చదువుకునే రోజుల్లో ప్రేమించుకున్నారు. చదువు పూర్తయ్యాక ఒకటయ్యారు. ఇద్దరూ కలిసి జీవిత ప్రయాణంతో పాటే ప్రపంచ ప్రయాణమూ మొదలుపెట్టారు. ఆ ప్రయాణంలో ఎదురయ్యే అనుభవాలు, అనుభూతులను యూట్యూబ్‌ద్వారా పంచుకుంటున్నారు కారా, నేట్. కొత్త ప్లేస్‌లను అన్వేషించడం, అక్కడి సంస్కృతులను తెలుసుకోవడం, ట్రావెలింగ్ చిట్కాలను పంచుకోవడమే వాళ్ల వీడియోల్లో మెయిన్ కంటెంట్.
కారా, నేట్.. అమెరికాలోని టేనస్సీ రాష్ట్రంలో ఉన్న నాష్‌విల్లే సిటీకి చెందినవాళ్లు. వాళ్లను ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానిస్తున్నారు. కారా అర్కాన్సాస్‌లోని జోన్స్‌బోరోలో పెరిగింది. ఆమెకు చిన్నప్పటినుంచి కొత్త ప్లేస్‌లను ఎక్స్ప్లోర్ చేయాలనే కోరిక ఉండేది. నేట్ నాష్‌విల్లేలో పెరిగాడు. అతనికి కూడా హోమ్‌టౌన్ నుంచి బయటికి వెళ్లి ప్రపంచాన్ని చూడాలనే కోరిక ఉండేది. కారా యూనివర్శిటీ ఆఫ్ అర్కాన్సాస్‌లో, నేట్ యూనివర్శిటీ ఆఫ్ టేనస్సీలో చదువుకున్నారు. ఇద్దరూ చదువుకునే రోజుల్లోనే ప్రేమలో పడ్డారు. చివరగా 2016లో పెండ్లి చేసుకున్నారు.
యూట్యూబ్ జర్నీ..
కారా, నేట్ పెండ్లి తర్వాత నాష్‌విల్లేలోని ఒక అపార్ట్మెంట్లో ఉండేవాళ్లు. హనీమూన్‌కి వెళ్లొచ్చాక.. ఏడాదిపాటు ట్రావెలింగ్ చేయాలని డిసైడ్ అయ్యారు. వెంటనే వాళ్ల కార్లు అమ్మేసి, చేస్తున్న పనులకు బ్రేక్ ఇచ్చి, ట్రావెలింగ్ మొదలుపెట్టారు. ఏడాది తర్వాత నాష్‌విల్లేకు తిరిగి వెళ్లిపోవాలనే ఉద్దేశంతోనే మొదటగా టోక్యో విమానం ఎక్కారు.
వాళ్ల ఎక్స్‌పీరియెన్స్‌ని ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకునేందుకు వాళ్ల ప్రయాణాలను డాక్యుమెంట్ చేయడం ప్రారంభించారు. తర్వాత ఆ వీడియోలనే యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. కాకపోతే.. అప్పట్లో ఇది ఒక సైడ్ ప్రాజెక్ట్‌గా ఉండేది. వీడియోలకు మంచి రెస్పాన్స్ రావడంతో కంటిన్యూ చేశారు.
అలా వాళ్ల యూట్యూబ్ జర్నీ మొదలైంది. ఏడాది తర్వాత కూడా వాళ్లకు ఇంటికి వెళ్లాలి అనిపించలేదు. అప్పటికే వాళ్ల వీడియోలకు చాలా వ్యూస్ వస్తున్నాయి. అందుకే ట్రావెలింగ్ మీదే ఫోకస్ పెట్టారు. అప్పుడే 100 దేశాలు తిరగాలని లక్ష్యంగా పెట్టుకుని, 2019 చివరినాటికి ఆ లక్ష్యాన్ని పూర్తి చేశారు.
అనుభవం లేదు
ట్రావెలింగ్ చేయాలనే కోరికతో బయల్దేరిన కారా, నేట్లకు అంతకుముందు వీడియో షూటింగ్, ఎడిటింగ్ మీద నాలెడ్జ్ లేదు. అయినా.. ప్రతి చిన్న విషయాన్ని నేర్చుకుని వీడియోలు చేశారు. నేట్ ఒక ప్రింటింగ్ కంపెనీని నడిపేవాడు. కారా ప్రీస్కూల్ టీచర్‌గా పనిచేసేది. వ్లాగింగ్ చేయడం పెద్దగా తెలియదు. అయినా.. ప్రతి వీడియోలో వాళ్లు చెప్పాలి అనుకున్న విషయాన్ని స్పష్టంగా అర్థమయ్యేలా వివరిస్తారు. వాళ్లు వెళ్లిన ప్రతి ప్లేస్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుని ఆ ఇన్ఫర్మేషన్ని వ్యూయర్స్‌కి చెప్తారు.
4 మిలియన్ల సబ్స్క్రయిబర్లు
కారా, నేట్‌లు ‘కారా అండ్ నేట్’ పేరుతో 2015 డిసెంబర్లో ఛానెల్ పెట్టారు. 2016 నుంచి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఛానెల్‌ని 4.03 మిలియన్ల మంది సబ్స్క్రయిబ్ చేసుకున్నారు. ఇప్పటివరకు 991 వీడియోలు అప్లోడ్ చేశారు. వాటిలో కొన్ని వీడియోలు పది మిలియన్ల వ్యూస్ మార్క్‌ని కూడా దాటాయి.
కారా, నేట్‌లు యూట్యూబ్‌లోనే కాకుండా ఫేస్బుక్, టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్ లాంటి ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో కూడా కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు. వాటి ద్వారా రకరకాల ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేస్తూ.. డబ్బు సంపాదిస్తున్నారు.
కరోనా టైంలోనూ ఆగలేదు
2020 నాటికే కారా, నేట్‌లు 100 దేశాల టార్గెట్‌ని కంప్లీట్ చేశారు. అంతలోనే కరోనా వచ్చింది. దాంతో సొంత దేశం అమెరికాకు తిరుగు ప్రయాణమయ్యారు. అప్పట్లో చాలా దేశాలు ఎంట్రీలను క్లోజ్ చేశాయి. అయినా.. ఖాళీగా ఉండకుండా వాళ్ల దేశాన్నే ఎక్స్ప్లోర్ చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం ప్రత్యేకంగా ఒక వ్యాన్ కొన్నారు.
దాన్ని ట్రావెలింగ్‌కి సరిపోయేలా మోడిఫై చేయించుకుని అమెరికాలోని దాదాపు అన్ని రాష్ట్రాలను ఎక్స్ప్లోర్ చేశారు. కరోనా తగ్గిన తర్వాత 2022లో మళ్లీ ట్రావెలింగ్ మొదలుపెట్టారు. వాళ్లు ఇండియాకు కూడా వచ్చారు. మన దగ్గర చాలా సిటీలను ఎక్స్ప్లోర్ చేశారు. ముఖ్యంగా ముంబై స్ట్రీట్ ఫుడ్, ఓల్డ్ ఢిల్లీ స్ట్రీట్స్, హోటల్స్, జైపూర్ అందాలను వ్యూయర్స్‌తో పంచుకున్నారు.