జగన్ కేసులో ఈడీ దూకుడు: రూ.800 కోట్ల విలువైన జగన్, దాల్మియా సిమెంట్స్ ఆస్తులు అటాచ్

జగన్ కేసులో ఈడీ దూకుడు: రూ.800 కోట్ల విలువైన జగన్, దాల్మియా సిమెంట్స్ ఆస్తులు అటాచ్

ఇన్నాళ్లు నత్తనడకన సాగుతున్న జగన్ ఆస్తుల కేసులకు సంబంధించి.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఒక్కసారిగా దూకుడు చూపిస్తోంది. జగన్ మాజీ సీఎం అయిన తర్వాత వేగంగా అడుగులు పడుతున్నాయి. పన్నెండేళ్ల క్రితం నాటి క్విడ్ ప్రో కేసులో.. అప్పట్లో జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన దాల్మియా సిమెంట్స్ కేసులో ఈడీ.. ఇప్పుడు ఆస్తులు అటాచ్ చేసింది. జగన్, దాల్మియా సిమెంట్స్కు చెందిన 800 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేయటం సంచలనంగా మారింది.

తాడేపల్లి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైఎస్ జగన్కు ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఝలక్ ఇచ్చింది. హైదరాబాద్ ఈడీ అధికారులు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్కు సంబంధించిన 27.5 కోట్ల షేర్లను జప్తు చేశారు. అంతేకాదు.. దాదాపు 12 ఏళ్ల తర్వాత దాల్మియా సిమెంట్స్ ఆస్తులను కూడా ఈడీ జప్తు చేసింది. ఈ ఆస్తుల విలువ 793. 3 కోట్లు.. అంటే దాదాపు 800 కోట్ల రూపాయల దాల్మియా సిమెంట్స్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈడీ స్వాధీనం చేసుకున్న దాల్మియా ఆస్తుల్లో సుమారు 407 హెక్టార్ల సున్నపు రాయి గనులు, ఇంకొన్ని ఆస్తులు ఉన్నాయి.

దాల్మియా సిమెంట్ కంపెనీకి కడప జిల్లాలో సున్నపు రాయి గనులు ఇచ్చినందుకు జగన్ పెట్టిన కంపెనీల్లోకి నిధులు మళ్లించి క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారనేది ఈడీ ప్రధాన అభియోగం. 2013లో దాల్మియా సిమెంట్స్ పై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్ ను సవాల్ చేస్తూ దాల్మియా సిమెంట్స్ న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది. సుదీర్ఘ విచారణ తర్వాత లీగల్ అడ్డంకులు తొలగిపోవడంతో తాజాగా దాల్మియా ఆస్తులను ఈడీ జప్తు చేసింది.