అమరావతి: ప్రతిపక్ష హోదాపై ఏపీ హైకోర్టులో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిపక్ష హోదా కల్పించేలా ఏపీ అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించాలని హైకోర్టును మంగళవారం నాడు జగన్ ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ఇప్పటికే లేఖ రాశానని, అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పిటిషన్లో వైఎస్ జగన్ పేర్కొన్నారు. వైసీపీ శాసనసభా పక్షానికి వైఎస్ జగన్ నాయకుడిగా ఉన్నారని, ఆ హోదాలో అసెంబ్లీలో గళం వినిపించాలని కొందరు టీడీపీ నేతలు జగన్కు హిత బోధ చేశారు.ప్రతిపక్ష నేత అనే ఆలోచన నుంచి బయటకు వచ్చి సమావేశాలకు రావాలని ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు జగన్కు సూచించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 11 స్థానాల్లో మాత్రమే గెలిచి వైసీపీ ప్రతిపక్ష హోదాను కోల్పోయిన సంగతి తెలిసిందే.
Also Read:-హరిరామజోగయ్య పిటిషన్ ఆగస్టు 20 కి వాయిదా
1977లో రూపొందించిన నిబంధనల ప్రకారం పార్లమెంట్ లేదా శాసనసభలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే ఆ సభలో పార్టీకి కనీసం 10 శాతం సభ్యులుండాలి. ఏపీ అసెంబ్లీలో 18 సీట్లు దక్కిన రాజకీయ పార్టీకే ప్రధాన ప్రతిపక్ష హోదాను కల్పించే పరిస్థితి ఉంటుంది. వైసీపీ 11 అసెంబ్లీ స్థానాలను మాత్రమే దక్కించుకోవడంతో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పులివెందుల ఎమ్మెల్యేగానే అసెంబ్లీలో మిగిలిపోవాల్సి వచ్చింది. ప్రతిపక్ష నేత హోదా దక్కితే కొన్ని సదుపాయాలను పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వైఎస్ జగన్కు ఆ అవకాశం లేకుండా పోయింది. వాస్తవానికి ఏపీలో ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ వైసీపీనే అయినప్పటికీ అసెంబ్లీలో ఆ హోదా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టు ఎలా స్పందిస్తుందనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.