యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోండి.. తిరుపతి తొక్కిసలాట ఘటనపై YS జగన్ దిగ్భ్రాంతి

యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోండి.. తిరుపతి తొక్కిసలాట ఘటనపై YS జగన్ దిగ్భ్రాంతి

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర జరిగిన తోపులాటలో నలుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. తొక్కిసలాటలో నలుగురు భక్తులు మృతి చెందడంపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన భక్తుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తొక్కిసలాటలో అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఘటన స్థలంలో పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు. 

ALSO READ | తిరుపతిలో తొక్కిసలాట.. నలుగురు భక్తులు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు..!

తిరుమలలో తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం బుధవారం (జనవరి 8) భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నలుగురు భక్తులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఒకరిని ఒకరిని తమిళనాడు సేలంకి చెందిన మహిళగా గుర్తించారు పోలీసులు. విష్ణునివాసం వద్ద టోకెన్ల జారీ కేంద్రంలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందినట్లు తెలుస్తోంది.

అలిపిరి, శ్రీనివాసం, సత్యనారాయణపురం, పద్మావతిపురం పార్క్ ప్రాంతాల్లో కూడా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.