
ఆమెను సముద్రపు అలలు, అందమైన పర్వతాలు ఎప్పుడూ రారమ్మని పిలుస్తుంటాయి. అందుకే.. ఖాళీగా ఉంటే ఇంట్లో కాలు నిలిచేది కాదు. ఎప్పుడూ ఏదో ప్లేస్‌కి టూర్‌కి వెళ్తుండేది. ఆ ఇష్టంతోనే కొన్నాళ్లనుంచి అన్ని పనులు పక్కనపెట్టి, ఉద్యోగం మానేసి ట్రావెలింగ్‌నే కెరీర్‌గా ఎంచుకుంది తాన్యా ఖనిజో. సాధారణంగా చాలామంది ఆడపిల్లలు ఒంటరిగా దూర ప్రయణాలు చేయడానికి భయపడుతుంటారు. కానీ.. తాన్యా ఒంటరిగానే దేశాలు..
ఖండాలు దాటి వెళ్తోంది. అంతేకాదు.. అక్కడి అందాలు, కల్చర్, వింతలు, విశేషాలను తన కెమెరాలో బంధించి.. యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తోంది.
తాన్యా ఖనిజో.. ఇండియాలోని ఫేమస్ విమెన్ ట్రావెల్ వ్లాగర్స్‌లో ఒకరు. ఇప్పటివరకు అనేక దేశాలను ఎక్స్ప్లోర్ చేసింది. ఆమె ఢిల్లీలో పుట్టింది. తండ్రి భారత సైన్యంలో ఉద్యోగం చేసేవాడు. ఆయనకు తరుచూ ట్రాన్స్ఫర్స్ కావడం వల్ల దేశంలోని చాలా ప్రాంతాల్లో చదువుకుంది. అంటే ఆమెకు తెలియకుండానే చిన్నప్పుడే ట్రావెలర్ అయిపోయింది. తన తండ్రికి ట్రాన్స్ఫర్ అయిన ప్రతిసారి చాలా ఎగ్జైట్ అయ్యేది. మరో కొత్త ప్లేస్‌ని ఎక్స్ప్లోర్ చేసే అవకాశం దొరికిందని మురిసిపోయేది.
కొత్త ప్లేస్‌కి వెళ్లడమంటే ఆమెకు చాలా ఇష్టం. అలా.. చిన్నప్పటినుంచే ట్రావెలింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంజనీరింగ్ చదివేటప్పుడు కూడా వేసవి సెలవులు రాగానే బ్యాక్‌ప్యాక్ సర్దుకుని ఇంటి నుంచి బయల్దేరేది. అప్పట్లోనే ఆసియా, యూరప్‌ల్లో చాలా దేశాలు చుట్టేసింది. చదువు పూర్తైన తర్వాత ఫుల్ టైం ట్రావెలర్‌గా మారిపోవాలని నిర్ణయించుకుంది. కానీ.. కొన్ని కారణాల వల్ల ఢిల్లీలో ఒక సంస్థలో బిజినెస్ ఎనలిస్ట్‌గా ఉద్యోగంలో చేరింది.
అప్పుడు కూడా వీకెండ్స్‌లో, సెలవులు దొరికినప్పుడల్లా ఏదో ఒక ప్లేస్‌కి వెళ్లేది. ఆమెకు దొరికిన ప్రతి అవకాశాన్ని ట్రావెలింగ్ కోసమే వాడుకునేది. ఆ టైంలోనే చిన్న చిన్న వ్లాగ్స్ చేయడం మొదలుపెట్టింది. కానీ.. వాటికి పెద్దగా వ్యూస్ వచ్చేవి కాదు.
ఒకసారి పాండిచ్చేరిలో చేసిన వ్లాగ్కి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పటినుంచి తన ప్రయాణాల నుంచి సంపాదించిన జ్ఞాపకాలు, స్కిల్స్‌తో ఎలాగైనా డబ్బు సంపాదించుకోవచ్చు అనుకుంది. మొదటినుంచి కూడా ఆమెకు 9–5 జాబ్ చేయడం ఇష్టంలేదు. అందుకే కొన్నాళ్లకు ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి.. ట్రావెలింగ్ కెరీర్‌కు వెల్కమ్ చెప్పి... ఫుల్ టైం కంటెంట్ క్రియేటర్‌గా మారింది. ఇప్పుడు తన వ్లాగ్స్‌లో ట్రవెలర్స్ కోసం టిప్స్, ట్రిక్స్, ట్రావెల్ ప్లాన్స్ చెప్తూ.. అందరినీ ఆకట్టుకుంటోంది. తాన్యా ఇప్పటివరకు 40కి పైగా దేశాలకు వెళ్లింది. ఇండియాలోని మూల మూలలకు ట్రావెల్ చేసింది. ఈ మధ్యే తన బాయ్‌ఫ్రెండ్ ఇషాన్‌ని పెండ్లి చేసుకుంది. ఏ హడావిడి లేకుండా సింపుల్‌గా కోర్ట్ మ్యారేజ్ చేసుకున్నారు.
ఏడేళ్ల క్రితం..
తాన్యా 2012లోనే ‘‘తాన్యా ఖనిజో” పేరుతో యూట్యూబ్ చానెల్ పెట్టింది. కానీ.. అప్పట్లో వీడియోలు అప్లోడ్ చేయలేదు. ఏడేండ్ల క్రితం తన మొదటి వీడియోని పోస్ట్ చేసింది. ఇప్పటివరకు ఆమె 479 వీడియోలు అప్లోడ్ చేసింది. వాటిలో పది మిలియన్ల వ్యూస్ దాటిన వీడియోలు చాలానే ఉన్నాయి. కాకపోతే.. కొన్ని నెలలుగా లాంగ్ ఫార్మాట్ వీడియోలు చేయట్లేదు. షార్ట్ వీడియోలు మాత్రమే అప్లోడ్ చేస్తోంది.
ఇప్పటివరకు చానెల్‌ను 1.97 మిలియన్ల మంది సబ్స్క్రయిబ్ చేసుకున్నారు. తాన్యాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు పది లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఆమె పోస్ట్ చేసిన కొన్ని రీల్స్ చాలా వైరల్ అయ్యాయి. ఈ మధ్యే ఈ కామర్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘సోలో’ అనే బ్రాండ్‌నేమ్‌తో ఫ్యాషన్, యాక్సెసరీస్ ప్రొడక్ట్స్ అమ్ముతోంది.
ఫొటోగ్రఫీ అంటే..
తాన్యాకు ఫొటోగ్రఫీ, వీడియో గ్రఫీ కూడా చాలా ఇష్టం. ఆమె సోషల్ మీడియాలో కంటెంట్ చేయడానికి ఆ ఇష్టం కూడా ఒక కారణమే. యూట్యూబ్‌లో వీడియోలు చేయడం మొదలుపెట్టిన తర్వాత మరిన్ని స్కిల్స్ నేర్చుకుంది. అందుకే ఏ దేశం వెళ్లినా అక్కడి అందాలను చక్కగా తన కెమెరాలో బంధించి చూపిస్తోంది. తాన్యాకు ట్రావెలింగ్ అంటే ఎంత ఇష్టమో. ప్రకృతి అంటే కూడా అంతే ఇష్టం. అందుకే నేచర్‌కు మంచి చేసేందుకు తన వంతుగా కృషి చేస్తుంది. ఈ మధ్యే గంగా నదిని శుభ్రం చేసే కార్యక్రమంలో ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి పాల్గొన్నది.