జగన్ తిరుమల పర్యటన రద్దుకు కారణం ఇదే

జగన్ తిరుమల పర్యటన రద్దుకు కారణం ఇదే

చంద్రబాబు సర్కార్ 100 రోజుల పాలన వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే తిరుపతి లడ్డూ ఇష్యూ తెరపైకి తెచ్చారు. ఇప్పుడు మళ్లీ లడ్డూ వివాదాన్ని డైవర్ట్ చేసేందుకే డిక్లరేషన్ టాపిక్ లేవనెత్తారని ఏపీ మాజీ సీఎం, వైసీసీ అధినేత జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో తన రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోందని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. రేపటి (సెప్టెంబర్ 28) తిరుమల పర్యటన రద్దు చేసుకోవడానికి గల కారణాలను జగన్ మీడియాకు వివరించారు.

దేవుడి దర్శనానికి వెళ్దామనుకుంటే అడ్డుకునే పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పుడూ చూడలేదని అసహనం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్ర మాజీ సీఎం దేవుడి దర్శనానికి వెళ్తే అనుమతి లేదంటున్నారు. నోటీసులు ఇచ్చి అడ్డుకునే ప్రయత్నాం చేశారు. ఓ వైపు నన్ను.. మరోవైపు వైసీపీ కార్యకర్తలను తిరుమలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడిని దర్శించుకునే హక్కు నాకు లేదా అని ప్రశ్నించారు. 

ALSO READ | సీజేఐ కు APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి లేఖ: తిరుమల లడ్డూ వివాదాన్ని సుమోటోగా స్వీకరించండి

తన పర్యటనను అడ్డుకునేందుకు చుట్టు ప్రక్కల రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్లను తిరుమలకు రప్పించారని ఆరోపించారు. లడ్డూ టాపిక్‌ డైవర్ట్‌ చేయడం కోసం ఎందుకింత ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజకీయ స్వార్థం కోసం సీఎం చంద్రబాబు అడ్డగోలుగా తిరుమల పవిత్రతను దెబ్బతీశారు.. ఇప్పుడు డిక్లరేషన్‌ పేరుతో మరోసారి రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తిరుమల విశిష్టతను, ప్రసాదం పవిత్రతను రాజకీయ దురుద్దేశంతో దెబ్బతీస్తున్నారన్న జగన్.. జరగని విషయాన్ని జరిగినట్టుగా కల్తీ నెయ్యి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

 ఓ ముఖ్యమంత్రే సాక్షాత్తూ తిరుమలను దగ్గరుండి అపవిత్రం చేస్తున్నారని చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెయ్యి కొనుగోలు చేసే కార్యక్రమం ప్రతి 6 నెలలకోసారి రోటీన్‌గా జరిగే కార్యక్రమమని.. తమ ప్రభుత్వ హయంలో కూడా ఇదే మాదిరిగా జరిగిందని స్పష్టం చేశారు. లడ్డూపై సీఎం చంద్రబాబు చెప్పినవన్నీ పచ్చి అబద్దాలేనని.. సాక్ష్యాలతో సహ నిరూపిస్తామని జగన్ పేర్కొన్నారు. లడ్డూ ఇష్యూలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడని అన్నారు.