం అతని హాబీగా మారింది. ఇప్పుడు పాములతోపాటు ఇతర వన్య మృగాలను కూడా రెస్క్యూ చేస్తున్నాడు. 

డబ్బుల కోసం కాదు.. 

ఎవరి ఇంట్లోనైనా విష సర్పం ఉందని తెలిస్తే.. ఏమీ ఆలోచించకుండా ఏ టైంలో అయినా వెళ్లిపోతుంటాడు. కానీ.. ఎవరి దగ్గరా ఒక్క రూపాయి కూడా ఆశించడు. మొదట్లో ఉద్యోగం రాకపోవడంతో డబ్బుల కోసమే పాములు పడుతున్నాడని అందరూ అనుకున్నారు. కానీ.. మురళి పాములు పట్టేది డబ్బుల కోసం కాదు. పాములను కాపాడాలనే మంచి ఉద్దేశంతోనే ఈ పనిచేస్తున్నాడు.  

ఈ ఆలోచన ఇలా వచ్చింది

మురళికి ఎనిమిదేళ్ల వయస్సు నుంచే పాముల మీద ఇంట్రెస్ట్‌‌ పెరిగింది. ఒక రోజు వాళ్ల ఇంట్లో పాము ఉండడం చూసి పాములను పట్టే వ్యక్తిని పిలిపించారు. అతను పాము పట్టే విధానాన్ని బాగా గమనించాడు మురళి. అతన్ని అడిగి పామును పట్టుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాడు. ఆ మరుసటి రోజు అతను స్కూల్​ నుంచి తిరిగి వస్తుండగా దారిలో ఒక పాము కనిపించింది. వెంటనే దాన్ని పట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన కుటుంబసభ్యులు  అతన్ని మందలించారు. అయినా తను ఆ పని మానుకోలేదు. అప్పటినుంచి వాళ్ల అమ్మానాన్నలకు తెలియకుండా పాములు పట్టి, అడవిలో వదిలేసేవాడు. ఆ తర్వాత మురళి స్నేక్స్​ ఎక్స్​పర్ట్‌‌, మత్స్య శాఖ అధికారి డాక్టర్ అరవింద్ మిశ్రాను కలిశాడు. ఆయన మాటలు విన్నాక మురళిలో మిగిలి ఉన్న కాస్త భయం కూడా మాయమైంది. అప్పటినుంచి పాములు పట్టడంలో ఎక్స్​పర్ట్‌‌ అయ్యాడు. 

యూట్యూబ్​లోకి..

పాముల గురించి, వాటి వల్ల కలిగే మేలు గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో తను పామును పట్టుకున్న ప్రతిసారి వీడియో తీసి సోషల్​ మీడియాలో పోస్ట్ చేసేవాడు. ఆ తర్వాత 2019లో యూట్యూబ్‌‌ చానెల్​ పెట్టాడు. ఇప్పటివరకు 1,034 వీడియోలు అప్‌‌లోడ్​ చేశాడు. చానెల్​లో 200 మిలియన్ల వ్యూస్​ దాటిన వీడియోలు కూడా రెండు ఉన్నాయి. చానెల్​ పెట్టిన చాలా తక్కువ టైంలోనే సక్సెస్​ అయ్యాడు. అతను అప్​లోడ్​ చేసిన వీడియోలు చాలా వైరల్​ అయ్యాయి. ప్రస్తుతం చానెల్​కు 15 మిలియన్లకు పైగా  సబ్​స్క్రయిబర్లు ఉన్నారు. 

ఇంట్లో కూడా.. 

మురళి తన ఇంట్లో విషపూరిత పాములను పెంచడానికి డజన్ల కొద్దీ చెక్క పెట్టెలను ఏర్పాటు చేసుకున్నాడు. అన్ని పెట్టెల్లో ఎప్పుడూ పాములు ఉంటాయి. ఎక్కువ పాములను పోషించేందుకు డబ్బు లేకపోవడంతో ఒక కొత్త పాముని పట్టుకురాగానే అప్పటికే ఉన్న పాముల్లో ఒకదానిని అడవిలో వదిలేస్తుంటాడు. మురళి ఒకేసారి పది విషపూరిత పాములను కంట్రోల్​ చేయగలడు. అతనికి ప్రకృతి పట్ల కూడా చాలా ప్రేమ ఉంది. అందుకే ఇంటి ముందు, వెనుక అనేక రకాల మొక్కలు నాటాడు. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో ఈ విష సర్పాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని చెప్తుంటాడు మురళి. ఈ విషయం తెలియకపోవడం వల్లే ప్రజలు వాటిని చంపుతున్నారంటాడు. 

వీడియో చూసి.. 

ఒకరోజు మురళి సోషల్​ మీడియాలో ఒక వీడియో చూశాడు. అందులో ఒక పిల్లవాడు మెడలో నాగుపాము వేసుకుని తిరుగుతున్నాడు. మురళి ఆ వీడియోలోని లొకేషన్​ మహారాష్ట్రలోని కతిహార్​లో ఉందని తెలుసుకున్నాడు. అక్కడివాళ్లు పాముని చంపేస్తారు.. లేదంటే ఆ పాము బిడ్డను కరిచే ప్రమాదం ఉందని వెంటనే ఉత్తరప్రదేశ్​ నుంచి అక్కడికి వెళ్లిపోయాడు. కానీ.. అతను వెళ్లేసరికి అక్కడివాళ్లు పాముని పూజిస్తున్నారు. అప్పుడు ఆ పామును వాళ్ల బారి నుంచి కాపాడి, దాని గురించి వాళ్లకు వివరించాడు.