తల్లి, చెల్లిపై ఎన్సీఎల్టీకి జగన్

తల్లి, చెల్లిపై ఎన్సీఎల్టీకి జగన్
  • సరస్వతి పవర్​లో షేర్ల బదలాయింపు రద్దు చేయాలని పిటిషన్  

హైదరాబాద్, వెలుగు : వైఎస్ కుటుంబంలో ఆస్తుల లొల్లి కోర్టుకెక్కింది. వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మధ్య నెలకొన్న ఆస్తుల వివాదం తారాస్థాయికి చేరింది. తన తల్లి విజయమ్మ, చెల్లె షర్మిలపై నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో జగన్ ఫిర్యాదు చేశారు. సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలో తల్లి విజయమ్మకు తాను గిఫ్ట్‌ డీడ్‌గా ఇచ్చిన షేర్లను.. తనకు తెలియకుండా షర్మిలకు బదలాయించారని, దీన్ని రద్దు చేయాలని ఎన్సీఎల్టీని కోరారు.

సరస్వతి పవర్‌ కంపెనీలో 99 శాతం షేర్లు జగన్‌కు, 1 శాతం షేర్లు విజయమ్మకు ఉన్నాయి. సీబీఐ, ఈడీ కేసుల్లో భాగంగా ఈ ఆస్తులను కూడా అటాచ్ చేశారు. వీటిపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. అయితే సరస్వతి సిమెంట్స్‌లో షర్మిలకు 49 శాతం షేర్లు ఇస్తానని జగన్‌ గతంలో చెప్పారు. నేరుగా షర్మిలకు బదిలీ చేయడం చట్ట విరుద్ధం కాబట్టి.. అప్పటికే 1 శాతం వాటాదారుగా ఉన్న తల్లికి ఈ షేర్లపై గిఫ్ట్‌ డీడ్‌ రాసిచ్చారు.

కేసులు తేలాక షర్మిల పేరు మీద బదిలీ చేసుకోవచ్చని జగన్‌ ఈ గిఫ్ట్‌డీడ్‌ను రాసిచ్చారు. కోర్టు కేసులు, అటాచ్‌మెంట్ లో ఉన్న ఆస్తిని క్రయవిక్రయాలు చేయడానికి వీల్లేదు. కానీ జగన్‌ ఇచ్చిన గిఫ్ట్‌ డీడ్‌ను ఆధారంగా చేసుకుని విజయమ్మ దగ్గరి నుంచి షేర్లను షర్మిల బదిలీ చేయించుకున్నారు. కోర్టుల్లో కేసులు ఉండడంతో లీగల్ గా ఇబ్బందులు ఎదురవుతాయని న్యాయవాదులు హెచ్చరించడంతో జగన్‌ ఎన్సీఎల్టీని ఆశ్రయించారు.