చంద్రబాబు సర్కార్ 50రోజుల పాలనపై ప్రెస్ మీట్ నిర్వహించిన జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశ పెట్టే ధైర్యం లేదు కాబట్టే 7నెలల వరకు వోట్ ఆన్ అకౌంట్ మీదనే కొనసాగిస్తున్నారని అన్నారు. దీన్ని బట్టి రాష్ట్ర ఆర్థికపరిస్థితి అర్థమవుతుందని అన్నారు. ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన మోసపూరిత హామీల గురించి చెప్పాల్సి వస్తుంది కాబట్టే చంద్రబాబు రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశ పెట్టలేదని అన్నారు.
రాష్ట్రం పురోగతివైపు వెళ్తుందా, రివర్స్ లో వెళ్తుందా అన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారని అన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్రం 14లక్షల కోట్ల అప్పుల్లో ఉందని చెప్పి సూపర్ 6 హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ఆ లెక్కలు చూపించటానికి పడరాని పాట్లు పడుతున్నారని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో 10లక్షల కోట్లు అప్పు ఉన్నట్లు చూపించారని, శ్వేతపత్రాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
Also Read:-రాష్ట్రంలో అరాచక పాలన.. చంద్రబాబుపై వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్
చంద్రబాబు దిగిపోయే సమయానికి 2019వరకు 2లక్షల 72వేల కోట్ల అప్పు ఉందని, వైసీపీ హయాంలో అది 5లక్షల 18వేల కోట్లకు చేరిందని అన్నారు. గ్యారెంటీలు, విద్యుత్ ఒప్పందాలు వంటివి కలిపినా కూడా 7లక్షల 48వేల కోట్లు అప్పు మాత్రమే అవుతుందని అన్నారు. అయినప్పటికీ గవర్నర్ ప్రసంగంలో అబద్దాలు చెప్పించారని, ఇలా 14లక్షల కోట్లు అంటూ అసత్య ప్రచారం చేయటం ధర్మమా అని ప్రశ్నించారు. వాస్తవాలపై గవర్నర్ కు లేఖ రాస్తామని, ఆయనతో అబద్దాలు చెప్పించిన అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తామని అన్నారు జగన్.