వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం(సెప్టెంబర్ 13) కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మాధవపురం, ఇసుకపల్లి, నాగులపల్లితో పాటు మరికొన్ని గ్రామాల్లో వరదల కారణంగా నీట మునిగిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. పంట నష్టంపై వరద బాధిత కుటుంబాలతో మాట్లాడారు. బాధితులకు వైసీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
ఈ సంధర్బంగా రైతులు నీట మునిగిన వరి నాట్లను వైసీపీ అధినేతకు చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవడం లేదని వాపోయారు. ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున పనిచేసిన మహిళలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తమరే ఏదో ఒకటి చేసి తమను ఆదుకోవాలని విన్నవించుకున్నారు.