ఫలితం వస్తుందా? లేదా? అనే అనుమానంతో అసలు పనే చేయకుండా ఉండడం కంటే.. నమ్మకంతో పని చేసుకుంటూ పోవాలి అంటాడు’ ట్రక్ డ్రైవర్ రాజేష్. అతను ఈ థియరీని బలంగా నమ్మడం వల్లే ఇప్పుడు ప్రతి నెలా లక్షల్లో సంపాదిస్తున్నాడు. ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తూనే యూట్యూబర్‌గా ఎదిగిన రాజేష్ లైఫ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అదృష్టం ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. అందుకే దాని గురించి పెద్దగా ఆలోచించకుండా తన ప్రయత్నం తాను చేశాడు ట్రక్ డ్రైవర్ రాజేష్ రావణి. ట్రక్ డ్రైవర్‌గా నెలకు పాతిక నుంచి ముప్పయ్ వేల రూపాయలు సంపాదిస్తాడు. ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషించడానికి చాలా ఇబ్బంది పడేవాడు. కానీ.. మరో మార్గం లేక ఆ పనిలోనే ఉన్నాడు. ఆ కాస్త జీతం కోసం కూడా చాలా కష్టపడాల్సి వచ్చేది. కుటుంబానికి దూరంగా ఉండటమే కాకుండా కొన్నిసార్లు సరిగ్గా భోజనం కూడా చేసే పరిస్థితి ఉండేది కాదు. సెలవులు తీసుకుంటే జీతం తక్కువగా వస్తుందని పండగలప్పుడు కూడా పని చేసేవాడు. ఆ త్యాగానికి ప్రతిఫలమే ఇప్పుడు యూట్యూబ్‌లో సక్సెస్ రూపంలో వచ్చింది.
అనుకోకుండా...
రాజేష్ రావణిది జార్ఖండ్‌లోని రామ్‌ఘర్ అనే చిన్న పట్టణం. పాతికేండ్లుగా ట్రక్ డ్రైవర్‌గా ఉన్నాడు. అయితే.. ట్రక్ నడుపుతూ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు వెళ్లేవాడు. అక్కడ కనిపించే అందమైన ప్లేస్‌లను తన భార్య, కొడుకులు కూడా చూడాలనే ఉద్దేశంతో వీడియోలు తీసి, వాళ్లకు పంపేవాడు. అలా ఒకసారి పంపిన వీడియోని అతని ఇద్దరు కొడుకులు కలిసి ఎడిట్ చేసి, యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. వాళ్లలా అప్లోడ్ చేశారనే విషయం రాజేష్‌కు కూడా తెలియదు. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో.. వాళ్లు రాజేష్‌ని మరిన్ని వీడియోలు తీసి పంపమని అడిగారు.
వాళ్ల మాటలకు అతను ఆశ్చర్యపోయాడు. ‘ఎందుకు అంతలా అడుగుతున్నారని’ వాళ్లని అడిగాడు. అప్పుడు అసలు విషయం చెప్పారు వాళ్లు. కానీ.. ఆయనకు వీడియోలు తీసే టెక్నిక్స్ అంతగా తెలియదు. అందుకే మొదట్లో కొడుకు సాయం తీసుకున్నాడు. కొడుకుని కూడా తనతోపాటు ట్రక్‌లో తీసుకెళ్లి వీడియోలు తీసేవాడు. అలా రాజేష్ యూట్యూబ్ ప్రయాణం మొదలైంది.
వీడియోల్లో...
పనిలో భాగంగా.. రాజేష్ రకరకాల ప్రాంతాలకు వెళ్తుంటాడు. అలా వెళ్లేటప్పుడే వీడియోలు తీస్తుంటాడు. రాజేష్‌కు వంట చేయడం అంటే ఇష్టం. ట్రక్ నడుపుతున్నప్పుడు రోజూ తనే వండుకుంటాడు. అప్పుడు కొత్త వంటకాలు కూడా ట్రై చేస్తుంటాడు. అలా ట్రక్‌లో వంట చేసుకుని తినే వీడియోలు ఎక్కువగా తీసి, అప్లోడ్ చేస్తుంటాడు. దాంతో అతని కుకింగ్ వీడియోలకు బాగా రీచ్ వచ్చింది. చాలా తక్కువ టైంలోనే సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య బాగా పెరిగింది. అతని యూట్యూబ్ ఛానెల్ ‘ఆర్ రాజేష్ వ్లాగ్స్’ని 2023 జనవరిలో పెట్టాడు.
ప్రస్తుతం దానికి1.99 మిలియన్ల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఇప్పటివరకు155 వీడియోలు అప్లోడ్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడు. దాంతో ఇన్‌స్టాలో కూడా రాజేష్ ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం1.4 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అతని ఛానెల్లో మిలియన్ వ్యూస్ దాటిన వీడియోలు బోలెడు. రాజేష్ షార్ట్ వీడియోలను అప్లోడ్ చేయడం కోసం ‘ఆర్ రాజేష్ షార్ట్స్’ పేరుతో మరో ఛానెల్ కూడా పెట్టాడు. ఈ ఛానెల్‌కు 1.63 మిలియన్ల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఇందులో అప్లోడ్ చేసిన ఒక వీడియోకు ఏకంగా 65 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇందులో10 మిలియన్ల వ్యూస్ దాటిని వీడియోలు కూడా ఎక్కువే.
లక్షల్లో ఆదాయం
రాజేష్ సోషల్ మీడియా ద్వారా ప్రతి నెలా లక్షల్లో సంపాదిస్తున్నాడు. ఈ మధ్య ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సంపాదన గురించి కూడా చెప్పాడు. కాకపోతే.. కొన్నిసార్లు యూట్యూబ్ ఆదాయాలు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. ఇప్పటివరకు అతనికి యూట్యూబ్ వచ్చిన నెలవారీ అత్యధిక సంపాదన10 లక్షల రూపాయలు. సాధారణంగా ప్రతినెలా నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు వస్తున్నాయి. ఆ డబ్బుతో సొంత ఇల్లు కట్టించుకునే పనిలో ఉన్నాడు.