మరో 25-30 ఏళ్లు రాజకీయాల్లోనే ఉంటా.. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: వైఎస్ జగన్

మరో 25-30 ఏళ్లు రాజకీయాల్లోనే ఉంటా.. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: వైఎస్ జగన్

గుంటూరు: మరో 25-30  ఏళ్లు రాజకీయాల్లోనే ఉంటానని.. అన్యాయానికి పాల్పడుతోన్న వారిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం (ఫిబ్రవరి 12) ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ కీలక నేతలతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని తాజా రాజకీయా పరిస్థితులపై జగన్ ఆరా తీశారు. వైసీపీ నేతలపై బనాయిస్తోన్న కేసుల విషయాన్ని ఈ సంద్భరంగా నాయకులు అధినేత దృష్టికి తీసుకొచ్చారు. 

అనంతరం జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ప్రశ్నిస్తోన్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు.. రాబోయే రోజుల్లో మరిన్ని  కేసులు పెడతారు.. టీడీపీ కూటమి అక్రమ కేసులకు ఎవరు భయపడొద్దని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చేది జగన్ 2.0 పాలనేనని.. రాజకీయ నాయకుల అండ చూసుకుని రెచ్చిపోతున్న అధికారులు ఎవరిని వదిలిపెట్టమని జగన్ హెచ్చరించారు. నాయకుల మోచేతి నీళ్లు తాగుతూ తప్పులు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేర్చవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని.. టీడీపీ నేతలు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదని అన్నారు. 

Also Read :- దావోస్ తర్వాత నుంచి పవన్ దూరం

ఎన్నికల్లో బాబు ఇచ్చిన షూరిటీ.. మోసానికి గ్యారెంటీగా మారిందని ఎద్దేవా చేశారు జగన్. రాష్ట్రంలో స్కాములు తప్ప ఏమీ జరగడం లేదని.. ఏ పని జరగాలన్న లంచాలు ఇవ్వాల్సిందేనని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు ఎన్నికలను హామీలను ఎగ్గొట్టారు.. అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారని విమర్శించారు. ఎన్నికల హామీలను ఎగ్గొట్టిన చంద్రబాబు చీటర్ కాదా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్.