Ranveer Allahbadia: నోటికొచ్చినట్లు మాట్లాడి..వివాదంలో యూట్యూబర్..పార్లమెంట్ దాకా పోయింది

Ranveer Allahbadia: నోటికొచ్చినట్లు మాట్లాడి..వివాదంలో యూట్యూబర్..పార్లమెంట్ దాకా పోయింది

రణవీర్ అల్లాబాడియా..ఇన్‌స్టాగ్రామ్‌లో 4.5 మిలియన్ల మంది ఫాలోవర్లు,1.05 కోట్ల మంది యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్, పోడ్ కాస్టర్.. ఓ ప్రోగ్రమ్ లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సారీ చెప్పినా వదలడం లేదు నెటిజన్లు. ఏకంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రణవీర్ అల్లాబాడియాకు వార్నింగ్ ఇచ్చారు. రణవీర్ వ్యాఖ్యలకు సంబంధించి వీడియో వైరల్ కావడంతో పార్లమెంట్ దాక పోయింది. రణవీర్ పై చర్యలకు పలువురు ఎంపీలు ఫిర్యాదు చేశారు. 

ఇండియాస్ గాట్ లాటెంట్ అనే రోస్ట్ షోలో చేసిన వ్యాఖ్యలపై యూట్యూబర్ ,పాడ్‌కాస్టర్ రణవీర్ అల్లాబాడియా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. టీవీ షోలో రణవీర్ చేసిన దారుణమైన వ్యాఖ్యలకు క్షమాపణలను చెప్పినప్పటికీ అతనికి ముప్పు తప్పేలా లేదు. రణవీర్ వ్యాఖ్యలపై కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ సీరియస్ అయ్యింది. తన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని ఈ పోడ్ కాస్టర్ కు నోటీసులు, అతనిపై చర్యలు తీసుకోవాలని ఎంపీలు పట్టుబట్టారు. 

కామెడీ కంటెంట్ పేరుతో భాష హద్దులు దాటుతుందని శివసేన (UBT) రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్రంగా స్పందించారు. అల్లాబాడియా చేసిన ఇండియాస్ గాట్ లాటెంట్ ఎపిసోడ్‌తో సంబంధం ఉన్న హాస్యనటుడు సమయ్ రైనా, ఇన్‌ఫ్లుయెన్సర్ అపూర్వ మఖిజా ,ఇతరులపై కూడా ముంబై ,గౌహతిలో పోలీసులకు ఫిర్యాదులు చేశారు. 

అశ్లీలతను ప్రోత్సహించడం ,లైంగికంగా అసభ్యకరమైన చర్చలో పాల్గొనడం వంటి ఆరోపణలపై అల్లాబాడియా, యూట్యూబర్ ఆశిష్ చంచ్లానీ, హాస్యనటుడు జస్ప్రీత్ సింగ్, మఖిజా, రైనాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు.

అల్లాబాడియా వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సీరియస్ అయ్యారు. ప్రతి ఒక్కరికీ వాక్ స్వాతంత్య్రం ఉంటుంది. ఇతరుల స్వేచ్ఛను హరిస్తే. ఎవరైనా వాటిని అతిక్రమిస్తే చర్యలు తప్పవు అని అన్నారు. 

దేశవ్యాప్తంగా రణవీర్ అల్లాబాడియా వ్యాఖ్యలపై రచ్చరచ్చ అయితోంది. రణవీర్ పై చర్యలకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ఎంపీల ఫిర్యాదుతో పార్లమెంటరీ ప్యానెల్ అల్లాబాడియాను విచారించే అవకాశం ఉంది. ప్యానల్ విచారణకు రావాలని ఈ పోడ్ కాస్టర్ కు నోటీసులు చేయొచ్చు.