తిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టుకు జగన్... సీబీఐ విచారణకు డిమాండ్..

ఏపీలో తిరుమల లడ్డూ వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం నెయ్యికి జంతు నూనె వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. చంద్రబాబు ఆరోపణలను  ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజల దృష్టి డైవర్ట్ చేసేందుకే చంద్రబాబు జగన్ పై నిందలు మోపుతున్నారంటూ కౌంటర్ ఇస్తోంది వైసీపీ. ఈ క్రమంలో తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ డిమాండ్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మెన్  వైవీ సుబ్బారెడ్డి ఈ అంశంపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. సుబ్బారెడ్డి తరపు లాయర్ సుధాకర్ రెడ్డి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎదుట ఈ అంశాన్ని ప్రస్తావించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జి, లేదా హైకోర్టు కమిటీ తో విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

Also Read:-జనసేనలో చేరికపై కేతిరెడ్డి రియాక్షన్ ఇదే..

సీబీఐతో విచారణకు ఆదేశాలివ్వాలని,నిజం నిగ్గు తేల్చాలని పిటీషన్ లో కోరారు సుధాకర్ రెడ్డి. వైసీపీ పిటిషన్ పై వచ్చే బుధవారం ( సెప్టెంబర్ 25, 2024 )విచారణ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఇవాళ ( సెప్టెంబర్ 20, 2024 ) మధ్యాహ్నం 3గంటలకు వైసీపీ అధినేత జగన్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారని సమాచారం. ఈ ప్రెస్ మీట్లో 100రోజుల కూటమి ప్రభుత్వ పాలనపై, తిరుమల లడ్డూ వివాదం గురించి ప్రస్తావిస్తారని తెలుస్తోంది.