- మరింత పెరిగే ఛాన్స్
- కొత్త ఉద్యోగాలూ వస్తాయ్
న్యూఢిల్లీ: వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ కోసం కంటెంట్ క్రియేట్ చేసి మనోళ్లు ఏకంగా రూ. 6,800 కోట్లు సంపాదించారట. 2020 సంవత్సరంలో మన ఎకానమీకి ఈ ఆదాయం వచ్చిందని ఇండిపెండెంట్ కన్సల్టింగ్ కంపెనీ ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ రిపోర్టు వెల్లడించింది. మన దేశంలో యూట్యూబ్ ప్రభావం ఎకనమిక్, సొసైటీ, కల్చరల్‌గా ఎలా ఉందనే అంశాలని ఈ కన్సల్టింగ్ కంపెనీ స్టడీ చేసింది. మన జీడీపీకి రూ. 6,800 కోట్లు తేవడమే కాకుండా, 6,83,900 ఫుల్ టైమ్ ఈక్వవలెంట్ జాబ్స్‌ను కూడా యూట్యూబ్ 2020 లో ఇవ్వగలిగిందని స్టడీ తేల్చింది. యూట్యూబ్ ద్వారా వచ్చిన రెవెన్యూలో ఎడ్వర్టైజింగ్ రెవెన్యూతో పాటు, సబ్స్క్రిప్షన్స్, ఇతర మార్గాలలో మానిటైజేషన్ వంటి వాటినీ లెక్కలోకి తీసుకున్నట్లు ఈ కంపెనీ పేర్కొంది. అంతేకాదు, ఆఫ్ప్లాట్ఫామ్ రెవెన్యూలు (అంటే ఫ్యాన్ మీటప్స్, స్పాన్సర్షిప్స్వంటివి) కూడా ఉన్నాయని వివరించింది.
యూట్యూబ్ ఎకనమిక్ ఇంపాక్ట్ రెండు రకాలుగా ఉందని, ఒకటి కంటెంట్ క్రియేటర్లకు వచ్చిన లాభాలైతే (డైరెక్ట్ ఇంపాక్ట్), రెండోది, మొత్తం సప్లయ్ చెయిన్‌లో ఈ కంటెంట్ క్రియేషన్ కోసం చేసిన ఖర్చులు (ఇండైరెక్ట్ ఇంపాక్ట్) అని ఆక్స్‌పర్డ్ ఎకనమిక్స్ రిపోర్టు తెలిపింది. కంటెంట్ క్రియేటర్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేసిన ఉద్యోగుల జీతాలూ ఇందులో ఉన్నాయని పేర్కొంది. యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌పై ఆదాయం రావడంతోపాటు, కంటెంట్ క్రియేటర్లకు గ్లోబల్‌గా ఫ్యాన్ బేస్ ఏర్పడుతోందని..దీంతో బ్రాండ్ పార్ట్‌నర్షిప్స్, లైవ్ పెర్ఫార్మెన్స్, ఇతర మార్గాలలోనూ సంపాదించే వీలు కలుగుతోందని ఈ సందర్భంగా యూట్యూబ్ తెలిపింది. ఈ రెవెన్యూ మార్గాలు ఉద్యోగాలు క్రియేట్ చేయడమే కాకుండా, సప్లయ్ చెయిన్‌లో మరిన్ని ఆర్థిక అవకాశాలనూ కలిగిస్తున్నాయని యూట్యూబ్ పేర్కొంది. ఇండియాలో కంటెంట్ క్రియేటర్ ఎకానమీ మరింత ఎదిగే అవకాశం ఉందని యూట్యూబ్ పార్ట్‌నర్షిప్స్(ఆసియా–పసిఫిక్) రీజినల్ డైరెక్టర్ అజయ్ విద్యాసాగర్ వెల్లడించారు. కొత్త ఉద్యోగాలు వస్తాయని, సంస్కృతిపైనా కంటెంట్తన ప్రభావం చూపించగలుగుతుందని అన్నారు. డిజిటల్, సోషల్ మీడియా కంపెనీలకు ఇండియా పెద్ద మార్కెట్టని, స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు పెరగడంతోపాటు డేటా చీప్‌గా దొరకడంతో ఈ మార్కెట్ పటిష్టంగా ఎదుగుతోందని విద్యాసాగర్ చెప్పారు. సోషల్ మీడియా యూజర్లు భారీ సంఖ్యలో పెరిగారని అన్నారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం కిందటేడాది మన దేశంలో 44.8 కోట్ల మంది యూట్యూబ్ యూజర్లు ఉన్నారు.