దేశంలో రాజకీయంగా ఏ మార్పు జరిగినా దాని గురించి పూర్తిగా వివరిస్తూ వీడియో చేస్తాడు. అంతేకాదు.. జనాలకు ప్రమాదం అనుకున్న ప్రతి విషయం గురించి ఎత్తిచూపుతాడు. అందరికీ అవగాహన కల్పించేందుకే వీడియోలు చేస్తుంటాడు. అందుకే నితీశ్ అంటే కొన్ని లక్షల మంది ఇష్టపడతారు. ఇప్పటికే అతని ఛానెల్‌ను 30 లక్షలమందికి పైగా సబ్‌స్క్రయిబ్ చేసుకున్నారు.
నితీశ్ కుమార్ రాజ్‌పుత్ 1989 అక్టోబర్ 4న ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో పుట్టాడు. అతని తండ్రి వ్యాపారి. తల్లి శశి సింగ్ గృహిణి. చెల్లి షాలిని రాజ్‌పుత్ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చదువుతోంది. నితీశ్ పుట్టిన తర్వాత ఏడాదికి వాళ్ల కుటుంబం సుల్తానాపూర్ నుంచి రుద్రాపూర్‌కి మారింది. కొన్నేండ్లు రుద్రాపూర్‌లో ఉన్న తర్వాత వాళ్ల నివాసాన్ని ఢిల్లీకి మార్చారు.
చదువంటే ఇష్టం
నితీశ్ కుమార్ రాజ్‌పుత్‌కు చిన్నప్పటి నుంచి చదవడం అంటే చాలా ఇష్టం. చదువు తర్వాత అతనికి టీవీ చూడటం అంటే ఇష్టం. టీవీలో క్రికెట్ ఎక్కువగా చూసేవాడు. రుద్రాపూర్‌లోని జసాస్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నాడు. తర్వాత గౌతమ్ బుధ్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బి. టెక్), ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పూర్తి చేశాడు. నితీష్‌కు చిన్నప్పటి నుంచి ఇంజినీర్ కావాలని ఉండేది. కానీ.. ఇంట్లో వాళ్లు మాత్రం నితీష్‌ని డాక్టర్ చేయాలి అనుకున్నారు. ఏదేతైనేం ఆఖరికి నితీశ్ తనకు నచ్చిన కోర్సులోనే చేరాడు.
ఉద్యోగ జీవితం
బీటెక్ పూర్తయ్యాక నితీశ్ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది ఊరికి వెళ్లి వారసత్వంగా వస్తున్న తండ్రి బిజినెస్ చూసుకోవడం. రెండోది ఉద్యోగం చేయడం. నితీశ్ ఉద్యోగం చేయాలని డిసైడ్ అయ్యాడు. ముందుగా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయాలి అనుకున్నాడు. కానీ.. చివరకు ప్రైవేట్ ఉద్యోగంలో చేరాడు. తక్కువ టైంలోనే మేనేజర్ పొజిషన్‌కి వెళ్లాడు.
అన్నీ ఉన్నా..
మంచి ఉద్యోగం.. ఖరీదైన ఫోన్లు.. మంచి కార్లు.. అన్నీ ఉన్నాయి. అయినా నితీశ్ కి ఆనందంగా అనిపించలేదు. ఇంకేదో చేయాలనే తపన ఉండేది. అదే టైంలో ‘ది సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్’ పుస్తకం చదివాడు. ఆ పుస్తకం నుండి చాలా నేర్చుకున్నాడు. అతనిలో చాలా మార్పు వచ్చింది. దాంతో అతను ఒక ఎన్జీవోలో పనిచేశాడు. అప్పటినుంచి పేదలకు సాయం చేయడం మొదలుపెట్టాడు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు.
మొదటగా టిక్‌టాక్‌లోకి
నితీశ్ ముందుగా టిక్‌టాక్ ద్వారా సోషల్ మీడియాలోకి వచ్చాడు. అప్పట్లో టిక్‌టాక్ చాలా ఫేమస్. అందుకే టిక్‌టాక్ ద్వారా సమాజంలోని సమస్యలను అందరికీ తెలిసేలా చేయాలని షార్ట్ వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. ఆ వీడియోలు బాగా సక్సెస్ అయ్యాయి. జనాల్లోకి బాగా వెళ్లాయి. వీడియోల్లో మంచి ఇన్ఫర్మేషన్ ఉండడంతోపాటు ప్రేరణ కలిగించేవి. దానివల్ల అతనికి మంచి పేరొచ్చింది. అదే టైంలో భారత్‌లో టిక్‌టాక్‌ను నిషేధించారు. దాంతో 2020లో ‘‘నితీశ్ రాజ్‌పుత్” పేరుతో యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టాడు.
ఇప్పుడు నితీశ్ వీడియోలను యూట్యూబ్‌లో షేర్ చేస్తున్నాడు. టిక్‌టాక్ వర్సెస్ యూట్యూబ్ అనే అంశంపై నితీశ్ చేసిన వీడియో పెద్ద చర్చకు దారి తీసింది. దానివల్ల నితీశ్ యూట్యూబ్‌లో కూడా ఫేమస్ అయ్యాడు. తర్వాత విద్యావ్యవస్థపై నితీశ్ చేసిన వీడియో బాగా వైరల్‌గా మారింది. ఆ వీడియో తర్వాత సబ్‌స్క్రయిబర్ల సంఖ్య చాలా స్పీడ్‌గా పెరిగింది. ఛానెల్‌కు ప్రస్తుతం 3.01 మిలియన్ల మంది సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. ఛానెల్‌లో 88 వీడియోలు ఉన్నాయి.
ఆదాయం
నితీశ్ కుమార్ యూట్యూబ్ ఛానెల్ నుండి ప్రతి నెలా దాదాపు నాలుగు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అతని వీడియోల్లో కొన్నింటికి ఏడు మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. అతను ఎంచుకునే సబ్జెక్ట్‌లు అన్నీ సీరియస్‌గానే ఉంటాయి. వీడియోలు ఎంటర్‌టైనింగ్‌గా లేకున్నా ఇన్ఫర్మేషన్ కోసమే చాలామందిచూస్తున్నారు. ముఖ్యంగా అర్థవంతమైన చర్చలే అతనికి అభిమానులను సంపాదించిపెట్టాయి. ఒడిశా రైలు ప్రమాదం, ఆర్యన్ ఖాన్ కేసు, జాక్వెలిన్ కేసు, అమృతపాల్ సింగ్ కేసుపై అతను చేసిన వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.