చేసేది చిన్న ఉద్యోగం.. కొన్ని కారణాల వల్ల అదీ వదిలేయాల్సి వచ్చింది. తర్వాత ఏం చేయాలో తోచని పరిస్థితి. దాంతో చిన్న బిజినెస్ పెట్టుకున్నాడు. అందులోనూ కలిసిరాలేదు. ఇక చేసేదేం లేక.. యూట్యూబ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకున్నాడు. సీన్ కట్ చేస్తే.. కంటెంట్ క్రియేటర్‌గా ఫుల్ బిజీ అయిపోయాడు. ఒకప్పుడు వేలల్లో సంపాదించేందుకు ఇబ్బంది పడిన శివమ్ ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నాడు.
శివమ్ మాలిక్ బిహార్‌లోని పాట్నా సిటీలో 1991 జూన్ 12న పుట్టాడు. స్కూల్ నుంచి కాలేజీ వరకు పాట్నాలోనే పూర్తి చేశాడు. శివమ్ మాలిక్ తండ్రి సోహన్ మాలిక్ బ్యాంక్ ఉద్యోగి. తల్లి సుశీలా మాలిక్. డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో12వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత పాట్నా యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశాడు. చదువు పూర్తయ్యాక కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు కూడా చేశాడు. శివమ్ మాలిక్‌కు పాట్నాలో సొంత ఇల్లు ఉంది. అయినా.. ఇప్పుడు కుటుంబంతో సహా ఢిల్లీలో ఉంటున్నాడు. చిన్నప్పుడు ఏ లోటూ లేకుండా పెరిగినా.. పెద్దయ్యాక ఆర్థికంగా కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చింది.
ఉద్యోగం వదిలి...
శివమ్ చదువు పూర్తి కాగానే ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అప్పుడు అతనికి జీతం కూడా తక్కువగానే వచ్చేది. సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో మూడేండ్లు పనిచేశాడు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఉద్యోగం వదిలేయాల్సి వచ్చింది. తర్వాత గ్రేటర్ నోయిడాలో ఒక చిన్న పాన్‌షాప్ పెట్టుకున్నాడు. కానీ.. అదీ సక్సెస్ కాలేదు. ఏం చేయలేక నిరాశతో బిజినెస్ ఆపేయాల్సి వచ్చింది. అప్పటికే కరోనా వచ్చింది. దాంతో ఉద్యోగాలు దొరకడం కష్టమై పోయింది. అంతకుముందు చేసిన మార్కెటింగ్ జాబ్‌లో చేరేందుకు ట్రై చేసినా లాభం లేకుండా పోయింది.
ఉద్యోగం మానేశాక చాలా గ్యాప్ రావడంతో ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు శివమ్ జాతకం చెప్పించుకోవడానికి ఒక పండిట్‌ని కలిశాడు. అతను ఆ చేతిని చూసి ఆశ్చర్యపోయి ‘నువ్వుపూర్వజన్మలో రాజువి. నీకు మంచి రోజులు రానున్నాయి’ అని చెప్పాడు. కానీ.. ఆ మాటలు పెద్దగా పట్టించుకోలేదు శివమ్. కానీ.. ఈ రోజున అదే నిజం అయ్యింది. ఉద్యోగం లేకపోవడంతో శివమ్‌కు యూట్యూబ్‌లో వీడియోలు చేయాలనే ఆలోచన వచ్చింది.
ఆలోచన వచ్చిన వెంటనే కంటెంట్ క్రియేట్ చేసి అప్‌లోడ్ చేశాడు. కొన్ని నెలల్లోనే స్టార్ అయిపోయాడు. అతని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాత్రికి రాత్రే ఫాలోయింగ్ పెరిగిపోయింది. అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
టిక్‌టాక్ నుంచి
ఇండియాలో టిక్‌టాక్ బ్యాన్ కాకముందు అందులో సరదాగా షార్ట్ వీడియోలు చేసేవాడు శివమ్. ఆ ఎక్స్‌పీరియెన్స్‌తో యూట్యూబ్ వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. 2012లోనే యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టినప్పటికీ మొదటి వీడియోను 2020 మే 15న అప్‌లోడ్ చేశాడు. శివమ్ వీడియోలకు మొదటి నుంచి వ్యూస్ బాగానే వచ్చేవి. ఏడాది తిరిగేసరికి సోషల్ మీడియాలో పెద్ద స్టార్ అయిపోయాడు. ఛానెల్‌కు సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య పెరుగుతూ వచ్చింది. రెండేండ్లలోనే 7 మిలియన్ల మంది సబ్‌స్క్రయిబర్స్‌ని సంపాదించుకున్నాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలోవర్స్ పెరిగారు. ప్రస్తుతం అతని ఛానెల్‌కు 9.89 మిలియన్ల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఇప్పటివరకు 80 వీడియోలు అప్‌లోడ్ చేశాడు. ముఖ్యంగా గవర్నమెంట్‌ఉద్యోగాలు, మోటివేషన్, బిజినెస్ ఐడియాలపై ఎక్కువ వీడియోలు చేస్తుంటాడు. ‘శివమ్ మాలిక్ వ్లాగ్స్’ పేరుతో మరో యూట్యూబ్ ఛానెల్ కూడా నడుపుతున్నాడు. ఈ ఛానెల్‌కు 4.62 లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఇందులో120కి పైగా వీడియోలు అప్‌లోడ్ చేశాడు.
నెట్‌వర్త్
శివమ్ మాలిక్ మొత్తం ఆస్తి కోటి రూపాయలకు పైనే ఉంటుంది. నెలకు ఐదు నుండి ఏడు లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు. యూట్యూబ్ శాలరీ మాత్రమే కాకుండా బ్రాండ్ ప్రమోషన్స్ నుంచి కూడా డబ్బు వస్తోంది.