హైదరాబాద్, వెలుగు: తనను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడిని వైసీపీ చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలనే నిబంధన చట్టంలో ఎక్కడా లేదని వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఏపీ స్పీకర్ కు లెటర్ రాశారు. తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వొద్దని ముందే నిర్ణయించినట్లు ఉన్నారని జగన్ తన లేఖలో ఆరోపించారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉందని తెలిపారు.
మంత్రుల తర్వాత తనతో ప్రమాణస్వీకారం చేయించడం అసెంబ్లీ సంప్రదాయాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష హోదాకు 10 శాతం సీట్లు ఉండాలన్న రూల్ చట్టంలో లేదని.. పార్లమెంటులో గానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ ఈ నిబంధన పాటించలేదని చెప్పారు. అధికార కూటమి, స్పీకర్ ఇప్పటికే తన పట్ల శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారని జగన్ ఆరోపించారు.
చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయని, ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడంలేదని తెలిపారు. ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందన్నారు. ప్రతిపక్ష హోదాతోనే సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందని, ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని లేఖను పరిశీలించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జగన్ రిక్వెస్ట్ చేశారు.