ఏపీలో చంద్రబాబు అరాచక పాలన నడుస్తుంది : జగన్

ఏపీలో టీడీపీ కూటమి అరాచకపాలన సాగుతుందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్. నెల్లూరు జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు జగన్. పిన్నెల్లిని అక్రమంగా అరెస్ట్ చేశారని.. దొంగ కేసులు పెట్టారని.. వాళ్లే కొట్టి.. మాపైనే కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. 2024, జూలై 4వ తేదీ ఉదయం నెల్లూరులోని సబ్ జైలులో పిన్నెల్లిని పరామర్శించి దైర్యం చెప్పారు జగన్. 

వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు.. కులం చూడలేదు.. మతం చూడలేదు.. ప్రాంతం చూడలేదు.. రాజకీయ పార్టీ కూడా చూడకుండా ప్రతి పథకం.. ప్రతి కుటుంబానికి.. అర్హత ప్రామాణికంగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారాయన. ఇప్పుడు పరిస్థితులు అలా లేవని.. టీడీపీకి ఓటు వేయలేదని.. టీడీపీకి సపోర్ట్ చేయలేదనే కారణంగా దాడులు చేస్తు్న్నారని.. ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు జగన్.

ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేసి ఓట్లు వేయమని అడిగే పరిస్థితులు ఉండాలని.. అందుకు భిన్నంగా భయపెట్టి.. ఆస్తులు ధ్వంసం చేసి.. దాడులు చేసి భయపెట్టే రాజకీయాలు మంచిది కాదన్నారు జగన్. చంద్రబాబులో మార్పు రావాలని సూచించారు. 

ప్రజల్లో వ్యతిరేకత వల్ల వైసీపీ ఓడిపోలేదని.. ప్రజలకు మంచి చేసి ఓడిపోయిందన్నారు.. సీఎం చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీలను నమ్మి ప్రజలు ఓటు వేశారని.. అది కూడా 10 శాతం ఓటర్లు మాత్రమే కూటమి వైపు వెళ్లారన్నారు. పంటలు వేసే కాలం వచ్చిందని.. రైతు భరోసా ఇస్తానన్న 20 వేల రూపాయలు ఇంకా ఇవ్వలేదన్నారు.. స్కూల్స్ ప్రారంభం అయ్యాయని.. బాబు వస్తే ఎంత మంది పిల్లలు ఉంటే.. అంత మంది పిల్లలకు 15 వేలు ఇస్తామని చెప్పారని.. ఆ డబ్బులు ఇచ్చే పని చూడాలంటూ సీఎం చంద్రబాబుకు సూచించారు జగన్.

ఏపీలో 2 కోట్ల 18 లక్షల మంది 18 ఏళ్లు నిండిన మహిళా ఓటర్లు ఉన్నారని.. ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యనే స్పష్టం చేస్తుందని.. ప్రతి మహిళకు నెలకు 15 వందల రూపాయలు ఇస్తానన్న డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారాయన.

సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను డైవర్ట్ చేయటానికే.. వైసీపీ దాడులు చేస్తు్న్నారని.. వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని.. ఇలా చేస్తూ పోతే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు జగన్.