పల్నాడు జిల్లా వినుకొండలో బుధవారం జరిగిన వైసీపీ యువనేత దారుణ హత్య ఏపీలో కలకలం రేపింది. వైసీపీ యువజన విభాగం నాయకుడు రషీద్ ను నడిరోడ్డుపై కిరాతకంగా చేతులు, మెడ నరికి చంపేశాడు జిలాన్. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే రెండు చేతులు, మెడ నరికి పాశవికంగా హత్య చేశాడు జిలాన్. రెండు చేతులు రోడ్డుపై తెగిపడి, మెడకు తీవ్ర గాయమై రక్తపు మడుగులో కుప్పకూలి చనిపోయాడు రషీద్. ఈ దారుణకాండపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించటం లేదని ట్వీట్ చేశారు జగన్.
Also Read:-ఏపీలో ఘోరం: నరికితే రెండు చేతులు రోడ్డుపై తెగిపడ్డాయి
వైసీపీని అణగదొక్కాలన్న కోణంలోనే ఈ దారుణాలకు పాల్పడుతున్నారని కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట అని, నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, పోలీసు సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారని అన్నారు.
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడంలేదు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైయస్సార్సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు,…
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 18, 2024
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు.రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితులపై దృష్టిపెట్టాలని ప్రధానమంత్రి శ్రీ మోదీగారికి, హోంమంత్రి మంత్రి శ్రీ అమిత్‌షాగారికి విజ్క్షప్తిచేస్తున్నానని, వైసీపీ కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దని అన్నిరకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానంటూ ట్వీట్ చేశారు జగన్.