రైతు బాగుంటేనే… రాష్ట్రం బాగుంటుందని గుర్తుపెట్టుకోండి చంద్రబాబూ…

ఆంధ్రప్రదేశ్​  సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఎదుట  కీలక డిమాండ్ పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2023-24 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఉచిత పంట బీమా ప్రీమియాన్ని ప్రభుత్వం ఇప్పటివరకూ చెల్లించలేదన్నారు. ఈ మేరకు రైతుల ఉచిత పంట చెల్లింపులపై జగన్ మోహన్ రెడ్డి తాజాగా ఓ ట్వీట్ చేశారు.

 రైతులకు ఉచిత పంటల బీమా చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఉచిత పంటల బీమా ప్రీమియాన్ని తమ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా ఏప్రిల్‌, మే నెలలో చెల్లించేవాళ్లమని గుర్తు చేశారు. అంతేకాదు నష్టపోయిన రైతులను జూన్‌లో ఆదుకున్నామని తెలిపారు.  ఖరీఫ్‌ పంట వేసే సమయానికి రైతులపై పైసా భారంపడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించిందన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించిన వెంటనే కేంద్రం కూడా వెంటనే తన వాటా కూడా విడుదలచేస్తుందని తెలిపారు. ఇది జరిగిన సుమారు 30 రోజుల్లోగా బీమా కంపెనీ పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తుందన్నారు. అదే మాదిరిగా తమ ప్రభుత్వ హయాంలో 54.55 లక్షల మంది రైతులకు గతంలో ఎన్నడూలేని విధంగా రూ.7వేల 802 కోట్లు అందించి వారికి అండగానిలిచామని చెప్పారు. తద్వారా ఉచిత పంటల బీమా విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని జగన్ తెలిపారు.

 2023-24 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఎన్నికల కోడ్‌ కారణంగా ప్రీమియం చెల్లింపులు నిలిచిపోయాయి. ఆ తర్వాత వచ్చిన మీ ప్రభుత్వం వెంటనే స్పందించి చెల్లించాల్సి ఉన్నప్పటికీ దానిగురించి పట్టించుకోవడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ప్రీమియం కట్టకపోవడంతో కేంద్రం కూడా తన వాటాను ఇప్పటికీ ఇవ్వలేదు. ఇప్పటికి జూన్‌, జులై మాసాలు గడిచిపోయాయి. ఆగస్టు నెలలో పక్షం రోజులు పూర్తికావొస్తున్నాయి. అయినా మీ ప్రభుత్వంలో ఎలాంటి కదలికలేకపోవడం అత్యంత విచారకరం. ఈ సంవత్సరం కోస్తాలో అతివృష్టి, రాయలసీమలో కరువు వల్ల పంటల దెబ్బతినే ప్రమాదం నెలకొంది.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనతవల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటికైనా మేలుకుని వెంటనే ఉచిత పంటల బీమా ప్రీమియం తక్షణమే చెల్లించి రైతులకు పంటల బీమా కింద చెల్లింపులు జరిగేలా చర్యలను చేపట్టాలి.’’ అని వైసీపీ అధినేత జగన్ టీడీపీ ప్రభుత్వాన్ని ట్విట్టర్​ ద్వారా  డిమాండ్ చేశారు.